Ponniyin Selvan: వారిద్దరితో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తీద్దామనుకున్న ఎంజీఆర్‌..!

విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష కీలక పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న

Published : 06 Sep 2022 20:30 IST

హైదరాబాద్‌: విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష కీలక పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్‌ పీరియాడిక్‌ డ్రామా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదల కానుంది. గతంలో ఎంతో మంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నా, కుదరలేదు. ఎట్టకేలకు మణిరత్నం ఆ బాధ్యతను తీసుకున్నారు.  అయితే, ఎంజీ రామచంద్రన్‌ ఈ మూవీని భారతీరాజా దర్శకత్వంలో తీయాలని అనుకున్నారట. ఇటీవల జరిగిన ఓ విలేకరుల సమావేశంలో భారతీరాజా ఆ విషయాన్ని వెల్లడించారు.  ఒక రోజు ఎంజీఆర్‌ తాను దర్శకత్వం వహిస్తున్న ‘ఒరు ఖైదియిన్‌ డైరీ’ సినిమా షూటింగ్‌ స్పాట్‌కు వచ్చారని, తాను పాటను తెరకెక్కిస్తున్న విధానం నచ్చి, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తీయాలని కోరినట్లు చెప్పారు.

‘‘ఈ పాటకు కొరియోగ్రాఫర్‌ ఎవరు’ అని అడగ్గానే భయపడుతూనే ‘నేనే సర్‌’ అని సమాధానం ఇచ్చా. ఆయన వెంటనే ‘నేను ఒక సినిమాను తీద్దామనుకుంటున్నా. అదే పొన్నియిన్‌సెల్వన్‌. నువ్వు డైరెక్టర్‌గా చేస్తావా’ అని అడిగారు.  ఒక్కసారిగా నాకు ఆశ్చర్యమేసింది. మరొకసారి నిర్ధారణ చేసుకునేందుకు, ‘మీరు దేని గురించి అడుగుతున్నారు సర్‌’ అని వినయంగా అడిగాను. ‘శ్రీదేవి, కమల్‌హాసన్‌ జోడీగా నువ్వు పొన్నియిన్‌ సెల్వన్‌ తీస్తున్నావు’ అన్నారు’’ అని ఆనాడు ఎంజీఆర్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు భారతీరాజా. ఎంజీఆర్‌ చెప్పడంతో కమల్‌, శ్రీదేవి కూడా ఒప్పుకొన్నారు. ఆ తర్వాత ఆరు రోజులకు ఎంజీఆర్‌ కన్నుమూయడంతో సినిమా చేసే అవకాశం రాలేదని వివరించారు.

80వ దశకంలో మణిరత్నం, కమల్‌హాసన్‌ మధ్య ఇదే సినిమా విషయమై చర్చ జరిగింది. లొకేషన్లు, నటీనటులు, బడ్జెట్‌, స్క్రీన్‌ప్లే అంతా సిద్ధం చేసుకున్నారు రూ.2కోట్లలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తీద్దామనుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా పీసీ శ్రీరామ్‌ను అనుకున్నారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. కానీ, అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మణిరత్నం ఆ సినిమాను పూర్తి చేశారు. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, జయం రవి, కార్తి, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఏఆర్‌రెహమాన్‌ స్వరాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని