Kangana Ranaut: నా వాట్సాప్‌ డేటా లీక్‌ చేస్తున్నారు.. స్టార్‌ కపుల్‌పై కంగనా ఆరోపణలు

బాలీవుడ్‌లోని ఓ స్టార్‌ కపుల్‌ను ఉద్దేశిస్తూ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యాలు చేసింది. వాళ్ల పేరు రాయకుండా తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బీ టౌన్‌(Bollywood)లో చర్చనీయాంశంగా మారింది.

Published : 06 Feb 2023 10:40 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌(Bollywood)లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న హీరోయిన్‌ కంగనా రనౌత్ (Kangana Ranaut)‌. ఏ అంశం గురించైనా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి తనపై ఎవరో నిఘా పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యాలు బీ టౌన్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎవరో తన ప్రతి కదలికను గమనిస్తున్నారని, తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా లీక్‌ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించింది కంగనా. ఈ మేరకు తన ఇన్‌ స్టా స్టోరీలో ఓ బాలీవుడ్‌ జంటను ఉద్దేశిస్తూ సుదీర్ఘ నోట్‌ పోస్ట్‌ చేసింది.

‘‘నేను ఎక్కడకు వెళ్లానో తెలుసుకుంటున్నారు. వీధుల్లో మాత్రమే కాదు.. ఆఖరికి నా ఇంటి వద్ద కూడా నాపై నిఘా పెట్టారు. నా కారు పార్కింగ్‌లో, నా మేడ మీద ఇలా ప్రతి చోట నన్ను గమనిస్తున్నారు. నేను ఉదయం 6 గంటలకు బయటకు వెళితే అక్కడకు వచ్చి ఫొటోస్‌ తీస్తున్నారు. నా షెడ్యూల్‌ ఎలా తెలుసుకోగలుగుతున్నారు? నా వాట్సాప్‌ డేటా, వృత్తి పరమైన ఒప్పందాలు, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు అన్నీ లీక్‌ అవుతున్నాయని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. ఆ హీరో తన భార్యను నిర్మాతగా మారాలని, నేను తీసినట్లు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు తీయాలని బలవంత పెడుతున్నాడు.  నా వద్ద పనిచేసిన సిబ్బంది మొత్తాన్ని వాళ్లు నియమించుకున్నారు. నన్ను ఒంటరిని చేసి, మానసికంగా ఒత్తిడికి గురిచెయ్యాలని భావిస్తున్నారు. వాళ్లు నన్ను ఎంతగా ఫాలో అవుతున్నారంటే.. నా సోదరుడి పెళ్లికి వేసుకున్న వస్త్రధారణనే ఆమె  పెళ్లికి వేసుకుంది’’ అని రాసింది.

ప్రస్తుతం కంగనా పెట్టిన ఇన్‌ స్టా స్టోరీలు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కంగనా చెప్పిన ఆ జంట రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor)‌, అలియా(Alia Bhatt) అని నెటిజన్లు అంటున్నారు.  గత కొన్ని రోజులుగా కంగనా ఈ జంటను టార్గెట్‌ చేస్తోంది. ఇప్పుడు ఈ పోస్ట్‌ కూడా వారిని ఉద్దేశించేనా అని చర్చించుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగనా చంద్రముఖి సినిమా సీక్వెల్ ‌‘చంద్రముఖి 2’లో (Chandramukhi 2) రాజనర్తకి పాత్రలో కనిపించనుంది. దీనితో పాటు ‘ఎమర్జెన్సీ’(Emergency)లో నటిస్తోంది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఆమె ‘ఇందిరా గాంధీ’ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని