అల్లు అర్జున్‌ కారవాన్‌కు ప్రమాదం

సుకుమార్‌-అల్లు అర్జున్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. 

Updated : 06 Feb 2021 19:34 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. ఇందులో బన్ని పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. కాగా, ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగింది. తాజాగా ఈ షెడ్యూల్‌ పూర్తయింది. దీంతో, అల్లు అర్జున్‌ సహా చిత్ర బృందం హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అల్లు అర్జున్‌ కారవాన్‌కు ఖమ్మం సమీపంలో ప్రమాదం జరిగింది. అయితే, ఆ సమయంలో బన్ని అందులో లేరు. కారవాన్‌లో ‘పుష్ప’ చిత్ర మేకప్‌ టీమ్‌ మాత్రమే ఉన్నారు. వెనుక నుంచి వచ్చిన లారీ బన్ని కారవాన్‌ను ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు ఏజెన్సీ ఏరియాలో షూటింగ్‌ పూర్తయిందంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది.

‘‘రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ‘పుష్ప’ చిత్రానికి సంబంధించి నవంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌కు సహకరించిన ఆదివాసీలు, అధికారులకు మా ధన్యవాదాలు. వారి సహకారం లేకుండా చిత్రీకరణ సజావుగా సాగేది కాదు. మళ్లీ ఇక్కడ షూటింగ్‌ చేసేందుకు తప్పకుండా వస్తాం’’ -ట్విటర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌

ఇక తర్వాతి సన్నివేశాల కోసం చిత్ర బృందం కేరళ అడవులకు పయనమవుతున్నట్లు సమాచారం. ఆగస్టు 13, 2021 ‘పుష్ప’ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ సందర్భంగా ఆసక్తికర పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. బన్నీ-సుకుమార్‌-దేవీశ్రీప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని