Ram Charan: ‘నాన్న వల్లే వచ్చినప్పటికీ..’ నెపోటిజంపై రామ్‌చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు స్పందించారు.

Updated : 18 Mar 2023 10:43 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమ (Cini Industry)లో బంధుప్రీతి (Nepotism) ఉందంటూ ఎంతోకాలం నుంచి చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ (Bollywood)లో ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌ అనే చెప్పాలి. ఈ విషయంపై రామ్‌చరణ్‌ (Ram Charan) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం దిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో పాల్గొన్న ఆయన నెపోటిజంపై స్పందించారు. ఒక స్టార్‌ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ టాలెంట్‌ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమన్నారు. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని చెప్పారు.

‘‘నిజం చెప్పాలంటే.. ఈ నెపోటిజం ఏంటో నాకస్సలు అర్థం కావడం లేదు. ఇటీవల దీని గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఇది ఇంతటి చర్చకు దారి తీసింది. నాకు నటన అంటే ఇష్టం.  చిన్నప్పటి నుంచి నేను పరిశ్రమలోనే ఉన్నాను. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నా. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే 14 ఏళ్లుగా ఇక్కడ నిలబడగలిగాను. మా నాన్న వల్లే పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఈ ప్రయాణాన్ని నాకు నేనుగా ముందుకు సాగించాలి. ప్రతిభ లేకపోతే ఈ ప్రయాణం సులభం కాదు. ‘సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌.. నీకోసం పనిచేసే వాళ్లను జాగ్రత్తగా చూసుకో చాలు’ అని తొలినాళ్లలో నాన్న నాతో చెప్పిన మాటను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ అని చరణ్‌ (Ram Charan) వివరించారు. తనకు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) అంటే ఇష్టమని, స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో సినిమా చేయాలని ఉందని చెప్పిన చరణ్‌.. అవకాశం వస్తే కోహ్లీ (Virat Kohli) బయోపిక్‌లో నటిస్తానని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు