Rishab Shetty: ఆఫీస్‌ బాయ్‌గా పనిచేసిన సిటీలోనే అవార్డు అందుకున్న రిషబ్‌శెట్టి

దక్షిణాది తారలు రిషబ్‌ శెట్టి (Rishab Shrtty), సాయిపల్లవి (Sai pallavi) సీసీఏ అవార్డులు దక్కించుకున్నారు. నామినేషన్‌లో నిలిచిన బాలీవుడ్‌ నటీనటులను వెనక్కి నెట్టి వీరిద్దరూ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు సొంతం చేసుకున్నారు. 

Updated : 15 Apr 2023 11:59 IST

ముంబయి: ‘కాంతార’ (Kantara)తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ అందుకున్నారు నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty). భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ముంబయి వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో రిషబ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. 15 ఏళ్ల క్రితం నేను మొదటిసారి ముంబయికి వచ్చాను. అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేశా. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ముంబయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నా. ఈ క్షణం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

ఉత్తమ నటిగా సాయిపల్లవి..!

ఇదే కార్యక్రమంలో ఉత్తమ నటిగా సాయిపల్లవి (Sai Pallavi) అవార్డు దక్కించుకున్నారు. ‘గార్గి’కి గానూ ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ‘‘ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి వర్క్‌ చేస్తుంటారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు ఆనందిస్తున్నా. నేను ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయడానికి ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయి’’ అని సాయిపల్లవి అన్నారు.

కాంతార అప్‌డేట్‌ ఇదే..!

భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’ (Kantara). రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. సాధారణ సినిమాగా విడుదలైన ఇది అసాధారణ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని రిషబ్‌ మరోసారి స్పష్టం చేశారు. సీసీఏ అవార్డు తీసుకున్న అనంతరం ఆయన ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మీరు ఇప్పటికే ‘కాంతార -2’ చూశారు. త్వరలో ‘కాంతార-1’ చూడనున్నారు’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని