Sudheer-Rashmi: సుధీర్‌ మాటలకు రష్మి ఎమోషనల్‌

బుల్లితెర లవ్లీ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మి, నటుడు సుధీర్‌. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో రష్మిపై సుధీర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాటలకు ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

Published : 04 Nov 2022 01:09 IST

హైదరాబాద్‌: రష్మి (Rashmi), నందు (Nandu) జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ (Bomma Blockbuster). గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ క్రమంలో యాంకర్‌ సుధీర్‌ పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా హిట్‌ కావాలన్నారు. ‘‘రష్మి ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది. నేను కూడా ఆమె నుంచి ప్రేరణ పొందాను. ఆమె మంచి మనసు ఉన్న వ్యక్తి. ముఖ్యంగా మూగజీవాల పట్ల ఆమె ప్రేమ కనబరుస్తుంటుంది. చుట్టపక్కల ఉన్న వాళ్లందరూ బాగుండాలని కోరుకుంటుంది’’ అని సుధీర్‌ చెప్పగానే రష్మి ఎమోషనల్‌ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

దయచేసి ప్రోత్సహించండి..! 

‘‘సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్‌కైనా 20 రోజుల సమయం ఉంటుంది. కానీ, కొన్ని కారణాల వల్ల మా సినిమా రిలీజ్‌కు నవంబర్‌ 4వ తేదీ దొరికింది. చిన్న సినిమాలకు సెకండ్‌ ఆప్షన్‌ తీసుకునే అవకాశం ఉండదు. అందుకే ఉన్న వారం రోజుల్లోనే వీలున్నంత వరకూ మా చిత్రాన్ని ప్రమోట్‌ చేశాం. నందు, నేను ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 14 ఏళ్లు అవుతుంది. ఈ సినిమా తర్వాత మా జీవితాలు మారతాయో లేదో తెలియదు. కానీ, మా సినిమాలో ఎంతోమంది కొత్తతరం నటీనటులు నటించారు. వాళ్లను ప్రోత్సహించండి. మా సినిమాకు మంచి విజయాన్ని అందించండి’’ అని రష్మి అన్నారు.

అవకాశాలు ఇవ్వకపోయినా సపోర్ట్ చాలు..! 

‘‘యూట్యూబ్‌లో ‘చోటు’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ చూసి రాజ్‌ విరాట్‌ని కలిశా. సినిమాపై అతనికి ఎంతో ప్యాషన్‌ ఉంది. రాజ్‌ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. మేమిద్దరం కలిసి శ్రీనగర్‌ కాలనీలో ఓ రూమ్‌ అద్దెకు తీసుకుని ఒక ఆఫీస్‌లా మార్చుకున్నాం. కొన్నినెలలపాటు కష్టపడి స్క్రిప్ట్‌ రాసి.. వేర్వేరు నిర్మాణ సంస్థలకు వెళ్లి దాన్ని వినిపించాం. ప్రతిఒక్కరూ.. ‘‘కథ బాగుంది. మాకు ఇచ్చేయండి. మేము వేరే దర్శకులతో చేస్తాం’’, ‘‘నందు ఈ కథకు సరిపోడు. కాబట్టి మేము వేరే హీరోతో చేస్తాం’’ అని అనేవాళ్లు. సుమారు మూడు నెలలు తర్వాత ఈ సినిమా నేనే నిర్మించాలని నిర్ణయించుకున్నా. యాంకర్‌గా నేను సంపాదించిన ప్రతి రూపాయినీ తీసుకువచ్చి విరాట్‌కు ఇచ్చేసి సినిమా మొదలుపెట్టాం. అలా, మా తొలి అడుగుపడింది. రష్మి.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈసినిమాలో యాక్ట్‌ చేసింది. తను నాకు ఎంతోకాలం నుంచి మంచి స్నేహితురాలు. మా ఇద్దరి గురించి ఏవేవో రాస్తున్నారు. తను నా భార్య గీతకు కూడా మంచి మిత్రురాలు. ఇక, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌ కొత్తవారే. ఈ సినిమాతో హిట్ కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. ఏది ఏమైనా ఇండస్ట్రీని వదిలి వెళ్లను. ఇక్కడే ఉండి నాలాంటి వాళ్లందరికీ ఛాన్స్‌ ఇస్తుంటా. నాకు ఎవరూ అవకాశాలివ్వక్కర్లేదు. పెద్దవాళ్లు సపోర్ట్‌ చేస్తే చాలు. తన తదుపరి సినిమాకీ నేనే నిర్మాతగా చేస్తున్నా. అందులోనూ కొత్తవాళ్లనే తీసుకున్నా. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక నాకొక పెద్ద బ్యానర్‌ నుంచి ఆఫర్‌ వచ్చింది’’ అని నందు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని