ఆ వ్యక్తి చేసిన పనితో భయపడ్డా.. ‘ఛత్రపతి’ నటి వ్యాఖ్యలు

‘ఛత్రపతి’ (Chatrapathi)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నటి నుష్రత్‌. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Updated : 22 Apr 2023 11:45 IST

ముంబయి: గతంలో ఓ అభిమాని చేసిన పని వల్ల కంగారుపడ్డానని బాలీవుడ్‌ నటి నుష్రత్‌ (Nushrratt Bharuccha) తెలిపింది. అతడు అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని చెప్పింది. బాలీవుడ్‌ సినిమా ‘ఛత్రపతి’లో కథానాయికగా నటిస్తున్న నుష్రత్‌.. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్రేజీ ఫ్యాన్‌ మూమెంట్‌ గురించి మాట్లాడారు. ‘‘గతంలో ఓ అభిమాని మా ఇంటి ముందు చాలా బహుమతులు పెట్టి వెళ్లిపోయాడు. అందులో రెండు ముక్కలైన లవ్‌ సింబల్ ఉంది. ఒకదానిపై నా పేరు.. మరో దానిపై అతడి పేరు రాసి ఉంది. వాటిని చూసి షాక్‌ అయ్యాను. అయితే, ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడికి మా ఇంటి అడ్రస్‌ ఎలా తెలిసిందోనని భయం వేసింది’’ అని నుష్రత్‌ వివరించింది.

అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas) మాట్లాడుతూ.. ‘‘నాక్కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవల నేను కారు ఎక్కుతుండగా.. ఫొటో కోసం ఓ వ్యక్తి నా కారులోకి ప్రవేశించేశాడు. ‘మీరు ఏం చేస్తున్నారు?’ అని నేను ప్రశ్నించడంతో.. ‘ఒక్క ఫొటో ఇవ్వండి సర్‌’ అన్నాడు. అతడికి సెల్ఫీ ఇచ్చి.. కారు దిగమని చెప్పాను. ఆ క్షణం నేను షాకయ్యాను’’ అని చెప్పాడు. అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘‘మాటల్లో వర్ణించలేనిది.. అన్నింటికంటే విలువైన భావోద్వేగం ప్రేమే. నాక్కూడా కొన్ని ప్రేమకథలు ఉన్నాయి కానీ.. ప్రస్తుతానికి నేను సింగిల్‌నే’’ అని చెప్పాడు.

‘ఛత్రపతి’ (Chatrapathi) రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు టాలీవుడ్‌ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas). వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూట్‌ పూర్తి చేసుకున్న ఈసినిమా మే12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని