Rajinikanth: రజనీ ‘బాబా’ కొత్త క్లైమాక్స్‌తో మళ్లీ ధియేటర్లలోకి...!

రజనీకాంత్‌ నటించిన స్టైలిష్‌, డివోషనల్‌ చిత్రం బాబా. 2002లో విడుదలైన ఈ సినిమాను రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం.

Published : 23 Nov 2022 17:32 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. హీరోల పుట్టినరోజుల సందర్భంగా ఒకప్పటి సూపర్‌ హిట్‌ సినిమాలను తిరిగి ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌, మహేశ్‌ బాబు చిత్రాలు రీరిలీజ్‌ అయినా ప్రేక్షకులు వాటికి మరోసారి ఆదరించి  కోట్లు కురిపించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బాబా చిత్రం చేరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ 12 రజనీ పుట్టినరోజు సందర్భంగా బాబా సినిమాను రీరిలీజ్‌ చేయాలని నిర్ణయించారట.

20 ఏళ్ల క్రితం భారీ అంచనాల మధ్య విడుదలైన బాబా చిత్రం రజనీ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఈ సినిమాలోని డైలాగ్స్, రజనీ స్టైల్‌ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. అందుకే ఈ చిత్రానికి అదనపు మెరుపులు జోడించి రీ రిలీజ్‌ చేయనున్నారట. మూడు గంటల నిడివి ఉండే ఈ చిత్రాన్ని రీ ఎడిట్‌ చేసి కొత్త సీన్లు కలపనున్నారని సమాచారం. క్లైమాక్స్‌లోనూ మార్పు చేయనున్నారట. దీంతో బాబా సినిమాను కొనేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని టాక్‌. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ వార్త మాత్రం సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. రజనీకాంత్‌ బాబా నేటి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందనుకుంటున్నారు. అయితే, ఈ చిత్రాన్ని తమిళంలో మాత్రమే రీరిలీజ్ చేస్తారా? తెలుగులోనూ తీసుకొస్తారా? అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ సినిమాలో నటిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని