Prabhas Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నాకు రోల్‌ ఎందుకు క్రియేట్‌ చేయలేదు: ప్రభాస్‌

ప్రభాస్ - పూజాహెగ్డేల ‘రాధేశ్యామ్‌’ చూసేందుకు తన కుటుంబం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. మరో కొన్నిరోజుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రేక్షకుల్ని అలరించనున్న రాజమౌళి....

Published : 11 Mar 2022 01:50 IST

కంగన చెప్పిన మాటలు విని షాకయ్యా..!

ఇంటర్నెట్‌డెస్క్: ప్రభాస్ - పూజాహెగ్డేల ‘రాధేశ్యామ్‌’ చూసేందుకు తన కుటుంబం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. మరో కొన్నిరోజుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రేక్షకుల్ని అలరించనున్న రాజమౌళి తాజాగా ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ప్రభాస్‌ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. తాను ఇప్పటికే ‘రాధేశ్యామ్‌’ చూశానని.. అందులోని కొన్ని సన్నివేశాలు బాగా నచ్చేశాయని రాజమౌళి అన్నారు. ఇంతకీ డార్లింగ్‌ ఫ్రెండ్స్‌ మధ్య జరిగిన సరదా ముచ్చట్లు మీ కోసం..

ప్రభాస్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల కానున్న సమయంలోనూ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్స్‌లో భాగమైనందుకు థ్యాంక్యూ రాజమౌళి.

రాజమౌళి: చిరునవ్వులు

రాజమౌళి: సినిమా కెమెరా తప్ప, ఏ కెమెరా కనిపించినా భయపడేవాడివి. ప్రమోషన్స్‌, పబ్లిసిటీకి దూరంగా ఉండేవాడివి. ముఖ్యంగా సిగ్గుపడుతుండేవాడివి. కానీ, ఇప్పుడు ఎక్కడ ప్రమోషన్స్‌ జరిగినా పక్కవారికి ఛాన్స్‌ ఇవ్వకుండా నువ్వే మాట్లాడేస్తున్నావు. నీలో ఈ మార్పుకు కారణం ఏమిటి?

ప్రభాస్‌: నాలో ఈ మార్పునకు కారణం మీరే. ‘బాహుబలి’ విడుదలప్పుడు తమిళనాడులో ఒక్కరోజే 40 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ముంబయిలో జరిగే ప్రమోషన్స్‌కి రానంటే.. తీసుకువెళ్లి, 40మంది విలేకర్ల మధ్య కూర్చొపెట్టారు. ఆ క్షణం ఏం మాట్లాడాలో తెలియక వణికిపోయాను. ‘‘డార్లింగ్‌.. మనం మంచి సినిమా చేశాం. నువ్వు అస్సలు కంగారు పడకు’’ అని మీరు చెప్పేవారు. మీ మాటతో కాస్త ధైర్యం వచ్చేది. ఆ తర్వాత నా స్నేహితులతో ‘సాహో’ చేశా. సినిమా ప్రమోషన్స్‌ అన్నీ నా చేతుల్లో పెట్టారు. ఆ ప్రమోషన్స్‌లో కాస్త మాట్లాడటం నేర్చుకున్నా. ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేయగలుగుతున్నా.

రాజమౌళి: జ్యోతిష్యం, హస్తసాముద్రికం మీద నీకు నమ్మకం లేదా?

ప్రభాస్‌: మా గురువుగారు (రాజమౌళి) నమ్మడం లేదు కాబట్టి నాకూ నమ్మకం లేదు. ఒకవేళ మీరు నమ్ముంటే నేనూ నమ్మేవాడినేమో(నవ్వులు)

రాజమౌళి: సినిమా ఎలా ఓకే చేశావు?

ప్రభాస్‌: లవ్‌ స్టోరీ చేయాలనుకున్నప్పుడు రాధా నాకు ఈ కథ చెప్పారు. విక్రమాదిత్యలో పాత్రలో కమర్షియాలిటీ ఉంది. హస్తసాముద్రికంలో అతను ఎంతో తెలివైన వాడు. దర్శకుడు విక్రమాదిత్య రోల్‌ వివరించిన విధానం నాకెంతో నచ్చింది. అలా నేను ఒకే చేశా.

రాజమౌళి: ఈ సినిమా కోసం మీరు హస్తసాముద్రికంలో రీసెర్చ్‌ చేశారా?

ప్రభాస్‌: లేదు. పాత్రకు అనుగుణంగా సందర్భానుసారంగా నటించాను. నా దర్శకుడు రాధాకృష్ణ హస్తసాముద్రికం ఎక్కువగా నమ్ముతారు. అందువల్ల ఆయన మధ్య మధ్యలో కాస్త మెళకువలు చెప్పేవారు. వాటిని మాత్రమే ఫాలో అయ్యేవాడిని.

‘‘నాతో సన్నిహితంగా ఉండేవారందరికీ తెలుసు.. నేను కష్టాన్ని మాత్రమే నమ్మే మనిషినినని. కాకపోతే, ‘బాహుబలి’ తర్వాత వచ్చిన సక్సెస్‌ చూసిన తర్వాత.. ఇది కేవలం నా కష్టం వల్లే సాధ్యం కాదని.. ఇది నా విధి. అదృష్టం అని నమ్మడం ప్రారంభించా. నా జీవితంలో ఇలా జరగాలని ముందే రాసి పెట్టినట్టు ఉన్నారని అనుకున్నా’’

‘‘ఏక్‌ నిరంజన్‌’ సినిమా చేస్తున్న సమయంలో కంగన నాకు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పింది. తను సినిమాల్లోకి రాకముందు ఓసారి కేరళ వెళ్లినప్పుడు అక్కడ ఎవరో తన చేయి చూసి నువ్వు హీరోయిన్‌
అవుతావు అని చెప్పారట. ఆ మాట విని మొదట తను షాక్‌ అయ్యిందట. కానీ, నిజంగానే తను బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక మనిషి జాతకం ఎదుటి వ్యక్తికి ముందే ఎలా తెలుస్తుంది? అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఒక మనిషి ఎదుటి మనిషిని డిసైడ్‌ చేయగలడా? అనే ఆలోచన నాకు నచ్చదు. అందుకే నేను జాతకాలు చెప్పించుకోను. వ్యక్తిగతంగా నా చేయి వేరొకరి చేతిలో పెట్టి జాతకం చెప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు’’

‘‘నీ చేయి వేరొకరి చేతిలో పెట్టాలనుకోవడం లేదనమాట’’ అని రాజమౌళి అనగానే ‘‘సార్‌.. మీరు పరోక్షంగా నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారా?’’ అంటూ ప్రభాస్‌ ప్రశ్నించారు. దానికి.. ‘‘అలా ఏం లేదు డార్లింగ్‌ నేను సాధారణమైన ఉద్దేశంలోనే అడిగా. పెళ్లి గురించి అడగలేదు’’ అని చెప్పగానే ఇద్దరూ నవ్వులు పూయించారు.

రాజమౌళి: ఈ సినిమా ఒరిజినల్‌ కథ నాకు తెలుసు. ట్రైన్‌ ఎపిసోడ్ సీన్‌ ఎలా తెరకెక్కిస్తారో? అని చిన్న సందేహం ఉండేది. కానీ మొన్న సినిమా చూశాక.. ఆ సీన్‌ నాకు బాగా నచ్చేసింది. రాధా బాగా తెరకెక్కించాడు?

ప్రభాస్‌: రాధా కథ చెప్పినప్పుడే కొన్ని సన్నివేశాలు భారీ స్థాయిలో తీయాలని భావించాడు. అందులో ఒకటి ట్రైన్‌ ఎపిసోడ్‌, మరొకటి షిప్‌ ఎపిసోడ్‌.

రాజమౌళి: షిప్‌ ఎపిసోడ్‌ చాలా బాగా వచ్చింది?

ప్రభాస్‌: అబ్బా.. రాజమౌళి అన్నాడు. రాజమౌళి సినిమా బాగుంది అన్నాడంటే ఇక అంతా ఓకే. నాకు మీరే స్ఫూర్తి. నేను మీ నుంచే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీరు తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఎమోషన్‌ బాగా చూపిస్తారు. అదే విధంగా నా దర్శకులందరికీ చెబుతుంటాను.. ఏ సన్నివేశంలోనైనా విజువల్స్‌ ఒక్కటే కాదు.. ఎమోషన్స్‌ కూడా చక్కగా పండేలా చూసుకోవాలని.

రాజమౌళి: విజువల్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. ఇలా అన్నింటినీ పక్కన పెడితే సినిమా మొత్తంలో నాకు నటీనటుల కెమిస్ట్రీ బాగా నచ్చింది.

ప్రభాస్‌: థ్యాంక్యూ, సూపర్‌ 

రాజమౌళి: కమర్షియల్‌ సినిమాల్లో నటీనటుల మధ్య ప్రేమను మనం ఎంజాయ్‌ చేస్తాం కానీ, ఒక ఫీల్‌ ఉండదు. ‘రాధేశ్యామ్‌’లో ఆ ఫీల్‌ని బాగా చూపించారు.

ప్రభాస్‌: సూపర్‌. రాధా.. థ్యాంక్యూ నాతో ఒక మంచి లవ్‌ స్టోరీ తీసినందుకు. నన్ను పెట్టి లవ్‌స్టోరీ తీయడం అంత సాధ్యం కాదు. మీరు నాకు బాహుబలి ఇచ్చిన తర్వాత.. యాక్షన్‌ లవ్‌ స్టోరీ తీస్తే
బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ లవ్‌స్టోరీలో నటించే అవకాశం వచ్చింది.

‘‘వర్షం’ సినిమా చూసినప్పుడు మీరు నాతో ఒక మాట చెప్పారు. ‘ఒక అమ్మాయి వెనుక అబ్బాయి పడటం ఎలా సాధ్యం. అలాంటి కథలు నేను రాయలేను’ అని అన్నారు. కట్‌ చేస్తే మీరూ ‘మగధీర’లో అలాంటిదే చూపించారు. 500 ఏళ్ల నాటి ప్రేమకథగా దాన్ని చూపించారు. మరి అదేలా తెరకెక్కించారు’’ అని ప్రభాస్‌ అడగ్గానే ‘‘నువ్వే నన్ను చెడగొట్టేశావు’’ అంటూ రాజమౌళి నవ్వులు పూయించారు.   

రాజమౌళి: ‘రాధేశ్యామ్‌’ మేకింగ్‌ వీడియో భావోద్వేగానికి గురి చేసింది. ‘మేకింగ్‌ వీడియో’ అలా క్రియేట్‌ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కానీ సూపర్‌.

ప్రభాస్‌: అందరూ అదే మాట చెబుతున్నారు. మేకింగ్‌ వీడియోకి ఇన్ని ప్రశంసలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మీకు నచ్చిందంటే.. సూపర్‌. మేకింగ్‌ వీడియో అంటే గుర్తుకువచ్చింది.. యూరప్‌లో మా సినిమా షూట్‌ క్యాన్సిల్‌ అయ్యాక మేము ఇండియాకి వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశాం. అదే స్టూడియోలో మా సెట్‌ పక్కనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్ వేశారు. ఓ సీన్‌ కోసం మీ సెట్‌ సరిపోవడంలేదని భావించి.. ‘రాధేశ్యా్మ్‌’ సెట్‌ వాడుకుంటామని నాకు ఫోన్‌ చేశారు. అలా, ఒకే సెట్‌లో ఓవైపు మా సినిమా షూట్‌.. ఓ వైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూట్‌.. ఆరోజు ఎంతో సంతోషంగా అనిపించింది.

ప్రభాస్‌: మీరు ఒక చిన్న సినిమా చేయగలరా?

రాజమౌళి: తెలియదు. నేను ప్రతి సీన్‌లో ఎమోషన్స్‌ పండాలనుకుంటా. దానికి అనుగుణంగా షాట్స్‌ క్రియేట్‌ చేస్తా. ఆ షాట్స్‌ ఉత్తమంగా రావాలని కోరుకుంటా. ఆ క్రమంలో అది భారీ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.

ప్రభాస్‌: చరణ్‌, తారక్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేశారు. అందులో అతిథి పాత్రకు నన్ను అడగాలనిపించలేదా?

రాజమౌళి: నువ్వు పెద్ద ఓడ లాంటివాడివి ప్రభాస్‌. నిన్ను చూపించడం కోసం ఆర్టిఫిషల్‌ సీన్స్‌ క్రియేట్‌ చేయకూడదు. సినిమాకి అవసరం అనుకుంటే నిన్ను ఏదో ఒకరకంగా ఒప్పించి తీసుకువచ్చేస్తా. 

ప్రభాస్‌: వద్దులే సార్‌.. మీకు నాకంటే వాళ్లిద్దరే ఎక్కువ అని అర్థమైంది.

రాజమౌళి: అలా కాదు ప్రభాస్‌.. ఏ సినిమా చేస్తే ఆ హీరోలే నాకు ఎక్కువ. ఆ హీరోలకంటే నాకెవరూ ఎక్కువ కాదు.

‘‘మా ఫ్యామిలీ మొత్తానికి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. అందులో సుమారు 44 మంది ఉంటాం. సాధారణంగా సినిమా రిలీజైనా వచ్చే వారిని బట్టి రమా టిక్కెట్ల బుక్‌ చేస్తుంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాకీ 35కు మించి టికెట్లు బుక్‌ చేయలేదు. కానీ, ‘రాధేశ్యామ్‌’కి మాత్రం 44  టికెట్లు బుక్‌ అయ్యాయి. ప్రేక్షకులతోపాటు మా ఫ్యామిలీ మొత్తం సినిమా చూసేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం’’ అని రాజమౌళి చెప్పగానే.. ‘‘థ్యాంక్యూ. సినిమా రిలీజ్‌కు ముందు ఈ మాటలు వింటుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది’’ అని ప్రభాస్‌ ఆనందం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని