Ghani: వరుణ్‌ సాయం చేసేవాడు.. చరణ్‌, తారక్‌ డ్యాన్స్‌కు భయపడ్డా: సయీ మంజ్రేకర్‌

‘‘నటనపరంగా వరుణ్‌తేజ్‌ నాకు సాయంచేసేవాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు పాటకు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వేసిన డ్యాన్స్‌ చూసి భయపడ్డా’’ అని సయీ మంజ్రేకర్‌ తెలిపింది.

Published : 05 Apr 2022 23:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గని’ చిత్రం ఈ నెల 8న విడుదలకానుంది. ఈ చిత్రంలో వరుణ్‌ సరసన నటించిన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకనటుడైన మహేశ్‌ మంజ్రకర్‌ తనయ అయిన సయీ ఈ చిత్రం విడుదల నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది. ‘‘నటనపరంగా వరుణ్‌తేజ్‌ నాకు సాయంచేసేవాడు’’ అని పేర్కొన్న సయీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు పాటకు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వేసిన డ్యాన్స్‌ చూసి భయపడ్డా’’ అని తన మనసులోని మాటను చెప్పింది. 

తెలుగు నేర్చుకున్నారా?

ఈ సినిమాలో నటించే అవకాశం నాకు మూడేళ్ల క్రితమే వచ్చింది. అప్పటి నుంచే మా నాన్న (మహేశ్‌ మంజ్రేకర్‌) నాకు ఎన్నో సలహాలిచ్చారు. తెలుగులో ప్రతి పదాన్ని ఎంత స్పష్టంగా పలకాలో తెలిపారు. ఆయన చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకుని తెలుగు భాషను నేర్చుకున్నా. ఈ విషయంలో తెలుగు సినిమాలూ నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఖాళీ దొరికినప్పుడల్లా వాటిని చూస్తూ కొంత తెలుగు తెలుసుకున్నా. అయితే ధారాళంగా మాట్లాడలేను కానీ సినిమాకు సంబంధించిన సంభాషణలు చెప్పగలను. ఎదుటి వారు చెప్పింది అర్థం చేసుకోగలను. సెట్స్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో భాషరాక ఇబ్బంది పడ్డా.

ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించారు?

ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మాయి మాయ అనే పాత్ర పోషించా. నా స్వభావానికి దగ్గరగా ఉంటుంది. పాత్రకు పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

 మీ సహ నటుల గురించి ఏమైనా చెప్తారా?

వరుణ్‌ మంచి నటుడు, మనసున్న వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. డైలాగ్స్‌ చెప్పడంలో ఇబ్బంది పడినప్పుడు సహాయం చేసేవాడు. ఈ సినిమాలో సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు తదితరులు అద్భుతంగా నటించారు. వీరందరి నుంచి నటిగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. సినిమా పలుమార్లు వాయిదా పడినా నేను ఫీల్‌ అవలేదు. ఎందుకంటే మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారనే నమ్మకం.

దర్శకనిర్మాతలు ఎలా ఉండేవారు?

దర్శకుడు కిరణ్‌ ఎంతో కూల్‌గా ఉంటారు. నాకు ఏ చిన్న సందేహం కలిగినా ఆయన్నే అడిగేదాన్ని. సౌమ్యంగా సమాధానమిచ్చేవారు. ఆయన కోపాన్ని నేనెప్పుడూ చూడలేదు. నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు నాకేం ఏం కావాలో ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవారు. తొలి సినిమాకే ఇలాంటి వారితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.

సినిమా కథలను మీరే విని ఒకే చేస్తారా?

కుటుంబ సభ్యులతో కలిసి కథను వింటా. దానిపై అందరం చర్చించుకుంటాం. సినిమా చేయాలా, వద్దా? అనే నిర్ణయం నాదే.

టాలీవుడ్‌, బాలీవుడ్‌ మధ్య ఏదైనా తేడా గుర్తించారా?

ఒక్క భాష తప్ప ఈ రెండింటి మధ్య ఎలాంటి తేడాలేదు. సెట్స్‌లో వాతావరణం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. సినిమా కోసం అందరూ ఒకేలా కష్టపడుతుంటారు. నాకు దక్షిణాది వంటకాలంటే బాగా ఇష్టం. ‘గని’ షూటింగ్ ఉన్న ప్రతిరోజూ హైదరాబాద్‌ బిర్యానీ తిన్నాను.

తదుపరి చిత్రాలేంటి? వెబ్‌ సిరీస్‌లో నటించాలనుకుంటున్నారా?

తెలుగులో మరికొన్ని చిత్రాలు చేస్తున్నా. వివరాలు ఇప్పుడే చెప్పలేను. నాకు చాలా వెబ్‌ సిరీస్‌ల్లో అవకాశాలు వచ్చాయి. కానీ, సినిమాల్లోనే నటించాలని ఫిక్స్‌ అయి వాటిని తిరస్కరించా. సినిమాలకు సంబంధించి.. విభిన్న పాత్రలు పోషించాలనుంది. పాత్ర డిమాండ్‌ చేస్తే తప్పకుండా గ్లామర్‌గా కనిపిస్తా.

ఏదైనా సినిమా చూసి భయపడ్డారా?

సినిమాలు నన్ను భయపెట్టలేదు కానీ ‘నాటు నాటు’ (ఆర్‌ఆర్‌ఆర్‌) డ్యాన్స్‌ భయపెట్టింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్టెప్పులే అందుకు కారణం (నవ్వుతూ).


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని