Major: ‘అమ్మాయిల గురించి మాట్లాడనివ్వండి’.. ‘మేజర్‌’ మీట్‌లో మహేశ్‌ సందడి

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మేజర్‌’ చిత్రం ఇటీవల విడుదలై, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ‘రౌండ్‌ టేబుల్‌’ సమావేశం నిర్వహించింది.

Published : 08 Jun 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడివి శేష్‌ (Adivi Sesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మేజర్‌’ (Major) చిత్రం ఇటీవల విడుదలై, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాకు అన్ని కేంద్రాల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ‘రౌండ్‌ టేబుల్‌’ సమావేశం నిర్వహించింది. దీనికి ప్రముఖ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) హాజరై, సందడి చేశారు. ఈ చిత్రానికి తను సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చిత్ర నిర్మాత అనురాగ్‌ రెడ్డి, దర్శకుడు శశికిరణ్‌, నటులు శేష్‌, శోభిత, సయీ మంజ్రేకర్‌ ఈ మీటింగ్‌లో పాల్గొని, సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకున్నారు.

‘‘ఇంత మంచి ప్రాజెక్టును అందించినందుకు అనురాగ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాలో శేష్‌ నటిస్తాడని చెప్పగానే వెంటనే ఓకే చెప్పా. ఎందుకంటే శేష్‌ నటన నాకు ఇష్టం. ముఖ్యంగా ఆయన నటించిన ‘గూఢచారి’ నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విషయంలో నేను అంతగా ఇన్వాల్వ్‌ కాలేదు. నా సతీమణి నమ్రత ఆ బాధ్యత తీసుకుంది. టీజర్‌ చూడగానే ‘మేజర్‌’పై వీరికి ఎంత గౌరవం ఉందో అర్థమైంది. ఈ బయోపిక్‌ను ఎలా తెరకెక్కిస్తారోనన్న సందేహం అప్పుడప్పుడు కలిగేది. సినిమా చూశాక ఆ భయాలన్నీ పోయాయి’’ అని మహేశ్‌ తెలిపారు. అనంతరం, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన శోభిత, సయీ మంజ్రేకర్‌ల నటనను ప్రశంసిస్తుండగా నిర్మాత అనురాగ్‌ ఏదో చెప్పాలనుకున్నారు. వెంటనే మహేశ్‌ స్పందిస్తూ.. ‘‘అమ్మాయిల గురించి మాట్లాడనివ్వండి’’ అంటూ నవ్వులు పూయించారు. తెరపై మేజర్‌ తల్లిదండ్రులుగా కనిపించిన ప్రకాశ్‌రాజ్‌, రేవతి నటనను మహేశ్‌ కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని