‘టెంపర్‌’లో నటించనన్న ఆర్‌.నారాయణమూర్తి

యువ కథానాయకుడు ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఒక విభిన్న చిత్రం ‘టెంపర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Published : 19 Oct 2023 14:54 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఒక విభిన్న చిత్రం ‘టెంపర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక విప్లవ, ప్రజా సమస్యలపై పోరాటంతో సాగే సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆర్‌.నారాయణమూర్తి. ఎర్రసైన్యం, చీమలదండు, ఒరేయ్‌ రిక్షా నుంచి నిన్న మొన్నటి ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ వరకూ ఆయన సినిమాలన్నీ సామాజిక సమస్యలపై తీసినవే.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘టెంపర్‌’ కథ అనుకున్నప్పుడు ‘మూర్తి’ అనే కానిస్టేబుల్‌ పాత్రను ఆర్‌.నారాయణమూర్తితో చేయించాలని అనుకున్నారట. అందుకు ఆయన్ను సంప్రదిస్తే, సున్నితంగా తిరస్కరించారు. ‘టెంపర్‌’లో మూర్తి పాత్ర వదులుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆర్‌.నారాయణమూర్తి ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘టెంపర్‌’లో అంత గొప్ప వేషాన్ని నాకు ఇవ్వడానికి వచ్చిన పూరి జగన్నాథ్‌కు నేను సెల్యూట్‌ చేస్తున్నా. కేవలం ఆ వేషం ఆర్‌.నారాయణమూర్తి వేస్తే సినిమా ఆడేస్తుందని ఆ పాత్రను నాకు ఆఫర్‌ చేయలేదు. నాతో ఒక గొప్ప వేషం వేయిద్దాం. ఒక డిఫరెంట్‌ వేషం వేయిద్దాం అన్న ఉద్దేశంతో నాకు ఇవ్వాలనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఈ వేషం వేయమని ఎంతో ప్రేమతో అడిగారు. కానీ, ‘ఈ వేషం నేను వేయలేను. నన్ను మన్నించండి’ అని అన్నాను. ఎందుకంటే జూనియర్‌ ఆర్టిస్ట్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగాను. ఇక నేను సినిమాలు చేస్తే ఐదారేళ్లకు మించి చేయను. అందుకే మళ్లీ నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేయకూడదని అనుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు’’ అని చెప్పుకొచ్చారు.

ఆర్‌.నారాయణమూర్తి చేయనన్న పాత్రను రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చేశారు. అవినీతి పోలీస్‌ అధికారి అయిన ఎన్టీఆర్‌కు కనీసం సెల్యూట్‌ కూడా చేయని వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. అయితే, ఎన్టీఆర్‌ మారిపోయిన తర్వాత సెల్యూట్‌ చేస్తూ, ఆయన పలికిన సంభాషణలు ప్రేక్షకులను అలరించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని