Michael: సందీప్‌ కిషన్‌కు ఆ ఒక్కటి ‘మైఖేల్‌’తో వస్తుందనుకుంటున్నా: నాని

సందీప్‌ కిషన్‌ హీరోగా దర్శకుడు రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన చిత్రం ‘మైఖేల్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు నాని అతిథిగా హాజరై మాట్లాడారు.

Published : 01 Feb 2023 00:30 IST

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) కష్టపడే, ప్రతభ ఉన్న నటుడని, ‘మైఖేల్‌’ (Michael) సినిమాతో అతనికి అదృష్టం కలగాలని కోరుకున్నారు నాని (Nani). సందీప్‌ కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించిన చిత్రమది. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి, వరుణ్‌ సందేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3న సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. నాని అతిథిగా హాజరై సందడి చేశారు.

వేడుకనుద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘‘మైఖేల్‌’ ప్రచార చిత్రాలను చూస్తే సౌండింగ్‌, కలర్‌టోన్‌.. ఇలా ప్రతి విభాగంలో కొత్తగా అనిపించింది. ‘శివ’ సినిమా విభిన్న అనుభూతిని ఎలా అయితే పంచిందో ఆ రకంగానే మైఖేల్‌ అలరించారని కోరుకుంటున్నా. కష్టపడేతత్వం, అదృష్టం, ప్రతిభ.. ఈ మూడు ఉన్నవారు చిత్ర పరిశ్రమలో ఓ స్థాయికి వెళ్తారు. సందీప్‌ విషయంలో ముందు నుంచీ కష్టం, ప్రతిభ స్థిరంగా ఉన్నాయి. అదృష్టం కనిపించలేదు. దాన్ని ‘మైఖేల్‌’ అందిస్తుందనుకుంటున్నా. నేనూ వరుణ్‌ సందేశ్‌ ఒకే సమయంలో నటులుగా కెరీర్‌ ప్రారంభించాం. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, నానా పటేకర్‌, రఘువరన్‌లాంటి నటులకున్న బాడీ లాంగ్వేజ్‌ వరుణ్‌కు ఉంది. అలాంటి నటుడితో లవర్‌బాయ్‌ పాత్రలు చేయించారు. మైఖేల్‌లో తనికి అసలైన క్యారెక్టర్‌ లభించిందనుకుంటున్నా’’ అని నాని అన్నారు.

నాని స్ఫూర్తి: సందీప్‌

‘‘నేనూ నాని ఎప్పటి నుంచో స్నేహితులం. తను నా సినిమా వేడుకకురావడం ఇదే తొలిసారి. ‘ఏదో కొత్తగా ప్రయత్నించాం’ అని మేం అనుకునేలోపు తను మరో అడుగు ముందుకేస్తాడు. ‘సందీప్‌ కెరీర్‌ అయిపోయింది. ఇంకా సినిమాలు ఉంటాయా?’ అన్న పరిస్థితి వచ్చినప్పుడు నాని నాకు స్ఫూర్తిగా నిలిచాడు. నా ప్రతి సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో టెన్షన్‌ పడేవాణ్ని. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం నేను చేయాల్సిందంతా చేశా. 2019లో ‘మైఖేల్‌’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించా. ఆ సినిమాని ఎలా అయినా చేయాలని ఫిక్స్‌ అయ్యా. తర్వాత దర్శకుడి కోసం వెతికా. నేను ఏమేం చేయలేనని అన్నారో వాటన్నింటినీ ఇందులో చేశా’’ అని సందీప్‌ కిషన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని