Bramayugam ott: ఓటీటీలో ‘భ్రమయుగం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

bramayugam ott release date: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 06 Mar 2024 12:38 IST

హైదరాబాద్‌: మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). రాహుల్‌ సదాశివన్‌ దర్శకుడు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా మమ్ముట్టి నటన, రాహుల్‌ టేకింగ్‌ వెరసి ‘భ్రమయుగం’ను ఓ విభిన్న చిత్రంగా నిలిపాయి. అంతేకాదు, రూ.27 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో (Bramayugam ott) మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తన ట్విటర్‌ వేదికగా సోనీలివ్‌ ప్రకటించింది. మలయాళంతో పాటు, తెలుగ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ‘భ్రమయుగం’ స్ట్రీమింగ్‌ కానుంది.

ఇంతకీ కథేంటంటే: అది 17వ శతాబ్దం.. మలబార్‌ తీరం. ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడే జానపద గాయకుడు దేవన్‌ (అర్జున్‌ అశోకన్‌). రాజు దగ్గర నుంచి తప్పించుకుని ఇంటి దగ్గరున్న తల్లిని కలుసుకునేందుకు మిత్రుడితో కలిసి అటవీ మార్గంలో బయలుదేరుతాడు. కానీ, ఈ క్రమంలో ఆ దట్టమైన అడవిలో తప్పిపోతాడు. అదే సమయంలో తన మిత్రుడ్ని యక్షి (అమల్డా లిజ్‌) తినేస్తుంది. ఒంటరి అయిపోయిన దేవన్‌ ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ.. అటు ఇటు తిరిగి ఓ పెద్ద పాడుబడ్డ  ఇంటిలోకి అడుగు పెడతాడు. అక్కడ యజమాని కొడుమన్‌ పొట్టి (మమ్ముట్టి), వంటవాడు (సిద్ధార్థ్‌ భరతన్‌) మాత్రమే ఉంటారు. చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడని చెప్పి దేవన్‌ను కొడుమన్‌ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్‌కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొద్దిరోజుల్లోనే తను ఆ ఇంట్లో బందీ అయినట్లు తెలుసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. కొడుమన్‌ తన తాంత్రిక విద్యలతో అతణ్ని మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? (Bramayugam) అసలు కొడుమన్‌ పొట్టి ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని నిజ స్వరూపం గురించి తెలిసి కూడా వంటవాడు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు? తను.. దేవన్‌ ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని