Siddharth: ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటివి జరగడం అసాధ్యం... ఫ్యాన్‌ వార్స్‌పై సిద్దార్థ్‌ కామెంట్స్‌

తన తదుపరి చిత్రం ‘టక్కర్‌’ (Takkar) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటుడు సిద్దార్థ్‌ (Siddharth). ఇందులో భాగంగా ఆయన ‘బొమ్మరిల్లు’ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

Updated : 28 May 2023 19:13 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో జరుగుతోన్న ఫ్యాన్‌ వార్స్‌ను ఉద్దేశిస్తూ నటుడు సిద్దార్థ్‌ (Siddharth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో హీరోలందరూ కలవడానికి అనువైన వాతావరణం ఉండేదని, కానీ, ఇప్పుడున్న రోజుల్లో అలాంటి వాతావరణమే కనిపించడం లేదని చెప్పారు. తాను హీరోగా నటించిన ‘బొమ్మరిల్లు’ విడుదల టైమ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన బయటపెట్టారు.

‘‘బొమ్మరిల్లు’ సినిమా సమయంలో నాకు సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటంటే.. నేనూ, తారక్‌, మహేశ్‌ బాబు కలిసి ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆ చిత్రాన్ని చూశాం. ఆ థియేటర్‌లో మేము  తప్ప మేరెవరూ లేరు. వాళ్లిద్దరికీ సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తైన వెంటనే ఎవరి ఇళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. మేము కలిసినట్లు ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటివి జరగడం అసాధ్యం. ఎందుకంటే, ఒక హీరో తన ఇంటి నుంచి బయటకు వస్తే ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టేస్తారు. హీరోలు కలిస్తే వాళ్ల గురించి ఏవేవో వదంతులు వ్యాప్తి చేసేస్తారు. సంబంధం లేకుండానే ఫ్యాన్స్‌ కొట్టుకుంటున్నారు. మేము కూడా హీరో ఫ్యాన్స్‌గానే పెరిగాం కానీ ఇప్పుడు పరిస్థితులు దిగజారిపోయాయి.  నెగెటివిటీ ఎక్కువైపోయింది. అసభ్య పదజాలంతో తిట్టుకుంటున్నారు. అప్పట్లో సెల్‌ఫోన్‌, కెమెరాలు చాలా తక్కువ. నటీనటులు సరదాగా కలవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు అది సాధ్యం అయ్యేలా లేదు’’ అని సిద్దార్థ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని