Jawan: తన రికార్డును తనే బ్రేక్‌ చేసిన షారుక్‌ ఖాన్‌.. అదేంటంటే?

షారుక్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం ‘జవాన్‌’. వసూళ్ల విషయంలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది.

Published : 17 Sep 2023 22:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల వసూళ్ల విషయంలో తన రికార్డును తనే బ్రేక్‌ చేశారు బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). ఆయన నటించిన ‘పఠాన్‌’ (Pathaan) చిత్రం విడుదలైన 10 రోజుల్లో రూ. 729 కోట్లు వసూళ్లు చేసి, చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అనతి కాలంలో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును ‘జవాన్‌’ (Jawan) సినిమా బ్రేక్‌ చేసింది. ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లో రూ. 797 కోట్ల వసూళ్లు (Jawan Collections Worldwide) సాధించింది. రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాల జాబితాలో నిలిచే సమయం దగ్గర్లోనే ఉంది.

కొత్త సీన్స్‌తో ‘జవాన్‌’ ఓటీటీ రిలీజ్‌.. అట్లీ సూపర్‌ ప్లాన్‌

దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలోనే షారుక్‌ రెండు సార్లు ఘన విజయం అందుకోవడం విశేషం. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పఠాన్‌’ జనవరి 25న విడుదలై రూ. 1,050 కోట్లు సాధించింది. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘జవాన్‌’ భారీ అంచనాల నడుమ ఈ నెల 7న రిలీజ్‌ అయింది. ఇందులోని షారుక్‌ విభిన్న లుక్స్‌, యాక్షన్‌ విజువల్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కథానాయికగా నయనతార, ప్రతినాయకుడిగా విజయ్‌ సేతుపతి, ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి, సాన్యా మల్హోత్ర తదితరులు ఆకట్టుకున్నారు.

ఈ సినిమా విజయోత్సవ వేడుకలో షారుక్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమాతో ఎన్నో ఏళ్లు ప్రయాణించే అవకాశం చాలా అరదుగా దొరుకుతుంది. కొవిడ్‌, ఇతర కారణాల వల్ల దాదాపు నాలుగేళ్లపాటు మేం ‘జవాన్‌’తో ప్రయాణించాం. దక్షిణాదికి చెందిన ఎంతోమంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు. దాదాపు నాలుగేళ్లపాటు ముంబయిలోనే ఉండి రేయింబవళ్లు శ్రమించారు. కుటుంబం, ఇంటికి దూరంగా ఉండి సినిమా కోసం కష్టపడిన టెక్నికల్‌ టీమ్‌ నిజమైన హీరోలు. ‘జవాన్‌’ విజయం వాళ్లదే’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు