Sailesh Kolanu: వారి పోరాటానికి బలమైన గొంతుక ‘సైంధవ్‌’

‘‘జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రయాణాన్ని ఆస్వాదించే మనస్తత్వం నాది. నిజాయితీగా సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్ముతా. ‘సైంధవ్‌’ను అదే అభిరుచితో చేశా’’ అన్నారు శైలేశ్‌ కొలను.

Updated : 10 Jan 2024 10:44 IST

‘‘జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రయాణాన్ని ఆస్వాదించే మనస్తత్వం నాది. నిజాయితీగా సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్ముతా. ‘సైంధవ్‌’ను అదే అభిరుచితో చేశా’’ అన్నారు శైలేశ్‌ కొలను. ‘హిట్‌’ సిరీస్‌ విజయాల తర్వాత ఆయన దర్శకత్వం నుంచి వస్తున్న కొత్త చిత్రమే ‘సైంధవ్‌’. ఇది హీరో వెంకటేశ్‌కు 75వ సినిమా. ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శైలేశ్‌.

‘‘హిట్‌ 2’ విడుదలయ్యాక నిర్మాత వెంకట్‌ సలహా మేరకు వెంకటేశ్‌ను కలిశా. అప్పుడాయన నన్నెంతో అభినందించారు. మరో రెండు మూడూ మీటింగ్స్‌ తర్వాత మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడే ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడే ‘సైంధవ్‌’ స్క్రిప్ట్‌ ఆయనకు వినిపించా. వెంటనే తను ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అన్నారు. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా డెవలప్‌ చేసి వినిపించా. వెంకీ అదంతా విని.. నాకు ఓ హగ్‌ ఇచ్చి.. ‘ఇది మనం చేస్తున్నాం’ అన్నారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది’’.

భావోద్వేగాలు నిండిన కథతో..

‘‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి పోరాటానికి బలమైన గొంతుకగా నిలుస్తుంది ఈ చిత్రం. ఆ వ్యాధిని నయం చేసే రూ.17కోట్ల ఇంజక్షన్‌ కోసం తపన పడే తల్లిదండ్రుల గురించి.. వారి పోరాటం గురించి మనకు పెద్ద అవగాహన లేదు. ఈ విషయాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలంటే వెంకటేశ్‌ వంటి స్టార్‌లు కావాలి. అందుకే ఈ కథను ఆయన ద్వారా చెప్పించాం. ఇంతటి భావోద్వేగాలు నిండిన కథను నేనింత వరకు చేయలేదు. ఇది చాలా ఆర్గానిక్‌గా రాసిన కథ. అందరికీ కనెక్ట్‌ అవుతుంది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’.

‘‘నా దగ్గర ఒక మంచి ప్రేమకథ ఉంది. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకొని దాన్ని రాశాను. తప్పకుండా దీన్ని సినిమాగా మలుస్తా. నాని ‘హిట్‌ 3’ చిత్ర స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏడాదిన్నర సమయం పట్టొచ్చు’’.

ఆద్యంతం ఉత్కంఠభరితం..

‘‘ఈ కథ దాదాపుగా 70శాతం రాత్రి పూటే నడుస్తుంది. మొదట.. వెంకటేశ్‌.. ఆయన కూతురు.. శ్రద్ధా శ్రీనాథ్‌.. విలన్‌.. ఇలా ప్రధాన పాత్రలు ఆసక్తికరంగా పరిచయమవుతాయి. 15నిమిషాల తర్వాత నుంచి ప్రేక్షకులు ఇక తల తిప్పుకోలేరు. అంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. డ్రగ్స్‌, గన్‌ బిజినెస్‌.. ఈ కథలో భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఇదంతా సముద్ర తీరంలో జరగాలి. వైజాగ్‌లో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా ఉండదు. అందుకే ఈ కథ కోసం ‘చంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్‌ టౌన్‌ను సిద్ధం చేశాం. ఇది విజయవంతమైతే ‘సైంధవ్‌ 2’ చేస్తాం. ఎందకంటే ఈ కథకు ఆ అవకాశం ఉంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని