కంగనకు హైకోర్టులో చుక్కెదురు

బాలీవుడ్‌ కథానాయిక కంగన రనౌత్‌కు ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది. కంగన, తన సోదరి రంగోలి.. ఇద్దరూ జనవరి 8న ముంబయి ఠాణాలో పోలీసుల ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం పోలీసుల..

Published : 24 Nov 2020 17:56 IST

జనవరి 8న పోలీసుల ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశం

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక కంగన రనౌత్‌కు ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది. కంగన, తన సోదరి రంగోలి.. ఇద్దరూ జనవరి 8న ముంబయి ఠాణాలో పోలీసుల ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం పోలీసుల ముందు హాజరుకావాలని గతంలో మూడుసార్లు సమన్లు పంపినా వాళ్లు స్పందించలేదు. ఇదిలా ఉండగానే.. తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కంగన సిస్టర్స్‌ కోర్టులో అప్పీల్‌ చేశారు. వాళ్ల అభ్యర్థనను మంగళవారం పరిశీలించిన న్యాయమైర్తి ఆ అప్పీల్‌ను కొట్టివేశారు.
తమ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొనాల్సి ఉన్నందునే పోలీసుల ముందు హాజరుకాలేదని కంగన తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్‌ షిండే ‘ఏదేమైనా.. మీరు సమన్లను గౌరవించాల్సిందే’ అని స్పష్టం చేశారు. 
దీంతో పాటు కంగనను దేశద్రోహిగా ఎందుకు చిత్రీకరించారని పోలీసుల తరఫు న్యాయవాదిని ఆయన ప్రశ్నించారు. దేశ పౌరులతో ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు సమయం ఇస్తాం. జనవరికి ముందు మిమ్మల్ని అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తాం. కానీ, ఆదేశాల ప్రకారం జనవరి 8న పోలీసుల ముందు హాజరుకావాలి’ అని కోర్టు చెప్పింది. అయితే.. దీనిపై ముంబయి పోలీసుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. వారికి రక్షణ కావాలంటే జనవరి వరకూ ఆగడం ఎందుకు..? వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు పంపించండి’ అని కోరారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన, రంగోలీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ సాహిల్‌ అష్రఫ్‌ అలీ సయ్యద్‌ అక్టోబర్‌లో కేసు వేసిన విషయం తెలిసిందే. కేసును పరిశీలించిన ముంబయి కోర్టు కంగనతోపాటు ఆమె సోదరి రంగోలిపై కేసు నమోదు చేయాలని ముంబయి పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేసిన బాంద్రా పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ రనౌత్‌ సోదరీమణులకు పలుమార్లు పోలీసులు సమన్లు జారీ చేశారు. వాళ్లు పోలీసుల ముందు హాజరుకాకపోవడంతో హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు