Rangamarthanda: ఆ రెండు మార్పులు చేసి ఉంటే సినిమా మరోలా ఉండేది: పరుచూరి

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సరికొత్త చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై తాజాగా పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ చెప్పారు.

Published : 18 Apr 2023 09:50 IST

హైదరాబాద్‌: ‘రంగమార్తాండ’ (Rangamarthanda)..  ఇదొక తల్లిదండ్రుల చరిత్ర అని అన్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). తల్లిదండ్రులకు దూరంగా ఉంటోన్న పిల్లలు తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. ఈ మేరకు ‘రంగమార్తాండ’పై రివ్యూ ఇస్తూ ఆయన ఓ వీడియో షేర్‌ చేశారు.

‘‘ఒక రకంగా ప్రకాశ్‌రాజ్‌ మోనో యాక్షన్‌ సినిమా ఇది. ఆయనతోపాటు రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. ఇదొక థియేటర్‌ ఆర్టిస్ట్‌ జీవిత కథే అయినప్పటికీ.. పిల్లలకు దూరంగా ఉండే తల్లిదండ్రులు తమ కథను పోల్చి చూసుకునే అంశాలు దీనిలో చాలా ఉన్నాయి. సినిమా చూసిన వెంటనే కృష్ణవంశీకి ఫోన్‌ చేసి ఇదే విషయాన్ని చెప్పాను. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకెందుకులే అని అనుకుంటున్నారు. అదే విషయాన్ని తెలియజేస్తూ మొదలైన ఈ సినిమా.. మంచి స్క్రీన్‌ప్లేతో ముందుకు సాగింది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే దాన్ని అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్‌ పరిచయ సన్నివేశాల్లో ఆయన ఓ హోటల్‌ ముందు ప్లేట్లు కడుగుతూ కనిపించాడు. అది చూసి ఒక ఆర్టిస్టు స్టేజ్‌నే నమ్ముకుంటే వృద్ధాప్యంలో ఇలా అయిపోతారని దర్శకుడు చెప్పాలనుకుంటున్నాడా? అని అనుకున్నాను. కానీ, అది నిజం కాదని సినిమా చూశాక అర్థమైంది.

తాను వేసిన ఎన్నో నాటకాలకు వేదికగా మారిన ‘కళాభారతి’లో ప్రమాదం చోటుచేసుకుందని తెలిసి.. అక్కడికి చేరుకున్న రాఘవరావు (ప్రకాశ్‌రాజ్‌).. తన జీవితకథను చెప్పే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులుగా రాహుల్‌, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్‌ మంచిగా నటించారు. శివాత్మిక పాత్ర నేటితరానికి అద్దం పట్టేలా ఉంటుంది. ఓ సన్నివేశంలో ఆమె తన తండ్రి రాఘవరావు (ప్రకాశ్‌రాజ్‌)ను సెల్లార్‌లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. అలాగే, బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ, ఆయన గుండెలు పిండేలా ఏడిపించగలడు అనేది ఈ సినిమాలో చూపించారు. ప్రకాశ్‌రాజ్‌కు ఆయనకు మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలు.. తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్‌ జన్మ ధన్యమైనట్లే.

లెవన్త్‌ అవర్‌కు వస్తే.. రాఘవరావు (ప్రకాశ్‌రాజ్‌) కళాభారతి ఎదుటే కన్నుమూయడం, పిల్లలందరూ ఆయన్ని చూడటానికి రావడం వంటి సీన్స్‌తో క్లైమాక్స్‌ చూపించారు. అలా కాకుండా.. రాఘవరావు కుటుంబం ‘కళాభారతి’ని పునఃనిర్మాణం చేయించి ‘రాఘవరావు సౌజన్యం’తో అని చివరి షాట్‌ పడి ఉంటే బాగుండేది. ఇంకో విషయం ఏమిటంటే.. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలియజేసేలా వారిద్దరి కాంబోలో అయినా లేదా ప్రకాశ్‌రాజ్‌పై అయినా ఇంకొన్ని షాట్స్‌ పెట్టి ఉంటే ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది’’ అని పరుచూరి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని