Liger: ‘లైగర్‌’ నష్టాలు.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ధర్నా

‘లైగర్‌’ (Liger) సినిమా వల్ల తాము ఎంతో డబ్బు నష్టపోయామంటూ పలువురు ఎగ్జిబిటర్లు రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు.

Published : 12 May 2023 14:15 IST

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) చిత్రాన్ని ప్రదర్శించి తాము నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు శుక్రవారం ధర్నా చేపట్టారు. నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరీ జగన్నాథ్‌, డిస్ట్రిబ్యూటర్‌ తమకు మాటిచ్చి ఆరునెలలు అయ్యిందని, కానీ, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని వాపోయారు. ఈ మేరకు ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టారు. పూరీ జగన్నాథ్‌ తమకు న్యాయం చేయాలంటూ వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’ (Liger). అనన్యా పాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌ దీన్ని నిర్మించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఎగ్జిబిట్‌ చేసి తాము నష్టపోయామని, తమ నష్టాన్ని భర్తీ చేయాలంటూ నైజాం ఎగ్జిబిటర్లు అప్పట్లో హైదరాబాద్‌లోని పూరీ ఇంటి ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆయన.. తనని బెదిరించకుండా ఉంటే తప్పకుండా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలోనే ఆరు నెలలైనా పూరీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదంటూ తాజాగా వాళ్లు మరోసారి నిరసన ప్రారంభించారు. డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌ ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని, పూరీ తమ కాల్స్‌కు స్పందించడం లేదని, ఇప్పటికైనా ఆయన తమకు ఏదో ఒక సమాధానం చెప్పాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని