Mr pregnant movie review: రివ్యూ: మిస్టర్‌ ప్రెగ్నెంట్‌

Mr pregnant movie review: సోహైల్‌ కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ఎలా ఉందంటే?

Updated : 18 Aug 2023 12:07 IST

Mr pregnant movie review; చిత్రం: మిస్టర్‌ ప్రెగ్నెంట్‌; నటీనటులు: సయీద్‌ సోహెల్‌, రూప, సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, ఆలీ, హర్ష, అభిషేక్‌రెడ్డి, స్వప్నిక తదితరులు; సంగీతం: శర్వణ్‌ భరద్వాజ్‌; సినిమాటోగ్రఫీ: నిజర్‌ షఫీ; ఎడిటింగ్‌: పవన్‌ పూడి; నిర్మాత: అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్‌ అన్నపురెడ్డి; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ వింజనం పాటి; విడుదల తేదీ: 18-08-2023

‘బిగ్‌బాస్‌’తో అందరికీ సుపరిచితుడైన నటుడు సోహెల్‌. ఆ షో తర్వాత వరుస అవకాశాలు అతని తలుపుట్టాయి. ఈ క్రమంలో పలు సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఈ క్రమంలో సోహెల్‌ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. పురుషుడు గర్భం దాలిస్తే? అన్న ఆసక్తికర అంశం చుట్టూ శ్రీనివాస్‌  వింజనం పాటి తెరకెక్కించిన చిత్రమిది. (Mr pregnant movie review) మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సోహెల్‌ ఎలా నటించాడు?

ఇదీ కథ: గౌతమ్(సోహెల్) ఓ టాటూ ఆర్టిస్టు. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతుంది మహి(రూప). ప్రేమ, పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకుంటాడు గౌతమ్. కానీ.. అనుకోని పరిస్థితుల్లో మహిని పెళ్లి చేసుకుంటాడు. తల్లిదండ్రులను ఎదిరించి వచ్చిన ఆమెను కాలు కిందపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఈ క్రమంలో మహికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. ఆ విషయం గౌతమ్‌కు నచ్చదు. తనకు గతంలో జరిగిన సంఘటన వల్ల మహి ఎక్కడ దూరమవుతుందోనని మదనపడుతుంటాడు. ఆమె గర్భాన్ని తాను తీసుకోవాలనుకుంటాడు. సైంటిఫిక్‌గా కొన్ని దేశాల్లో అది సాధ్యపడటంతో డాక్టర్ వసుధ(సుహాసిని)ని ఒప్పించి ఆ గర్భాన్ని గౌతమ్ మోస్తాడు. ఆ తర్వాత ఏమైంది? గౌతమ్ బిడ్డను కన్నాడా? అతడి జీవితంలో జరిగిన గత సంఘటనలేంటీ? గర్భాన్ని మోసిన గౌతమ్‌ను సమాజం ఎలా చూసిందనేదే మిస్టర్ ప్రెగ్నెంట్ కథ.

ఎలా ఉందంటే: ప్రయోగాత్మక చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడు మంచి ఆదరణే ఉంటుంది. వారి అంచనాలను అందుకోగలిగితే బాక్సాఫిసు వద్ద ఆ చిత్రానికి కనకవర్షమేనని ఎన్నో చిత్రాలు నిరూపించుకున్నాయి. అలాంటి కోవకే చెందిన చిత్రం ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ . ప్రపంచంలో మొదటి మేల్ ప్రెగ్నెంట్ ఆస్ట్రేలియాకు చెందిన థామస్ కథ స్ఫూర్తితో ఈ కథను తయారుచేసుకున్న దర్శకుడు.. మన వాతావరణానికి అనుగుణంగా భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు. అంతర్లీనంగా అర్థనారీశ్వర తత్వాన్ని వివరిస్తూనే... అమ్మ గొప్పతనాన్ని గౌతమ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడు. మగవాడు గర్భం దాల్చడానికి అవకాశం లేకపోయినా... వైద్యరంగంలో ఇప్పుడున్న పరిజ్ఞానంతో తన భార్య గర్భాన్ని మోయవచ్చనే విషయాన్ని చెప్పాడు. ఇందుకు తగిన శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను ఊటంకిస్తూ... ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. అయితే ప్రథమార్థం.. మొదటి 20 నిమిషాలు రోటిన్‌గా అనిపిస్తుంది. ఎప్పుడైతే మహి గర్భాన్ని గౌతం మోసేందుకు సిద్ధమవుతాడో అప్పటి నుంచి కథ ఆసక్తికరంగా సాగుతుంది. గౌతమ్ - రూపల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. గౌతమ్ గతానికి సంబంధించిన సన్నివేశాలు కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. అలాగే ద్వితీయార్థంలో గౌతమ్ తన గర్భాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు, తన ఇంట్లో బ్రహ్మాజి చేసే హంగామా నవ్వులు పంచుతుంది. పతాక సన్నివేశాల్లో మగవాడు గర్భం మోయడంపై మీడియాతో చెప్పే మాటలు నాటకీయంగా అనిపించినా.. చప్పట్లు కొట్టేలా చేస్తాయి. కథను ముందుకు తీసుకెళ్లేందుకు రాసుకున్న కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. మహిళా ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలను, వాటిని తీర్చిదిద్దన విధానం ఆకట్టుకుంటుంది. సంభాషణలు ఒకటిరెండు చొట్లా ఫర్వాలేదనిపిస్తాయి. సినిమా మొత్తం ఒకే ధోరణిలో వెళ్లడం వల్ల ప్రథమార్థం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ద్వితీయార్థం మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఆలోచింపజేస్తుంది.

ఎవరెలా చేశారంటే: మిస్టర్ ప్రెగ్నెంట్ సోహెల్ వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు. ఇన్నాళ్లు అల్లరిగా, ఆకతాయి నటుడిగా కనిపించిన సోహెల్‌లో కొత్త నటుడు కనిపిస్తాడు. గర్భంతో సోహెల్ నటించిన తీరు, భావోద్వేగ భరిత సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంభాషణల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. మహి పాత్రలో రూప ఒదిగిపోయింది. చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. సోహెల్‌తో కలిసి నటించిన తీరు మెప్పిస్తుంది. సోహెల్ స్నేహితుడు సత్య పాత్రలో వైవా హర్ష, మహి మేనమామ బుట్టబొమ్మ పాత్రలో బ్రహ్మాజి ఫర్వాలేదనిపిస్తారు.  మహి తండ్రిగా రాజా రవీంద్ర తన పంచ్ లతో నవ్వించారు. డాక్టర్ వసుధగా సుహాసిని ఎప్పటిలాగే తన నటనను కనబర్చింది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం అంతం మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు శ్రీనివాస్ తను ఎంచుకున్న కథ చెప్పడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే ప్రథమార్ధంలో కొంచెం తడబడ్డ ద్వితీయార్ధంలో అనుకున్నది స్పష్టంగా చెప్పగలిగాడు. కొన్ని సన్నివేశాలను మనసుకు హత్తుకునేలా తీశాడు. వాస్తవిక ప్రపంచంలో సాధ్యమైన విషయాన్ని తెరపై కథగా మల్చడంలో దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా చేయడం సాహసమని తెలిసినా ప్రయోగాత్మకంగా మంచి నిర్మాణ విలువలు జోడించారు. అయితే.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పురిటినొప్పులు అనుభవించినా చివరకు విజయవంతంగా డెలవరీ చేయగలిగారు. 

  • బలాలు

  • + కథ, కథనం
  • + సోహెల్ , రూప నటన
  • + పతాక సన్నివేశాలు
  • బలహీనతలు

  • - ప్రథమార్ధం 20 నిమిషాలు
  • - ఆకట్టుకోని పాటలు

చివరగా: మిస్టర్ ప్రెగ్నెంట్ ... ఆలోచింపచేసే చిత్రం.

గమనిక.. ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది.. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని