Mark Antony Movie Review: రివ్యూ: మార్క్‌ ఆంటోనీ.. విశాల్‌, ఎస్‌జే సూర్య టైమ్‌ ట్రావెల్‌ మూవీ మెప్పించిందా?

Mark Antony Movie Review: విశాల్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ‘మార్క్‌ ఆంటోనీ’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 15 Sep 2023 16:54 IST

Mark Antony Movie Review: చిత్రం: మార్క్‌ ఆంథోని; నటీనటులు: విశాల్‌, ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్‌, సునీల్‌, రీతూ వర్మ తదితరులు; సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌; ఎడిటింగ్‌: విజయ్‌ వేలుకుట్టి; సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం; నిర్మాత: ఎస్‌.వినోద్‌కుమార్‌; రచన, దర్శకత్వం: అధిక్‌ రవిచంద్రన్‌; విడుదల: 15-09-2023

థానాయకుడు విశాల్‌(Vishal)కు హిట్టు పడి చాలా కాలమైంది. అయినా జయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ‘మార్క్‌ ఆంటోని’గా (Mark Antony) బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. విశాల్, ఎస్‌.జె.సూర్య కలిసి నటించిన చిత్రమిది. విభిన్నమైన టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. అందరి దృష్టి దీనిపై పడింది. మరి ఈ ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony Movie Review) కథేంటి? ఈ టైమ్‌ ట్రావెల్‌ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? విశాల్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా?

కథేంటంటే: ఆంటోని (విశాల్‌) శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌. 1975లో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో చనిపోతాడు. దీంతో ఆయన కొడుకు మార్క్‌ (విశాల్‌)ను ప్రాణ మిత్రుడైన జాకీ మార్తాండ (ఎస్‌.జె.సూర్య) చేరదీసి.. కన్న కొడుకులా పెంచి పెద్ద చేస్తాడు. అయితే మార్క్‌కు తండ్రి ఆంటోని అంటే చంపేయాలనుకునేంత పగ. తన తల్లిని చంపడమే దానికి కారణం. మరోవైపు ఆంటోని కొడుకు అవడం వల్ల సమాజంలోనూ రోజూ అనేక అవమానాలు ఎదుర్కొంటుంటాడు మార్క్‌. చివరికి రమ్య (రీతూ వర్మ)తో తన ప్రేమకథకు కూడా ఆంటోని పేరు చిక్కులు తీసుకొస్తుంది. దీంతో తన తండ్రిపై పగ రెట్టింపవుతుంది. అయితే అనుకోకుండా ఓరోజు మార్క్‌కు ఓ అరుదైన అవకాశం దొరుకుతుంది. గతంలోని వ్యక్తులతో మాట్లాడగలిగే ఓ టైమ్‌ ట్రావెల్‌ ఫోన్‌ అతనికి దొరుకుతుంది. దీంతో ఆ ఫోన్‌తో గతంలో ఉన్న తన తండ్రికి ఫోన్‌ చేసి.. కడిగి పారేయాలనుకుంటాడు. అయితే తను ఫోన్‌ మాట్లాడాక తండ్రి గురించి.. తల్లి మరణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. (Mark Antony Movie Review in telugu) దీంతో తన తండ్రిని ఎలాగైనా తిరిగి బతికించాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆంటోని మళ్లీ ఎలా బతికాడు? అసలు అతని గతమేంటి? మార్క్‌ తల్లి చావుకు కారణమెవరు? మార్క్‌ను చేరదీయడం వెనుక జాకీ పన్నిన కుట్ర ఏంటి? ఈ మొత్తం కథలో ఏకాంబరం (సునీల్‌) పాత్రేంటి? అన్నది మిగతా కథ.

ఎలా సాగిందంటే: టైమ్‌ ట్రావెల్‌ కథలనగానే వర్తమానంలో ఉన్న వాళ్లు గతంలోకి వెళ్లడం.. లేదంటే గతంలోని వ్యక్తులు వర్తమానంలోకి రావడం చూస్తుంటాం. దీంట్లో ఆ కాల ప్రయాణం ఓ టెలిఫోన్‌ కేంద్రంగా సాగుతుంది. ఆ ఫోన్‌ సాయంతో హీరో చనిపోయిన తన తల్లిదండ్రుల్ని ఎలా బతికించుకున్నాడు? తన గతాన్ని ఎలా మార్చుకున్నాడు? చచ్చి బతికి గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన తన తండ్రికి.. అతని ప్రత్యర్థులకు మధ్య జరిగిన పోరులో ఎవరు పైచేయి సాధించారన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఓ వైపు బుర్రకు పదును పెడుతూ.. మరోవైపు అక్కడక్కడా నవ్విస్తూ.. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా కథను నడిపించడంలో దర్శకుడు రవిచంద్రన్‌ శక్తిమేర కృషి చేశాడు. అయితే ఈ కథలో మెదడుకు పని కల్పించే అంశాలు మరీ ఎక్కువవడం.. ద్వితీయార్ధంలో టైమ్‌ ట్రావెల్‌ కథ కాస్తా టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌ తరహాలో మరీ రిపీటెడ్‌గా సాగడం ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. (Mark Antony Movie Review) ఈ కథలోని పాత్రలు.. దీని కోసం సృష్టించిన ప్రపంచం.. ఇందులో ఉన్న సంఘర్షణ, వినోదం రెండున్నర గంటలు సీట్లకు అతుక్కునేలా చేస్తాయి. 1975 బ్యాక్‌డ్రాప్‌ నుంచి కథను మొదలు పెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఓ సైంటిస్ట్‌ టైమ్‌ ట్రావెల్‌ ఫోన్‌ కనిపెట్టడం.. అదే రోజు రాత్రి ఓ పబ్‌లో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో ఆంటోని హత్యకు గురవడం.. కట్‌ చేస్తే కథ 1995కు మారడం.. ఇలా దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించాడు. మార్క్‌ పాత్ర పరిచయం, అతని ప్రపంచం.. తండ్రి పేరు వల్ల తను పడే ఇబ్బందులు, ప్రేమకథలో వచ్చిన చిక్కులతో తొలి 45నిమిషాలు సాగుతుంది. ఇక మధ్యలో జాకీగా ఎస్‌.జె.సూర్య చేసే సందడి.. ఆ పాత్ర వ్యవహార శైలి, మాట తీరు ప్రేక్షకులకు వినోదం పంచుతాయి. ఎప్పుడైతే మార్క్‌ చేతికి టైమ్‌ ట్రావెల్‌ ఫోన్‌ దొరుకుతుందో అక్కడి నుంచి కథ మలుపు తీసుకుంటుంది.

మార్క్‌ తన ఇంటికి ఫోన్‌ చేసి తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించడం.. అదే సమయంలో ఆంటోని కోణం నుంచి మరో కథ ప్రారంభించడంతో సినిమా రసవత్తరంగా మారుతుంది. తన తండ్రి గతం తెలిశాక  అతన్ని బతికించేందుకు మార్క్‌ చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో జాకీకి, ఆంటోనికి మధ్య వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. (Mark Antony Movie Review) విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై మరింత ఆసక్తిని కలిగించేలా చేస్తాయి. ఆంటోనిని మార్క్‌ బతికించాక కథ ఒక్కసారిగా మారిపోతుంది. ప్రథమార్ధంలో ప్రతినాయక పాత్రలుగా కనిపించిన పాత్రలన్నీ మంచిగా.. మంచిగా కనిపించిన పాత్రలన్నీ ప్రతినాయక పాత్రలుగా కనిపించడం మొదలవుతుంది. ఇక్కడి నుంచే కథలో కాస్త కన్ఫ్యూజన్‌. అయితే ప్రతి సీన్‌ తర్వాత ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని కలిగిస్తుంటుంది. కాకపోతే చూసిన సీక్వెన్సే మళ్లీ మళ్లీ కనిపిస్తుండటం రిపీట్‌నెస్‌ మరీ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఆంటోనిని చంపేందుకు జాకీ చేసే ప్రయత్నాల్ని మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. (Mark Antony Movie Review) కానీ, అందులోనూ కొన్ని సీన్స్‌లో ఎస్‌.జె.సూర్య నటన నవ్వులు పూయిస్తుంది. పతాక సన్నివేశాల్లో విశాల్‌ ఓ సరికొత్త గెటప్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తారు. సినిమాని ముగించిన తీరు కాస్త రొటీన్‌గానే అనిపిస్తుంది. సీక్వెల్‌ రానుందంటూ క్లైమాక్స్‌లో స్పష్టత ఇచ్చారు.

ఎవరెలా చేశారంటే: మార్క్‌.. ఆంటోని పాత్రల్లో విశాల్‌ వైవిధ్యమైన నటన కనబర్చారు. ముఖ్యంగా ఆంటోని పాత్రను తీర్చిదిద్దిన తీరు.. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్‌ బాగున్నాయి. క్లైమాక్స్‌లో సరికొత్త గెటప్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు. జాకీగా.. ఆయన తనయుడు మార్తాండ్‌గా ఎస్‌.జె.సూర్య కూడా రెండు పాత్రల్లో సందడి చేశారు. ఆ రెండు పాత్రల బాడీ లాంగ్వేజ్, వాటి వ్యవహార శైలి, మాట తీరు.. దీన్ని సూర్య అభినయించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆయనలోని కామెడీ టైమింగ్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. (Mark Antony Movie Review) ఏకాంబరంగా సునీల్‌ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఆయనిందులో మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. రీతూ వర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అభినయ, మహేంద్రన్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. రవిచంద్రన్‌ ఎంచుకున్న కథా నేపథ్యం.. స్క్రీన్‌ప్లే తీర్చిదిద్దుకున్న తీరు.. దాన్ని వినోదాత్మకంగా నడిపిన విధానం బాగున్నాయి. అయితే ద్వితీయార్ధంలో కథ కాస్త గందరగోళంగా నడవడం.. రిపీట్‌ సీన్స్‌ ఎక్కువవడం.. రొటీన్‌ క్లైమాక్స్‌ ఫలితాన్ని కాస్త దెబ్బ కొట్టాయి. నాయకానాయికల లవ్‌ ట్రాక్‌ అనవసరం. రెట్రో స్టైల్‌లో జి.వి.ప్రకాష్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + విశాల్, ఎస్‌.జె.సూర్య నటన
  • + వినోదం.. విరామ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - గందరగోళంగా సాగే ద్వితీయార్ధం
  • - ఊహలకు అందే ముగింపు
  • చివరిగా: అక్కడక్కడా నవ్విస్తూ.. థ్రిల్‌ చేసే ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు