కచ్చితంగా క్రిమినల్‌ లాయర్‌ని అవుతా..!

అటు లాయర్‌ వృత్తిని, ఇటు నటనపై ఉన్న ఆసక్తిని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని అంటున్నారు ‘రెడ్‌’ చిత్రం హిరోయిన్‌ మాళవికాశర్మ. నేల టికెట్టుతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, మొదటి చిత్రంలోనే స్టార్‌ హీరో రవితేజ సరసన

Published : 07 Jan 2021 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అటు లాయర్‌ వృత్తినీ, ఇటు నటనపై ఉన్న ఆసక్తినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని అంటున్నారు హీరోయిన్‌ మాళవికా శర్మ. ‘నేల టిక్కెట్టు’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం రామ్‌ సరసన ‘రెడ్‌’లో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భవిష్యత్తులో కచ్చితంగా క్రిమినల్‌ లాయర్‌ అవుతానంటోన్న ఈ ముద్దుగుమ్మ చెప్పిన ఇతర సంగతులు కూడా చదవండి!

రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తున్నారనుకుంటా!

మాళవిక శర్మ: అవును. 2018లో నేను ‘నేలటిక్కెట్టు’లో నటించాను. అప్పుడు లా కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నా. తర్వాత హైదరాబాద్‌లోనే నా ఇంటర్న్‌షిప్‌ పూర్తయింది. ఆ సమయంలోనే నిర్మాత స్రవంతి రవికిషోర్‌, దర్శకులు కిషోర్‌ తిరుమల నన్ను కలిసి స్క్రిప్ట్‌ వినిపించారు. కథ వినగానే నా పాత్ర నచ్చి ఓకే చెప్పేశాను.

రామ్‌, రవితేజలాంటి ఎనర్జిటిక్‌ నటులతో నటించాక మీ అభిప్రాయం?

మాళవిక శర్మ:  ఇద్దరి శైలి వేర్వేరు అని నేను భావిస్తున్నాను. రవితేజ సార్‌తో చాలా సరదాగా ఉండేది. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. రామ్‌ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటారు. కానీ ఒక్కసారి యాక్టింగ్‌లో దిగగానే ఆయన ఎంతో ఎనర్జీగా ఉండేవారు. అందుకే ఆయనను ఎనర్జిటిక్‌ స్టార్‌ అంటారేమో!

‘తడమ్‌’ చూశారా?

మాళవిక శర్మ: నేనైతే మొత్తం చూడలేదు. కేవలం నా పాత్రకు సంబంధించి కొన్ని సీన్లు మాత్రమే చూశా. కిషోర్‌ సార్‌తో పనిచేస్తున్నప్పుడు  పాత్ర గురించి ఆయన మనకు ముందే విపులంగా/ క్లుప్తంగా చెప్పేస్తారు. ఆయనకు తెలుసు.. ఒక నటి నుంచి ఎటువంటి ప్రదర్శన కావాలో. దాన్ని బట్టి ఆయన నాకు సెట్‌లో సలహాలు ఇస్తుండేవారు. కిషోర్‌ సార్‌ చాలా గొప్ప దర్శకుడు.

‘రెడ్’‌లో మీ పాత్ర గురించి చెబుతారా?

మాళవిక శర్మ: నా పాత్రను బయటకు చెప్పకూడదు (నవ్వులు). కానీ ఈ సినిమాలో నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని కచ్చితంగా చెప్పగలను. నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. ఈ పాత్ర ద్వారా ఎంతో పరిణతి చెందిన నటిగా గుర్తింపు లభిస్తుంది. అంతలా దర్శకుడు నా నుంచి నటనను రాబట్టుకున్నారు. అందుకు ఎన్నో వర్క్‌షాపులు కూడా చేశాం.

దర్శకులు కిషోర్‌ తిరుమల గురించి?

మాళవిక శర్మ:  ఆయన చాలా సైలెంట్‌. అలాగే చాలా ప్రతిభావంతుడు. ఆయనతో సినిమా చాలా కూల్‌గా సాగిపోతుంది.  మన నుంచి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. షూటింగ్‌లో ఉన్నన్ని రోజులు ఆయన నన్ను మహిమ అని పిలిచేవారు. సినిమాలో నా పాత్ర పేరు అదే.  అలా పిలవటం వల్లే నా పాత్రలో ఇంకా లీనమై నటించాను. అంత కమిట్‌మెంట్‌గా కిషోర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు.

లాక్‌డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ అయిపోయిందా?

మాళవిక శర్మ:  లాక్‌డౌన్ ప్రకటించే ముందు మూడు రోజుల షూటింగ్‌ ఉండిపోయింది. అయితే ఆ షూట్‌ను ఒక్కరోజులోనే పూర్తి చేసేశాం.

కరోనా సమయంలో ఇటలీలో షూటింగ్‌ చేశారు కదా?
మాళవిక శర్మ: అవును. ఇండియా నుంచి వెళ్లే సమయంలో  మాస్కులు వేసుకుని, శానిటైజర్లు చేతిలో పెట్టుకుని ఇటలీ విమానం ఎక్కాం. అక్కడకు వెళ్లాక కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మనం ఎక్కడున్నా కరోనా వస్తుందని ధైర్యం చేసి మాస్కు వేసుకోవడం మానేశా. అయితే దేవుడి దయ వల్ల నాలో ఏ లక్షణాలు కనిపించలేదు(నవ్వులు).

‘నువ్వే..నువ్వే’ సాంగ్ చాలా బాగా వచ్చింది!

మాళవిక శర్మ: చాలా అద్భుతంగా దాన్ని చిత్రీకరించారు. ఇటలీలో మేము షూట్‌ చేసిన ప్రాంతాలన్నీ ఎంతో సుందరంగా ఉండేవి. ముఖ్యంగా కార్నివాల్‌ ప్రాంతం చాలా అద్భుతం. పాటలో ప్రతి నాలుగు స్టెప్స్‌కు లొకేషన్‌ మారుతూ ఉంటుంది. అది నిజంగా ఒక విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది.

అటు చదువు, ఇటు నటనావృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?

మాళవిక శర్మ: నేను ఈ మధ్యనే ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాను. ఎల్‌ఎల్‌ఎమ్‌ కూడా పూర్తి చేస్తాను. లాయర్‌గా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాను. కచ్చితంగా ఒక మంచి క్రిమినల్‌ లాయర్‌ను అవుతా. మా తాత లాయర్‌. అందుకే నాకు అటువైపు ఆసక్తి కలిగింది. నువ్వు లాయరు చదవాలనుకుంటే నీ డబ్బుతోనే చదువుకోమని మా నాన్న నాకు చెప్పారు. దీంతో కాల్‌సెంటర్లలో కూడా పనిచేసి డబ్బు సంపాదించేదాన్ని. ఆ తర్వాత కొన్ని యాడ్స్‌లో చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను.

నటనలో శిక్షణ తీసుకున్నారా?
మాళవిక శర్మ: ముంబయిలో కొన్ని వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను. అక్కడే ఒక పాత్ర పోషించే సమయంలో ఆ పాత్ర ప్రాముఖ్యతను ఎలా తెలుసుకోవాలో నేర్చుకున్నాను. యాడ్‌ ఫిల్మ్స్‌ చేసేటప్పుడు చాలా మంది పరిచయమయ్యారు. వాళ్లను కూడా గమనించేదాన్ని.

ఇంకేమైనా స్క్రిప్ట్స్‌ విన్నారా?

మాళవిక శర్మ:  వింటున్నాను. కానీ ‘రెడ్’‌ చిత్రంలో నా పాత్ర తరహావి ఏవైనా వస్తే చేసేందుకు సిద్ధం.

రామ్‌ డ్యాన్స్‌ వేగాన్ని అందుకోగలిగారా?

మాళవిక శర్మ: అమ్మో.. రామ్‌ చాలా వేగంగా డ్యాన్స్‌ చేస్తారు. నా అదృష్టం ఏంటంటే ఆయనతో నాకు మెలోడి సాంగ్‌ మాత్రమే ఉంది. అయితే  కూచిపూడి, కథక్‌లలో నాకు ప్రవేశం ఉంది.

భాషతో ఇబ్బంది పడ్డారా?
మాళవిక శర్మ:  అలా ఏం కాదు. కానీ మెల్లగా తెలుగును అర్థం చేసుకోవటానికి ముందు నుంచే ప్రయత్నించాను. ముంబయిలో తెలుగు ట్యూటర్‌ని పెట్టుకున్నా. డైలాగ్‌ చెప్పడంలో  లిప్‌ సింక్‌ తేడా రాకూడదని నా శాయశక్తులా ప్రయత్నించా. ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తా. తెలుగులో అందరు స్టార్లతో నటించాలని ఉంది.

‘రెడ్‌’లో మీ సహనటుల గురించి?

మాళవిక శర్మ: హీరో రామ్‌ తోటి నటుల్ని చాలా బాగా ప్రోత్సహిస్తారు.  అన్ని విషయాల్లోనూ ఆయనకున్న అనుభవాన్ని మనకు చెబుతారు. సినిమాలో పోషించిన రెండు పాత్రలను రామ్‌ చాలా ప్రతిభావంతంగా పోషించారు. నివేదాకు నాకు కాంబినేషన్ సీన్లేమి లేవు.

ఇవీ చదవండి!

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం: వెన్నెల ‘కంటి వెలుగులు’

రెహమాన్‌.. ‘తుజే సలామ్‌’!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని