అలా చేసినందుకే పరాజయాలు..!

‘కెరీర్‌ ప్రారంభంలో కథల్ని జడ్జ్‌ చేయడం తెలియలేదు. ఇప్పుడిప్పడే దాని నుంచి బయటపడుతున్నా’ అన్నారు నవదీప్. విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మోసగాళ్లు’ చిత్రంలో కీలక పాత్ర పోషించారాయన. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు నవదీప్‌. 

Published : 04 Mar 2021 23:36 IST

నటుడు నవదీప్‌

 

‘కెరీర్‌ ప్రారంభంలో కథల్ని జడ్జ్‌ చేయడం తెలియలేదు. ఇప్పుడిప్పడే దాని నుంచి బయటపడుతున్నా’ అన్నారు నవదీప్. విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మోసగాళ్లు’ చిత్రంలో కీలక పాత్ర పోషించారాయన. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు నవదీప్‌. 

సునీల్‌ శెట్టి మినహా..

ఈ సినిమాకు పనిచేయడం వల్ల ఇప్పటి వరకు తెలియని అంశాలెన్నో నేర్చుకున్నాను. హాలీవుడ్‌ నిపుణులు ఎలా పనిచేస్తారు? సన్నివేశాలు తెరకెక్కించాలంటే వాళ్లెలా ఆలోచిస్తారు? వంటివి తెలుసుకున్నాను. నాకొక కొత్త అనుభూతినిచ్చిందీ చిత్రం. సునీల్‌ శెట్టి పాత్ర మినహా ఈ సినిమాలోని అన్ని పాత్రలు మోసం చేసేవే. కథకు ప్రాధాన్యంగా నిలుస్తుంది నా పాత్ర. అమ్మాయిలతో తిరగడం, స్కాంలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపే పాత్ర అది. కథానాయకుడి (విష్ణు)కి ఈ విషయంలో ప్రతిభ ఉందని తెలుసుకుని అతనితో కలిసి ఓ స్కాం ప్రయత్నిస్తా. అదే సమయానికి తన సోదరి ఇచ్చిన ఐడియాలతో అందనంత ఎత్తుకు ఎదుగుతాడు అతను. దాంతో నన్ను పక్కకు పెడతారు. వాళ్ల ప్లాన్‌ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

తెలియని ఉత్సాహం..

విష్ణు కథ వినిపించినపుడే చాలా బాగా నచ్చేసింది. అదనంగా భారీ తారాగణం స్ర్కిప్టుపై ఆసక్తిని పెంచింది. అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం అనగానే తెలియని ఉత్సాహం వచ్చింది.  గతంలో నేనూ కాజల్‌ పలు చిత్రాల్లో నాయకానాయికలుగా రొమాంటిక్‌ పాత్రల్లో కనిపించాం. ఈ సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. ఇందులో కాజల్‌ ఎత్తుకు పైఎత్తు వేసే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తుంది.

కథ ఒకటే అయినా..

భారతదేశానికి చెందిన అక్కాతమ్ముళ్లు అమెరికా సాంకేతికతో ఆ దేశాన్నే మోసం చేసి భారీ ఐటీ కుంభకోణం ఎలా చేశారనేదే కథాంశం. దీన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశం ఆంగ్ల‌, తెలుగు భాషల్లో చిత్రీకరించాం. కథ ఒకటే అయినా అక్కడికీ ఇక్కడికీ భావోద్వేగాల్లోనే తేడా ఉంటుంది. మన ప్రేక్షకులు ఎలా ఉంటే ఇష్టపడతారో దర్శకుడికి వివరించేవాళ్లం. ఈ విషయంలో ఆయన మాకు సహకరించారు. 

అదే ఫిక్స్‌ అయ్యాను..

కెరీర్ ప్రారంభంలో కథల్ని జడ్జ్‌ చేయడం తెలియలేదు.  పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు స్ర్కిప్టులు తీసుకొచ్చినపుడు అవి నచ్చకపోయినా అనుభవం లేకపోవడంతో నో అని వాళ్లకి చెప్పలేకపోయాను. దాంతో చాలా పరాజయాలు ఎదురయ్యాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. లాక్‌డౌన్‌ సమయం ఇందుకు బాగా ఉపయోగపడింది. లోటుపాట్లు తెలిశాయి. మన దగ్గరకు వచ్చింది చేయడం కాదు మనకు  నచ్చింది చేద్దాం అని ఫిక్స్‌ అయ్యాను. ఇలా ఉన్నప్పుడు వెబ్‌ సిరీస్‌ అవకాశాలు వచ్చాయి. నా కోసం రాసిన కథలు కాకపోవడంతో వాటిని తిరస్కరించాను.

నా దృష్టంతా దానిపైనే..

ప్రస్తుతం ఓ ఫాంటసీ లవ్‌స్టోరీకి సంతకం చేశాను. ‘బాహుబలి’ చిత్ర  రచయితల్లో ఒకరైన అవనీంద్ర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. ఇప్పటికైతే నా దృష్టంతా ఈ సినిమాపైనే పెట్టాను.నటనతోపాటు సీ స్పేస్‌ సంస్థ పనులు చూసుకుంటున్నా. దీని ద్వారా రచయితలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. అన్నిరకాలుగా వాళ్లకి శిక్షణ ఇచ్చి కథలు సిద్ధం చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని వెబ్‌ సిరీస్‌లకు స్టోరీలు అందించాం. దర్శకుడు త్రివిక్రమ్‌కి ఓ కథ వినిపించాం బావుందన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని