Salaar: నా 21ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదు: ప్రభాస్‌

తన 21 ఏళ్లలో తాను చూసిన బెస్ట్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) అని ప్రభాస్‌ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘సలార్‌’(Salaar) గురించి మాట్లాడారు.

Published : 15 Dec 2023 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’లోని (Salaar) పాత్రల మధ్య లోతైన భావోద్వేగాలుంటాయని నటుడు ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. డిసెంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ‘సలార్‌’లోని పాత్రల గురించి చెప్పిన ప్రభాస్‌.. ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయడంపై తన అనుభూతిని పంచుకున్నారు.

‘ఈ సినిమాలో పాత్రల మధ్య లోతైన భావోద్వేగాలుంటాయి. ప్రేక్షకులు మొదటిసారి నన్ను ఇలాంటి పాత్రలో చూడబోతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మొదటి సారి నటించాను. నా ఆలోచనలు కొన్నింటిని ఆయనతో పంచుకున్నా. వాటిని స్క్రీన్‌పై ఎలా చూపించాలో ఆయన చెప్పారు. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనూ కొన్ని ఆలోచనలు షేర్‌ చేశా. వాటిలో కొన్ని ఆయనకు నచ్చాయి. ముఖ్యమైన సన్నివేశాలకు ముందు మేము మాట్లాడుకునే వాళ్లం. నా 21 ఏళ్ల కెరీర్‌లో నేను చూసిన బెస్ట్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ‘సలార్’ షూట్‌కు ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశా. సెట్‌కు వెళ్లి నటించడం కంటే ముందు ప్రశాంత్‌నీల్‌తో సమయం గడపాలని ఆత్రుతపడ్డా. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలా అనుకోలేదు. ఆరు నెలలు తన ఫోన్‌ కోసం వేచిచూశా. షూటింగ్‌ మొదలయ్యాక ఒక నెలలోనే మేము చాలా మంచి స్నేహితులమయ్యాం’’ అని ప్రభాస్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు.

రవితేజ చిత్రాన్ని రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌ అంటూ పోస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

ఇక శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథతో ‘సలార్‌’ రెండు భాగాలుగా రూపొందింది.  మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌1 సీజ్‌ ఫైర్‌’ (Salaar Part 1: CeaseFire) పేరుతో డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్‌తో పాటు తాజాగా విడుదల చేసిన మొదటి పాట ప్రేక్షకులను మెప్పించింది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ దీన్ని నిర్మించింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని