Adipurush: ‘ఆదిపురుష్‌’ చూశాక అందరూ ఆశ్చర్యపోతారు..: శరద్‌ కేల్కర్‌

‘ఆదిపురుష్‌’కు హిందీలో డబ్బింగ్‌ చెప్పిన శరద్‌ కేల్కర్‌ (Sharad Kelkar) ఆ చిత్రం గురించి మాట్లాడారు. సినిమా చూశాక ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతారన్నారు. 

Updated : 18 May 2023 16:45 IST

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది చిత్రబృందం. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ హీరో శరద్‌ కేల్కర్‌ (Sharad Kelkar) మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దీంతో వాళ్ల అంచనాలు రెట్టింపయ్యాయి.

తెలుగు హీరోలకు హిందీలో డబ్బింగ్‌ చెప్పడంతో శరద్‌ కేల్కర్‌ టాలీవుడ్‌ వాళ్లకు కూడా సుపరిచితమయ్యారు. తాజాగా ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌కు ఆయనే హిందీ డబ్బింగ్‌ చెప్పారు. దీనిపై కేల్కర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను డబ్బింగ్‌లో భాగంగా ‘ఆదిపురుష్‌’ చూశాను. చాలా బాగుంది. తుది మెరుగులు దిద్దాక అందరూ ఆశ్చర్యపోతారు. సినిమాలోని కంటెంట్‌.. దాన్ని తెరకెక్కించిన విధానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. డబ్బింగ్‌ అంతా పూర్తయ్యాక ప్రభాస్‌ను కలిశాను. ఆయన నన్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. చాలా బాగా చెప్పావన్నారు. అదే నాకు ప్రభాస్‌ ఇచ్చిన అతిపెద్ద ప్రశంసగా భావించాను’’ అని చెప్పారు. తన గొంతు ప్రభాస్‌కు సరిపోతుందని తొలుత రాజమౌళి గుర్తించారని ఆయన అన్నారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన నాని ‘దసరా’కు కూడా శరద్‌ హిందీలో డబ్బింగ్‌ చెప్పారు. ఆ సమయంలో నాని ప్రతి సన్నివేశం గురించి వివరించేవాడని ఆయన చెప్పారు.

ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జూన్‌ 16న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఓంరౌత్‌ (Om Raut) రూపొందిస్తున్న ఈ సినిమాలో జానకి పాత్రలో కృతి సనన్‌ (Kriti Sanon) కనిపించనుంది. లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని