Police Story Review: రివ్యూ: పోలీస్‌ స్టోరీ.. ఐటీ ఉద్యోగిని చంపిందెవరు?

శ్రీనాథ్‌ మాగంటి, శ్వేతా అవస్తి, టెంపర్‌ వంశీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్‌ స్టోరీ’. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందంటే?

Updated : 28 Jul 2023 17:11 IST

Police Story Review: చిత్రం: పోలీస్‌ స్టోరీ: కేస్‌ 1; నటీనటులు: శ్రీనాథ్‌ మాగంటి, శ్వేతా అవస్తి, టెంపర్‌ వంశీ, ముక్తర్‌ ఖాన్‌ తదితరులు; సంగీతం: మీనాక్షి; ఎడిటింగ్‌: రిచర్డ్‌; సంభాషణలు: సురేశ్‌ బాబా; నిర్మాత: సురేశ్‌ కృష్ణ; రచన, దర్శకత్వం: రామ్‌ విఘ్నేశ్; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌ (28-07-2023).

రియాలిటీ షోలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, ధారావాహికలు, ఎవర్‌గ్రీన్‌ మూవీస్‌, న్యూస్‌.. ఇలా అన్నింటినీ ఒకే చోట చేర్చి ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win). రోజుకు రూ. 1కే వినోదం అందిస్తున్న ఈ ఓటీటీ నెలకో కొత్త సినిమాని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ‘పోలీస్‌ స్టోరీ: కేస్‌ 1’ (Police Story)ని రిలీజ్‌ చేసింది. శ్రీనాథ్‌ మాగంటి (Srinath Maganti), శ్వేతా అవస్తి (Shweta Avasthi) ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌ విఘ్నేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది. సూపర్‌హిట్‌ చిత్రం ‘బాషా’ (Baashha) దర్శకుడు సురేశ్ కృష్ణ (Suresh Krissna) ఈ సిరీస్‌ని నిర్మించారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా (Police Story Review)...

కథేంటంటే: కార్తిక్‌ అనే ఐటీ ఉద్యోగి తాను పనిచేసే కంపెనీలోనే హత్యకు గురువుతాడు. సంగతి తెలిసిన కంపెనీ సీఈఓ.. విషయం బయటకురాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో.. తెల్లారేలోగా అక్కడ ఫార్మాలిటీస్‌ పూర్తిచేయాలని కమిషనర్‌పై ఒత్తిడి తెస్తాడు. దాంతోపాటు, పీఏ సలహా మేరకు ఏసీపీ రియాజ్‌ (టెంపర్‌ వంశీ)కి జరిగిన విషయం చెబుతాడు. వ్యక్తిగత స్వార్థంతో రియాజ్‌ రంగంలోకి దిగుతాడు. అప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న మరో ఏసీపీ శివ (శ్రీనాథ్‌ మాగంటి).. కమిషనర్‌కు విజ్ఞప్తి చేసి, తానూ కేసు ఛేదించేందుకు వెళ్తాడు. కార్తిక్‌ని హత్య చేసింది సహోద్యోగి ఆర్తి (శ్వేతా అవస్తి) అని రియాజ్‌ అనుమానిస్తాడు. మర్డర్‌ చేసింది ఆర్తి కాదని శివ నమ్మకం. మరి, ఈ ఇద్దరు ఏసీపీల్లో హంతుకుడిని కనిపెట్టిందెవరు? వీరిద్దరి మధ్య వైరం ఎందుకు? ఆర్తికి శివకూ ఉన్న సంబంధమేంటి? అతడిపై సస్పెన్షన్‌ వేటు ఎందుకు పడింది? అన్నది మిగతా కథ (Police Story Review).

ఎలా ఉందంటే: ‘క్రైమ్‌ నవలలు చదివి, వెబ్‌సిరీస్‌/సినిమాలు చూసి ఇంతటి ఘోరానికి తెగించారట’ అనే మాట నేరం జరిగిన ప్రతిచోటా ఇటీవల బాగా వినిపిస్తోంది. నేరం ఎలా చేయాలి? దాన్నుంచి ఎలా బయటపడాలో? అవి కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పాయింట్‌ ఆధారంగానే దర్శకుడు రామ్‌ విఘ్నేశ్‌ ‘పోలీస్‌ స్టోరీ’ని రాసుకున్నారు. దానికి ఐటీ కంపెనీని ఇతివృత్తంగా తీసుకున్నారు. క్షణికావేశం ఎంత ప్రమాదకరమో గుర్తుచేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య సాగే కథ ఇది. సవాలుతో కూడిన ఒక్క రోజు/ఒక్క రాత్రిలో జరిగే కాన్సెప్ట్‌తో సినిమాలు అరుదుగా తెరకెక్కుతుంటాయి. ఇలాంటి చిత్రాల విషయంలో నిర్ణీత సమయానికి హీరో పని పూర్తిచేస్తాడని ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. అయితే, తన మిషన్‌ కంప్లీట్‌ చేసేందుకు కథానాయకుడు వేసే ప్లానింగ్‌పైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో హీరో పాత్రను చక్కగా డిజైన్‌ చేసి, రామ్‌ విఘ్నేశ్‌ మంచి మార్కులు కొట్టేశారు (Police Story Review).

రివ్యూ: బ్రో.. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మూవీ మెప్పించిందా?

ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రేక్షకులను ‘మర్డర్‌ సీన్‌’లోకి త్వరగానే తీసుకెళ్లారు. సహోద్యోగుల్లో ఎవరు కార్తిక్‌ని చంపారనే ఆసక్తి రేకెత్తించారు. అయితే, ఏసీపీ రియాజ్‌ ఇన్వెస్టిగేషన్‌ సన్నివేశాలు ఆకట్టుకోవడం కష్టం. దర్యాప్తు పూర్తయిన అనంతరం శివకు ఆర్తి ఫోన్‌ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడ ఎదురయ్యే ‘ఫ్లాష్‌బ్యాక్‌’ మెప్పిస్తుంది. ఆర్తి కోసం శివ రంగంలోకి దిగడంతో ద్వితీయార్ధంపై మరింత ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన స్టోరీ పరుగులు పెడుతుంది. హీరో.. ఓ ప్లాన్‌ మిస్‌ అయితే మరో ప్లాన్‌ వేయడం, ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానం ఉత్సుకత పెంచుతుంది (Police Story Review). 

ఎవరెలా చేశారంటే: ‘హిట్‌’, ‘హిట్‌ 2’ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించి, మెప్పించిన శ్రీనాథ్‌ ఈ సినిమాతోనూ ఆకట్టుకుంటారు. హావభావాలు పలికించడంలో ఇంకాస్త మెరుగుపడాలి. ఆర్తి అందం, అభినయం మెప్పిస్తాయి. టెంపర్‌ వంశీ నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఫర్వాలేదనిపిస్తారు. కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌, ఐటీ ఉద్యోగులు.. ఇలా తెరపై కనిపించే మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. ప్రథమార్ధంలోని కొన్ని సన్నివేశాల విషయంలో ఇంకాస్త ఎడిటింగ్ అవసరమనిస్తుంది.  రామ్‌ విఘ్నేశ్‌ టేకింగ్‌ బాగుంది (Police Story Review).

  • బ‌లాలు
  • + కాన్సెప్ట్‌
  • + ద్వితీయార్ధం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్రథమార్ధం
  • - నేపథ్య సంగీతం
  • చివ‌రిగా: ‘పోలీస్‌ స్టోరీ’.. టైటిల్‌ పాతదే.. కథ కొత్త అనుభూతి పంచుతుంది (Police Story Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు