Prasanth varma: ఆయనే మా దేవుడు.. సంస్కృతిని ఎప్పుడూ తప్పుగా చూపించను: ప్రశాంత్‌ వర్మ

టాలీవుడ్‌ సినిమాల్లో దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదని ప్రశాంత్ వర్మ అన్నారు.

Updated : 18 Jan 2024 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజా సూపర్‌ హిట్ ‘హనుమాన్‌’తో (Hanuman) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma). చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రూ.100కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయ ఇతిహాసాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి. నందమూరి తారక రామారావు ఇలాంటివి ఎన్నో చేశారు. కానీ, ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదు. ఆయన సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు పండగ చేసుకునేవాళ్లు. మాకు ఎన్టీఆరే కృష్ణుడు, రాముడు. చాలా ఇళ్లల్లో దేవుడి విగ్రహాలతో పాటు ఆయన పోస్టర్లు ఉంటాయి. టాలీవుడ్‌ సినిమాల్లో దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదు. నేను ఈ జోనర్‌లో వచ్చిన చిత్రాలన్నీ చూస్తాను. కొన్ని చూసినప్పుడు సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటే.. మరికొన్నిటిని చూసి ఎలా తీయకూడదో తెలుసుకున్నా. ఇలాంటివి సున్నితమైన అంశాలు. జాగ్రత్తగా తెరకెక్కించాలి’’

‘‘నేను ఇతర దర్శకుల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. మన సంస్కృతిని, చరిత్రను ఎప్పుడూ తప్పుగా చూపించను. రామాయణ, మహాభారతాలను నేటి ప్రేక్షకులకు నా శైలిలో చెప్పాలనుకుంటున్నా. కానీ, వాటిని తీసేంత అనుభవం నాకు లేదు. అందుకే వాటి స్ఫూర్తితో కొత్తగా కల్పిత కథలను రూపొందిస్తున్నా. మా దగ్గర ఎక్కువ బడ్జెట్‌ లేదు.. కానీ, కావల్సినంత సమయం ఉంది. అందుకే ప్రణాళిక ప్రకారం తెరకెక్కించాం. వీఎఫ్ఎక్స్‌ కోసం పెద్ద చిత్రాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాం. హాలీవుడ్‌లో సూపర్‌ హీరోల సినిమాల్లో చూపించే పవర్స్‌ కంటే ఎక్కువ మన దేవుళ్ల దగ్గర ఉన్నాయి. అలాంటి పాత్రలే మన ఇతిహాసాల్లోనూ కనిపిస్తాయి. హనుమాన్ కూడా అలాంటి శక్తిమంతమైన పాత్రే. నేను సూపర్‌ హీరోల సినిమాలను తీయాలని నిర్ణయించుకున్నప్పుడు హనుమంతుడితోనే ప్రారంభించాలనుకున్నా. అదే చేశాను’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని