Puri Musings: హీరోయిన్స్‌ పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు

సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే తనకి నచ్చదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. హీరోయిన్స్‌ దేవతలతో సమానమని.. కాబట్టి వాళ్లు కూడా దేవతల్లా ఆలోచించి.....

Published : 17 Jun 2021 12:49 IST

స్ట్రాంగ్‌ ఉమెన్‌కి పూరీ ఇచ్చే సలహా ఏమిటంటే..

హైదరాబాద్‌: సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే తనకి నచ్చదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. హీరోయిన్స్‌ దేవతలతో సమానమని.. కాబట్టి వాళ్లు కూడా దేవతల్లా ఆలోచించి.. తమ శక్తిని ఈ దేశాన్ని మార్చడానికి ఉపయోగించాలని సూచించారు. తరచూ విభిన్నమైన అంశాలతో నెటిజన్లను ఆకర్షిస్తున్న పూరీ తాజాగా ‘సింగిల్‌ బై ఛాయిస్‌’ అనే కాన్సెప్ట్‌ గురించి వివరించారు. సమాజంలో ఉన్న స్ట్రాంగ్‌ ఉమెన్‌కి పూరీ ఇచ్చే సలహా ఏమిటో ఆయన మాటల్లోనే..

‘సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో ఒకరికి నటిగా మారే అవకాశం లభిస్తుంది. అందుకే వాళ్లు ఎంతో స్పెషల్‌. వాళ్లు కూడా అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు. హీరోయిన్స్‌ని తమ అభిమానులు దేవతల్లా భావిస్తుంటారు. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడలేను. మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు కాదు. కాబట్టి, మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం. సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే వ్యక్తిగతంగా మీరు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరైనా మగవాడిని దూరం పెట్టవచ్చు కదా..! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా?’

‘జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. పురాణాల్లో కూడా సింగిల్‌ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక, హాలీవుడ్‌లో అయితే పెళ్లిని పక్కనపెట్టిన లేడీ సూపర్‌స్టార్స్‌కు కొదవే లేదు. రంభ ఊర్వశి, మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే స్వర్గంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్స్‌ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ శక్తిని మరో విధంగా వాడండి. ‘రైజింగ్‌ ట్రైబ్‌ ఆఫ్‌ సింగిల్‌ ఉమెన్‌’ అనే కాన్సెప్ట్‌ భారత్‌లో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. హీరోయిన్స్‌ మాత్రమే కాదు ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. నేను స్ట్రాంగ్‌ ఉమెన్‌ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు’ అని పూరీ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని