Published : 27 Oct 2021 12:45 IST

జమున స్వ‘గతం’!

అలంకరణ లేకున్నా అందంగా ఉంటారు అందాల జమున. సాంఘికాల్లో గౌరిగా, జానపదాల్లో రాణిగా, పౌరాణికాల్లో సత్యగా ఏ పాత్రకు ఆ పాత్రవేసి న్యాయం చేసి జీవం పోశారు. జమున జాలినే కాదు.. ముక్కు మీద కోపాన్ని మురిపెంగా చూపించగలరు. ముగ్గుబుట్టలాంటి తలతో ముసలి వేషాన్నీ ఒప్పించగలరు. అలా అనేక రకాల పాత్రలు వేసి అవార్డులను, అశేష ప్రజాభిమానాన్ని పొందారు. సినిమాలకు దూరమైనా, రాజకీయాల ద్వారా స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు ప్రజానటి జమున.


30ఏళ్ల కథానాయికగా ఒక్కసారి గత జీవితాన్ని, కళాకారిణిగా అనుభూతుల్ని, మధురస్మృతుల్ని గుర్తు చేసుకుంటే.. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.
*నేను హంపిలో పుట్టాను. హంపి గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకీ. అది విజయనగర సామ్రాజ్యం రాజధాని. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఆ హంపిలో నేను పుట్టాను. అందుకే ఆ రోజుల్లో నాకో పేరు ఉండేది. ‘హంపీ సుందరి’ అంటుండేవాళ్లు. కానీ పుట్టింది కర్ణాటకలోనైనా చదివిందంతా కూడా దుగిరాన్‌ అనే గ్రామంలో. మెట్రిక్‌ వరకూ చదువుకున్నాను ఆ రోజుల్లోనే. చిన్నతనం నుంచి నాకు కళాభిరుచి ఎక్కువ. చిన్నచిన్న డ్యాన్సులు చేస్తుండేదాన్ని. స్కూల్‌కి పెద్దపెద్ద రాజకీయనాయకులు వస్తుండేవారు. ఆ సమయంలో మాస్టర్‌గారు నా చేత స్టేజిమీద పాటలు పాడించేవారు. అలా దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్లు వచ్చేసరికి నాటకాల్లో చేశాను. అందులో ముఖ్యంగా ‘మా భూమి’ అనే నాటకం ప్రసిద్ధి చెందింది. మా భూమి, దిల్లీ ఛలో, విందు లాంటి నాటికల్లో నటించాను. ఆ రోజుల్లో చిన్నతనంలోనే విందు నాటికలో యశోదగా నటించి, దానికి దర్శకత్వం కూడా వహించి.. మ్యూజిక్‌ కూడా కంపోజ్‌ చేశాను. ఆ విధంగా నాకు పది పన్నెండేళ్ల వయస్సు వచ్చేసరికే చిన్న నాటక అనుభవం దక్కింది. నాటకాన్ని వృత్తిగా స్వీకరించకపోయినా.. నటనలో ఓనమాలు దిద్దుకుంది నాటక రంగంలోనే.
* నాటక రంగానికి ఎనలేని సేవ అందించినటువంటి డా.రాజారావు గారు ‘పుట్టిల్లు’ అని ఒక సినిమా తీస్తున్నారు. అందులో కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో.. దానికోసం వెతుకుతూ ఉన్నారు. ఆ టైంలో నా నాటకాన్ని చూశారు. తర్వాత ఆ సినిమాలో వేషానికి నేను బాగుంటానన్న ఉద్దేశంతో మా ఊరికి ఒక ఫొటోగ్రాఫర్‌ని పంపించి, నా ఫొటోలు తీయించారు.
‘పుట్టిల్లు’ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. ఆ రోజుల్లో బాంబే నుంచి వీఎన్‌ రెడ్డి కెమెరామన్‌గా వచ్చేవారు. ఆయన గొప్ప ఫొటోగ్రాఫర్‌. ఆయన ఫొటోగ్రఫీలో నటించాలని ఆ రోజుల్లోనే ఆ నాటి టాప్‌ ర్యాంకులోని పెద్దపెద్ద తారామణులందరూ కూడా ఫొటోలు పంపించి ఈ ‘పుట్టిల్లు’లో తాము నటించాలని, వీఎన్‌రెడ్డి ఫొటోగ్రఫీలో తాము నటించాలని చెప్పారు. చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆ సందర్భంలో నా ఫొటో ఒకటి చిన్నది.. ఒక పల్లెటూరి అమ్మాయి, పిలక జడవేసుకున్నది చూశారు. మేకప్‌ లేదు..ఏమీ లేదు (నవ్వుతూ). ఆ ఫొటో వీఎన్‌రెడ్డిగారికి బాంబేకి పంపించారు. కానీ ఆ రోజుల్లో టెక్నిషియన్స్‌ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి.. ఒక కొత్త కళాకారుడిలో ఉన్న ప్రతిభని చక్కగా గుర్తించేవారు. ఏమీ తెలియని ఓ పల్లెటూరి అమ్మాయి ముఖం చూస్తూనే, ఆ ఫొటోచూసిన వెంటనే ఓ టెలిగ్రామ్‌ ఇచ్చారు రాజారావుగారికి. ఈ అమ్మాయికి నర్గీస్‌ పోలికలు ఉన్నాయి. పుట్టిల్లులో హీరోయిన్‌ పాత్రకి జమున సరిపోతుంది. ఆ అమ్మాయిని బుక్‌ చేయండని చెప్పడం.. తరువాత డా.రాజారావుగారు దుగిరాన్‌లో నేను చదువుకుంటుంటే.. ఆ సమయంలో నాకు కబురు పెట్టి, పుట్టిల్లు చిత్రం ద్వారా మొట్టమొదట కథానాయికగా నటింపజేశారు. 
*జగయ్య గారు విద్య నేర్పించినటువంటి గురువాయన. అప్పుడు బహుశా నేను ఎనిమిది తొమ్మిదేళ్ల అమ్మాయిని. ఆయన నన్ను తీసుకెళ్లి నా చేత డ్యాన్స్‌ చేయించారు. అక్కడ చాలా గారాబంగా పెరిగిన అమ్మాయిని నేను. నన్ను తెనాలికి తీసుకొని వెళ్లారు. తెనాలి వరకూ నేను జట్కా బండిలో వెళ్లా. ఇప్పటి మాదిరి ఆ రోజుల్లో కార్లు.. అవీ లేవు. అక్కడి నుంచి పడవలో అవతలికి ఒడ్డున దిగగానే.. నన్ను నడిపించడం మొదలుపెట్టారు జగయ్యగారు. దాంతో.. చిన్నప్పట్టి నుంచి ఆ గారాబం, పెంకితనం కూడా ఉండేదేమో.. పొలాల వెంట నడుస్తూ ఉన్నాను. ఇంతలో ఓ పాము పిల్ల వచ్చింది. అది చూసి ఎగిరి గెంతేసి .. మీరు గుండమ్మకథలో చూసే ఉంటారు.. అమ్మా కాఫీ అని టపాటపా కాళ్లు ఊపుతుంటాను.. అలా నేలమీద కాళ్లేసి కొట్టి, నేను రానన్నాను. చాలాసార్లు తమాషా చేస్తుంటారు జగయ్యగారు. ఈ పిల్ల ఒట్టి పెంకిపిల్ల.. నన్ను ఎత్తుకొని తీసుకెళ్లమంది. ఈ పిల్ల చూస్తే పొడుగ్గా.. ములక్కాడలా ఇంత పొడుగు ఉంది.. ఎలా మోస్తాను.. అన్నారు. అలా అదొక మధుర స్మృతి.

*ఎన్టీఆర్‌ శ్రీకృష్ణపరమాత్ముడిగా కనిపిస్తే ఆంధ్రప్రేక్షకులకి ఎంత అభిమానమో.. ఆయన పక్కన సత్యభామగా జమునే అని పేరు తెచ్చుకొనే అదృష్టం నాకు అలనాడు కలిగించారు.

*‘మూగ మనసులు’ చిత్రం ఒక స్వర్ణయుగం. నిజంగా ఆ పాత్ర నాలో ఎంత చక్కటి మరపురాని అనుభూతులు కలిగించింది! ఆ రోజుల్లో ఆ పాత్ర గురించి ఇండస్ట్రీలో ఎన్నో చర్చలు జరిగాయి. ఈ పాత్రను నేనువేస్తా.. నేను వేస్తానని ఎంతోమంది వచ్చారు. కానీ అలనాటి మహాదర్శకులు సుబ్బారావు, నాగేశ్వరరావుగారు.. వాళ్లందరికీ ఆ పాత్రకి జమునే ఉండాలని చెప్పారు. 
* ఆ రోజుల్లో ఒక కాంట్రావర్సీ.. మూగమనసుల్లో జమునని బుక్‌ చేస్తే ఆ పల్లెటూరి యాస జమున మాట్లాడుతుందా లేదా?అనే సందేహం. కానీ వాటిని పక్కనపెట్టి నన్ను బుక్‌ చేసినప్పుడు నిజంగానే నాకు సవాల్‌. ‘అయ్యబాబోయ్‌.. కొబ్బరి చెట్టుమీద తెల్లకాకి.. ఎందిమామ వద్దొద్దు.. వీపు ఎకరన్నార ఉంది’ ఇలాంటి భాష మాట్లాడాలి.

*శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు.. అదో హిస్టారికల్‌ సినిమా.. అందులో కూడా చక్కటి పాత్ర.. అందులో కూడా భాషా జ్ఞానం అవసరం. అటువంటి పాత్రలు వచ్చినప్పుడు ఆర్టిస్టులు రిహార్సల్స్‌ చేసుకోవాలి. అద్దం ముందు నిల్చొని ఆ భాష ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు విజయవంతంగా వాటిలో రాణించగలుగుతాం.

*ఒక్కోసారి మేము కూడా మొహమాటానికి పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నా అలవాటు ఏమిటంటే నా పక్కన పెద్దహీరోలే ఉండాలనేమీ పట్టుబట్టేదాన్ని కాదు. బొబ్బిలి యుద్ధంలో చేశాను. ఆ చిత్రంలో నా పాత్రవరకూ అందంగా బాగున్నానని అందరూ మెచ్చుకున్నారు. అందులోని ‘ముత్యాల చెమ్మచెక్క’ పాట చూస్తుంటే ఇప్పటికీ మధురంగా అనిపిస్తుంటుంది.

*జమున జీవితమంతా చక్కటి పూలబాటలో నడిచిపోయిందని అనుకుంటారు. కానీ ఈ పూలబాటలో కూడా ముళ్లుంటాయి. అవరోధాలుంటాయి. వాటిని కూడా ఆర్టిస్టు స్థిరమైనటువంటి దృఢనిశ్చయంతో ఎదుర్కొంటేనే పరిశ్రమలో మరికొంత కాలం రాణించేందుకు అవకాశం ఉంటుంది.

*సినిమా జీవితంలో ప్రతి ఒక్కరూ అడుగుతారు మరపురాని సంఘటన ఏమిటని? బహుశా ఏ కళాకారుడికి, నటుడికి జరగని సంఘటన నా జీవితంలో జరిగింది. అగ్రశేణి నటులిద్దరూ దాదాపు నాలుగు సంవత్సరాలు నాతో నటించకుండా ఉన్నటువంటి ఓ విధమైన సందర్భం నాకేర్పడింది. అయినా కూడా ఒక నటీమణిగా నేను అధైర్య పడలేదు. ఆ సందర్భంలో.. ఇబ్బందికర పరిస్థితుల్లో నిర్మాతలు కొంతమంది చక్కటి ఆలోచనతో.. జమునతో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు తీస్తూ, పక్కన కొత్త హీరోలను పరిచయం చేస్తే సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో, చాలా చిత్రాలు తీశారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో, అభిమానులు, నిర్మాతల ప్రోత్సాహంతో నిజంగానే కొత్త హీరోలతో నేను నటించినటువంటి లేత మనసులు, పెళ్లితాంబులం సినిమాలు కూడా 100 రోజులు ఆడాయి.

* పెద్దలు, పూజ్యులు చక్రపాణిగారు, కేవీరెడ్డిగారు.. స్వయంగా కలుగజేసుకొని గుండమ్మకథ కోసం రాజీ చేశారు. ఎన్టీఆర్‌గారు ‘గులేబ కావళి కథ’ కోసం బుక్‌ చేశారు. అందులో చాలా చక్కగా చిత్రీకరించిన పాట, సినారె గారి మొదటిపాట ‘నన్ను దోచుకుందువటే..’

* పెళ్లైన తరువాత సినిమా తారలకు కెరీర్‌ ఉండదని, లావెక్కిపోతారని, గ్లామర్‌ తగ్గిపోతుందని ఒక రూమర్‌ ఉంటుంది. నా అదృష్టమో, భగవంతుడి ఆశీస్సులో 1965లో వివాహమైనాక.. లావెక్కలేదు.. ఇంకా అందంగా కూడా ఉన్నానని ఫ్యాన్స్‌ ఉత్తరాలు రాసేవారు.

* సినిమా జీవితం చూసినప్పుడల్లా అనిపిస్తుంది.. ఇదంతా నా ప్రతిభ, జమున ప్రతిభ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంత ఉన్నతమైన స్థానానికి వచ్చానంటే కేవలం నా ప్రతిభే కాదు.. నా చుట్టూ ఉన్నటువంటి నా నిర్మాతలు, సహ నటీనటులు, దర్శకులు దీనికి కారణం. బీఎన్‌రెడ్డి, కేవీరెడ్డి, ఎల్వీప్రసాద్‌, ప్రకాశరావు గార్ల వద్ద పనిచేయడం వల్లే జమున, సావిత్రి, అంజలి.. ఇలా మేమంతా 30 ఏళ్లు రూల్‌ చేయగలిగాం.  కీర్తిశేషులైనటువంటి ఆ మహనీయులకు ఈ గౌరవం దక్కాలి.
* ఆ రోజుల్లో సంగీతం, సాహిత్యం ఎంత మధురంగా ఉండేవంటే.. ఈనాటికీ ఎన్ని మోడ్రన్‌ పాటలు వచ్చినా కూడా ఆ పాటలు విని పరవశం చెందనివారు ఉండరేమో అనుకుంటాను. 
* నాదొక్కటే కోరిక.. కనీసం మన పిల్లలకు పాత పాటలు, పాత సాహిత్యం చూపిస్తే, వినిపిస్తే మేలని. ఇప్పుడు వచ్చేటి హల్లాబుల్లా పాటలు కాకుండా ఆ పాత పాటల్ని చూపిస్తే.. వారికి ఉత్తమ అభిరుచులు అలవడుతాయి.
* మరీ ముఖ్యంగా స్ర్తీకి కావాల్సింది గృహస్థు జీవితం. ఆ విషయంలో కూడా.. మీ అందరితో పాటు భగవంతుడి ఆశీస్సులతో చాలా అదృష్టవంతురాలినని అనుకుంటాను. సాధారణంగా సినిమా తారలు బయటివారిని పెళ్లి చేసుకోవడం అరుదు. సినిమావారిని చేసుకోవడమే చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలో ఉండి, బయటివారిని వివాహం చేసుకున్నది నేనే. వారు మీకందరికీ తెలుసు.. ప్రొఫెసర్‌, డా.రమణరావుగారు. ప్రథమపుత్రుడు వంశీకృష్ణ అమెరికాలో మాస్‌ కమ్యునికేషన్‌ చేస్తున్నాడు. డాక్టరేట్‌ త్వరలో రాబోతుంది. స్రవంతి నా కుమార్తె. ఇదే నా కుటుంబం.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని