masth shades unnai ra: షేడ్స్‌ చూపించేది అప్పుడే!

అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ చిత్రాన్ని తిరుపతి రావు ఇండ్ల తెరకెక్కిస్తున్నారు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రేజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 30 Jan 2024 09:37 IST

అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ చిత్రాన్ని తిరుపతి రావు ఇండ్ల తెరకెక్కిస్తున్నారు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రేజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు విడుదల తేదీని సోమవారం ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..‘హాస్యనటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసల్ని అందుకున్న అభినవ్‌ గోమఠంలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించాం. ప్రతి పాత్ర ఎంతో సహజంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది’ అని అన్నారు. సంగీతం: శ్యాముల్‌ అబే.


తెరపైకి కొత్త కలయిక!

‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్‌ మలినేని మరో చిత్రమేదీ పట్టాలెక్కించలేదు. రవితేజతో ఓ సినిమా ప్రకటించినప్పటికీ అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడాయన హిందీలో ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో సన్నీ దేవోల్‌ హీరోగా నటించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ దీన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని.. ఈ వేసవిలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. సన్నీ దేవోల్‌ గతేడాది ‘గదర్‌ 2’తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.


ఫైటర్‌ తర్వాత సైఫ్‌తో..

‘వార్‌’, ‘పఠాన్‌’, ‘ఫైటర్‌’ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్‌ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కథానాయకుడిగా, ‘పాతాళ్‌ లోక్‌’ ఫేం జైదీప్‌ అహ్లావత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘కొన్ని యాక్షన్‌, వినోదాత్మక చిత్రాలను రూపొందించాలనే ఉద్దేశంతో మా నిర్మాణ సంస్థ మార్‌ఫ్లిక్స్‌ని మరింతగా విస్తరించాలనుకుంటున్నాం. నేను ఎప్పుడూ సంఖ్యపై కాకుండా నాణ్యతపైనే దృష్టి పెడతాను. అందులో భాగంగానే సైఫ్‌ అలీఖాన్‌, జైదీప్‌ అహ్లావత్‌తో ఒక ఫన్‌ యాక్షన్‌ చిత్రాన్ని రూపొందించనున్నాం. ప్రస్తుతం దీనిపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టబోతున్నా’ అంటూ వివరాలు పేర్కొన్నారు. హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌కపూర్‌లతో ఇటీవల దర్శకత్వం వహించిన ‘ఫైటర్‌’ బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకుంది.


మ్యూజిక్‌.. మ్యాజిక్‌

‘నాన్న’, ‘దాగుడుమూత దండాకోర్‌’ లాంటి సినిమాల్లో బాలనటిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది సారా అర్జున్‌. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో కూడా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో గౌతమ్‌ తిన్ననూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ సినిమాకి ‘మ్యాజిక్‌’ అనే పేరును ఖరారు చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం. ‘మ్యూజిక్‌ ఈజ్‌ ద వే వి రెబల్‌’ అనే వ్యాఖ్యతో ఉన్న పోస్టర్‌ ఇది సంగీతానికి సంబంధించిన సినిమా అని చెప్పకనే చెబుతోంది.  ‘కాలేజీలో జరిగే ఓ కార్యక్రమం కోసం సొంతంగా ఒక పాటను కంపోజ్‌ చేయాలని అనుకునే నలుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే అద్భుతమైన చిత్రమిది. ప్రతి ఒక్కరు ఈ కథకు కనెక్ట్‌ అవుతారు. తమ కాలేజ్‌ రోజుల్ని తప్పక గుర్తుచేసుకుంటారు’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. వేసవిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు.


ప్రతి పెళ్లిలో వినిపిస్తుందని నమ్ముతున్నా

చైతన్యరావ్‌, భూమి శెట్టి జంటగా కుమారస్వామి తెరకెక్కించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘పన్నెండు గుంజల పందిర్ల కిందా’’ అనే గీతాన్ని దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ పాట చూస్తుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోంది. సురేష్‌ బొబ్బిలి సంగీతం, పెద్దింటి అశోక్‌ సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఇక ప్రతి పెళ్లి పందిట్లో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నా. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని.. మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు దర్శకుడు కుమారస్వామి. ఈ కార్యక్రమంలో చైతన్యరావ్‌, పెద్దింటి అశోక్‌ కుమార్‌, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మదిని హత్తుకునే ప్రేమ సంఘర్షణ

మణికందన్‌, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్‌ వ్యాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘ట్రూ లవర్‌’. ఈ సినిమా మారుతి, ఎస్‌కేఎన్‌ సమర్పణలో ఫిబ్రవరి 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, చిత్ర సమర్పకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘నా మిత్రుడు సలహాతో ఓరోజు ఈ చిత్ర ట్రైలర్‌ చూశా. అది నచ్చి సినిమా కూడా చూశా. దర్శకుడు తను చూసిన జీవితాన్నే సినిమాగా మలిచాడనిపించింది. దీంట్లో హీరోకు ప్రేమ కావాలి. తన చుట్టూ ఉన్న పరిస్థితులకు సర్దుకుపోవడం కావాలి. ఈ రెండింటి మధ్య తను పడే సంఘర్షణ మదిని హత్తుకునే విధంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమలో పడాలనుకున్న వాళ్లు, ప్రేమలో లేని వాళ్లు ఎవరైనా చూడొచ్చు. అసభ్యతకు తావులేకుండా దీన్ని చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభురామ్‌ వ్యాస్‌, మణికందన్‌, శ్రీ గౌరి ప్రియ, రాకేందు మౌళి, ఎస్‌కేఎన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని