Dilraju: ‘దిల్‌ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్‌..!

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) పేరు ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ‘దిల్‌ రాజు గారు మా బాధ వినండి’ అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు....

Published : 12 Aug 2022 11:35 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) పేరు ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ‘దిల్‌ రాజు గారు మా బాధ వినండి’ అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్టుండి దిల్‌ రాజు పేరు నెట్టింట వైరల్‌ కావడానికి కారణమేమిటి? ట్విటర్‌ వేదికగా నెటిజన్లు ఏం కోరుతున్నారు?

టాలీవుడ్‌కు చెందిన అగ్ర‌, యువ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేసి ఇండస్ట్రీలో స్టార్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు దిల్‌ రాజు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రస్తుతం ఆయన రెండు భారీ ప్రాజెక్ట్‌లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒకటి రామ్‌ చరణ్‌ (Ram Charan) - శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో రానుంది. రామ్‌ చరణ్‌ 15వ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. గతేడాది సెప్టెంబర్‌ 8న పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభమైంది. ఆనాటి నుంచి హైదరాబాద్‌, రాజమహేంద్రవరం, ముంబయి, పంజాబ్‌.. ఇలా పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసిన నాటి నుంచి ఇందులో పనిచేస్తోన్న నటీనటుల్ని పరిచయం చేస్తూ కేవలం ఒకే ఒక్క పోస్టర్‌ని మాత్రమే చిత్రబృందం విడుదల చేసింది. సినిమా మొదలై సంవత్సరమైనా #RC 15 టీమ్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవడంతో మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర నిర్మాత దిల్‌ రాజుని ట్యాగ్‌ చేస్తూ అప్‌డేట్స్‌ ఇవ్వాలని ట్వీట్స్‌ చేస్తున్నారు. ‘‘దిల్‌ రాజు గారూ.. దయచేసి అప్‌డేట్‌లు ఇవ్వండి’’ అంటూ ఇప్పటివరకూ 36 వేల మంది ట్వీట్లు పెట్టారు. దీంతో నిర్మాత పేరు ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవర్‌ఫుల్‌ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని