Cinema Day: రూ. 112కే మల్టీప్లెక్స్‌లో సినిమా.. ఒక్క రోజే అవకాశం

రూ. 112కే మల్టీప్లెక్స్‌లో సినిమాను వీక్షించే అవకాశాన్ని మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎం.ఎ.ఐ) కల్పిస్తోంది. ‘నేషనల్‌ సినిమా డే’ వేడుకల్లో భాగంగా సెప్టెంబరు 23న టికెట్‌ ధరలను తగ్గించింది.

Updated : 22 Sep 2022 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.112కే మల్టీప్లెక్స్‌లో సినిమాను వీక్షించే అవకాశాన్ని ‘మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎం.ఎ.ఐ) (Multiplex Association of India) కల్పిస్తోంది. సెప్టెంబరు 23ను ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day)గా అభివర్ణిస్తూ టికెట్‌ ధరలను తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఇందులో భాగమయ్యాయి. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాల్సిందిగా ఆయా చిత్ర బృందాలు ప్రేక్షకులను కోరుతున్నాయి. ఈ మేరకు.. ఇప్పటికే విడుదలైన సినిమాలు, ఈ శుక్రవారం విడుదలకానున్న చిత్రాలను తక్కువ ధరకే చూడొచ్చు.

శుక్రవారం విడుదలకాబోతున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ (శ్రీసింహా హీరోగా తెరకెక్కింది) చిత్ర బృందం పీవీఆర్‌, ఐనాక్స్‌ (తెలంగాణ)లో తమ సినిమాని రూ.112కే చూడొచ్చని సోషల్‌ మీడియా వేదికగా వివరాలను ప్రకటించింది. శ్రీవిష్ణు ‘అల్లూరి’, నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ (పీవీఆర్‌లో మాత్రమే) చిత్రాల టికెట్లు సైతం అదే ధరకు లభించనున్నాయి. వీటిని ఆన్‌లైన్‌ (బుక్‌ మై షో, పేటీఎం)లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. వీటితోపాటు, ఇప్పటికే విడుదలైన నిఖిల్‌ ‘కార్తికేయ 2’, రణ్‌బీర్‌ కపూర్‌ ‘బ్రహ్మాస్త్రం’ (తెలుగు) చిత్రాలనూ రూ.112కే చూసే వీలుంది. దీనికి తోడు అదనంగా కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాదు మరికొన్ని సినిమాలు ఈ సంబరంలో భాగంకానున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో.. ‘కార్తికేయ 2’, ‘బ్రహ్మాస్త్ర’ (హిందీ) చిత్రాల టికెట్‌ ధర రూ.75గా ఉంది. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. కొవిడ్‌ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో సెప్టెంబరు 16న సినిమా డేగా ప్రకటించారు. కానీ, అనివార్య కారణంగా సెప్టెంబరు 23కు వాయిదా వేశారు. యూఎస్‌, యూకేల్లో సెప్టెంబరు 3న సినిమా డే సెలబ్రేషన్స్‌ జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని