RGV: వాళ్లు విడిపోతుంటే మీకేంటి?

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు విడిపోవడంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ఆమిర్‌-కిరణ్‌రావుకి భవిష్యత్తు మరింత అందం, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వర్మ తెలిపారు.....

Updated : 04 Jul 2021 12:02 IST

ఆమిర్‌ఖాన్‌ విడాకులపై ఆర్జీవీ వరుస ట్వీట్లు

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు విడిపోవడంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. వారిద్దరికీ భవిష్యత్తు మరింత అందంగా, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వాళ్లిద్దరి విడాకుల గురించి నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్‌ చేస్తోన్న వారికి కౌంటర్‌ విసిరారు. వాళ్లకి లేని బాధ మీకేంటి? అని ప్రశ్నించారు.

‘‘ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు ఎలాంటి బాధ లేకుండా విడిపోవడానికి సిద్ధమైనప్పుడు.. ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్లందరూ ఎందుకు ఇబ్బందిపడుతున్నారు. వాళ్ల గురించి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు?. ఆమిర్‌, కిరణ్‌రావు.. భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంతకుముందు లేని విధంగా ఇకపై మీ జీవితాలు మరింత రంగులమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వం, అజ్ఞానంతో ముడిపడిఉన్నది. కానీ విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో కూడుకున్న పని’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

ఇక ఆమిర్‌ఖాన్‌ విషయానికి వస్తే.. మొదటి భార్య రీనా దత్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆయన కిరణ్‌రావుని రెండో వివాహం చేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘లగాన్‌’ చిత్రానికి కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సినిమా షూట్‌ సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం 2005లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2011లో ఆజాద్‌ అనే బాబుకి సరోగసి పద్ధతిలో ఈ దంపతులు జన్మనిచ్చారు. కాగా, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలనే ఉద్దేశంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నామని ఈ దంపతులు శనివారం అధికారికంగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని