Rashmika: వచ్చే జన్మలో అబ్బాయిలా పుడతా: రష్మిక

వచ్చే జన్మంటూ ఉంటే మగవాడిలా పుట్టాలనుందని ప్రముఖ కథానాయిక రష్మిక అన్నారు.

Published : 03 Mar 2022 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే జన్మలో తాను కచ్చితంగా అబ్బాయిలా పుడతానని ప్రముఖ కథానాయిక రష్మిక అన్నారు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. రాధికా, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందంలోని కొందరు పాల్గొని, సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ వివరాలు వారి మాటల్లోనే..

‘‘చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి. చిన్నాపెద్దా అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సినిమాలోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. ఇందులోని సంభాషణలు సినిమాటిక్‌గా కాకుండా మన ఇంట్లో వారితో మాట్లాడినట్టే ఉంటాయి. ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఈ సినిమాలోనూ నటించా. ఒక్కో పాత్రకు ఒక్కో విధమైన వస్త్రధారణ ఉండేది. డ్రెస్సింగ్‌ విషయంలో ఓ మహిళగా చాలా కష్టపడ్డా. వచ్చే జన్మలో నేను కచ్చితంగా అబ్బాయిల పుడతా (నవ్వులు). నా పెళ్లి విషయానికొస్తే.. మంచి మనసు, నాకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే చేసుకుంటా. దానికి చాలా సమయం ఉంది’’ అని రష్మిక తెలిపింది.

‘‘కొవిడ్‌/లాక్‌డౌన్‌కు ముందు యాక్షన్‌, యూత్‌ఫుల్‌, లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. ఇలా అన్ని రకాల చిత్రాలు వచ్చాయి. కొవిడ్‌ పాండమిక్‌ తర్వాత పిల్లలతో కలిసి చూసే సినిమాలను మిస్‌ అవుతున్నాం. ఆ లోటును మా చిత్రం వందశాతం తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నా. కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాలని కోరకుంటున్నా. మహిళలంతా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్‌ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఈ సీన్‌కు మహిళలు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు’’ అని కిశోర్‌ తిరుమల అన్నారు.

‘‘ఇంటిల్లపాది థియేటర్‌లో సినిమా చూడడం గొప్ప అనుభూతి. ‘ఆడవాళ్లు..’ తరహా చిత్రాలు ఆ అనుభూతిని రెట్టింపు చేస్తాయి. మహిళా దినోత్సవం కానుకగా నాలుగు రోజుల ముందే ఈ సినిమా విడుదలవుతోంది. ఈ చక్కని కథను తెరపైకి తీసుకొచ్చేందుకు హీరో, దర్శకనిర్మాతలను ప్రశంసించాల్సిందే. ఆద్య అనే పాత్రతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఈ సినిమా శర్వానంద్‌కు మంచి విజయం అందిస్తుంది’’ అని ఝూన్సీ అన్నారు.

‘‘ప్రేక్షకులు ఈ సినిమా చూశాక నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని నిర్మాత సుధాకర్‌ అన్నారు.  ‘‘ఒకే ఒక్క జీవితం’ తర్వాత శర్వానంద్‌తో కలిసి పనిచేసిన చిత్రమిది. కిశోర్ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. ఇలాంటి కొన్ని సినిమాలు మాత్రమే కుటుంబ ప్రేక్షకుల్ని హత్తుకుంటాయి. ఈ సినిమా మహిళలకు అంకితమిచ్చేలా ఉంటుంది’’ అని కెమెరామెన్‌ సుజిత్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని