TFCC: ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా దిల్‌రాజు విజయం

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానెల్‌ పలు కీలక పోస్టులను కైవసం చేసుకుంది. టీఎఫ్‌సీసీ నూతన అధ్యక్షుడిగా దిల్‌ రాజు విజయం సాధించారు.

Updated : 31 Jul 2023 00:17 IST

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) విజయం సాధించారు. ప్రత్యర్థి నిర్మాత సి.కల్యాణ్‌పై 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్‌, కోశాధికారిగా ప్రసన్న కుమార్‌ గెలుపొందారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్‌ ప్యానెల్‌, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు సహా సుమారు 2 వేలకు పైగా టీఎఫ్‌సీసీలో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల సెక్టార్‌ నుంచి సుమారు 1,500 మంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 500, స్టూడియోల నుంచి 98 మంది సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. తొలుత పలు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిచినా.. సిబ్బంది ఆ సమస్యలను పరిష్కరించడంతో తర్వాత సజావుగా సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని