Pathaan: వివాదాల ‘బేషరమ్‌ రంగ్‌’ పాటకు సెన్సార్‌ బోర్డ్‌ కట్స్‌.. సినిమా రన్‌టైమ్‌ ఇదే!

షారుఖ్‌ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’కు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది

Published : 18 Jan 2023 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ (Pathaan). దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డు ముందు సినిమాను ప్రదర్శించారు. సినిమాను పూర్తిగా వీక్షించిన బోర్డు ‘పఠాన్‌’కు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమా మొత్తం రన్‌టైమ్‌ 146.16 నిమిషాలు (2గంటలా 26 నిమిషాల 16 సెకన్లు).

ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్‌’ సాంగ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్‌ బోర్డు ఈ పాటకు మూడు కట్స్‌ చెప్పింది. దీపిక గోల్డెన్‌ స్విమ్‌సూట్‌లో ఉన్న మూడు క్లోజప్‌ షాట్స్‌, కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌లో మార్పులు చేశారు. ఇక సినిమా మొత్తం మీద 10కు పైగా కట్స్‌ చెప్పారట. సంభాషణలకు సంబంధించిన సూచనలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రదర్శన సమయానికి సెన్సార్‌బోర్డు సూచనల మేరకు మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.

ఆ ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకొన్న తొలి బాలీవుడ్‌మూవీ!

సినిమా విడుదలకు మరో వారం రోజులే ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. పఠాన్‌లోని కొన్ని యాక్షన్‌ సీన్స్‌ ఒళ్లుగగురుపొడిచేలా ఉంటాయన్నారు. థియేటర్‌లో విజువల్స్‌ పరంగా అద్భుతంగా ఉంటుందన్నారు. ఇక సైబీరియాలోని గడ్డకట్టిన బైకల్‌ సరస్సులో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ తీసినట్లు తెలిపారు. మాస్కో నుంచి 2వేల కి.మీ. దూరం ప్రయాణించి ఈ సరస్సు వద్ద షూటింగ్‌ చేసినట్లు వివరించారు. అలా అక్కడ చిత్రీకరణ జరుపుకొన్న తొలి బాలీవుడ్‌ మూవీగా పఠాన్‌ నిలిచినట్లైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని