Bunny Vas: ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాత బన్నీవాసు కీలక వ్యాఖ్యలు

థియేటర్లలో విడుదలైన సినిమా కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రావడంపై నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సినిమానలు 50 రోజుల వరకూ ఓటీటీకి ఇవ్వొద్దని నిర్మాతలు యోచిస్తున్నారని తెలిపారు.

Updated : 28 Jun 2022 15:07 IST

హైదరాబాద్: థియేటర్లలో విడుదలైన సినిమాలు కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రావడంపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సినిమాలు 50 రోజుల వరకూ ఓటీటీకి ఇవ్వొద్దని నిర్మాతలు యోచిస్తున్నారని తెలిపారు. సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్‌ వ్యవస్థకే కాకుండా పెద్ద హీరోలకు తీరని నష్టమని పేర్కొన్నారు. దాంతో హీరోల క్రేజ్‌ కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. సినిమా విడుదల విషయంలో ఓ అగ్ర హీరో నిర్మాతతో ఒప్పందం చేసుకున్నారని, తన అనుమతి లేకుండా 50 రోజుల వరకు సినిమా ఓటీటీలోకి ఇవ్వొద్దని సూచించారని వివరించారు. సినిమాల ఓటీటీ విడుదలపై రేపు నిర్మాతలు సమావేశంకానున్నారని తెలిపారు.

తాను నిర్మాతగా వ్యవహరించిన ‘పక్కా కమర్షియల్‌’ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘సినిమా రంగంలో కొవిడ్‌ తర్వాత పబ్లిసిటీ ఖర్చులు పెరిగాయి. వసూళ్లు తగ్గాయి. ఫలానా సినిమా 30 రోజుల్లోనో 40 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు అనుకుంటే ఎవ్వరం ఏం చేయలేం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల (ఆన్‌లైన్‌ టికెటింగ్‌)పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. వీరితో చర్చించేందుకు ప్రభుత్వం ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎంతకాలానికి ఓటీటీలోకి తీసుకురావాలనే విషయమై ఎంతో రీసెర్చ్‌ జరుగుతోంది. ఫ్లాప్‌ అయిన సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి లాభం చేకూరినట్టువుతుంది. కానీ, అది భవిష్యత్తులో థియేటర్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.

గోపీచంద్‌ (Gopi Chand), రాశీఖన్నా (Raashi Khanna) నాయకానాయికలుగా దర్శకుడు మారుతి (Maruthi) తెరకెక్కించిన చిత్రమే ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial). కోర్టురూమ్‌ యాక్షన్‌- కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జులై 1న విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని