Chinna: ‘సిద్ధార్థ్‌ సినిమానా? ఎవరు చూస్తారు’ అన్నారు.. వేదికపై కన్నీటి పర్యంతమైన నటుడు

Chinna Movie: సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించిన ‘చిన్నా’మూవీ అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ జరిగింది.

Updated : 03 Oct 2023 16:51 IST

హైదరాబాద్‌: ‘చిన్నా’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే, ఇక తాను ఇక్కడకు రానని, ప్రెస్‌మీట్‌లు పెట్టనని చెబుతూ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని ప్రయత్నిస్తే, ‘సిద్ధార్థ్‌ సినిమాలు ఎవరు చూస్తారు’ అంటూ చులకనగా చూశారని అన్నారు. సిద్ధార్థ్‌, అంజలీ నాయర్‌, నిమిష సజయన్‌ కీలక పాత్రల్లో ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ రూపొందించిన తమిళ చిత్రం ‘చిత్త’. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు  తెలుగులో ‘చిన్నా’ (Chinna) పేరుతో అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (Chinna Pre Release Press Meet) జరిగింది. ఈ సందర్భంగా నటుడు సిద్ధార్థ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

‘‘చిన్నాన్న, అతని అన్నయ్య కూతురికి మధ్య ఉండే అనుబంధమే ఈ సినిమా.  ఈ సినిమా లైఫ్ డ్రీమ్‌. ఇలాంటి మూవీ తీయడానికి 22 ఏళ్లు పట్టిందని మా గురువు మణిరత్నంతో చెప్పా. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ‘ఏదో ఒక రోజు ఇంతకంటే గొప్ప తీయడం రాదు’ అనేలా సినిమా చేస్తానని అన్నాను. ఒక సినిమాను నిర్మించడానికి చాలా మార్గాలు ఉంటాయి. నేను సొంత డబ్బు పెట్టుకుని, సినిమా తీసే నిర్మాతను. ఇలాంటి మూవీ తీయాలంటే రూ.30కోట్లు సంపాదించాలి. దానికి పన్ను చెల్లించాలి. నా కుటుంబాన్ని చూసుకోవాలి. అప్పుడు మిగిలిన డబ్బులతో సినిమా చేస్తా. ఈ మూవీని నేను ఎంతో ఇష్టపడి, నమ్మకంతో చేశానో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సిద్ధార్థ్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమా ఇది.  నేను ఇంకా నటుడిగా ఎందుకు కొనసాగాలో చెప్పే సినిమా. తమిళంలో ఈ మూవీని ఆదరించారు. అంతకన్నా తెలుగు ప్రేక్షకులు ఇంకా అక్కున చేర్చుకుంటారని దర్శకుడితో అన్నాను. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని నాలుగు నెలల కిందట సెన్సార్‌ చేశాం. మొదటిసారి కన్నడ నేర్చుకుని, అక్కడ కూడా డబ్బింగ్‌ చెప్పా. కర్ణాటక వెళ్లి ప్రెస్‌ మీట్‌ పెడితే ‘నువ్వు తమిళవాడివి గెట్‌ అవుట్‌’ అన్నారు. ‘మీ భాష నేర్చుకుని, మీ వాడిగా మీ ముందుకు వస్తుంటే గెట్‌ అవుట్‌’ అంటారేంటి అనిపించింది. నా ప్రెస్‌మీట్‌ ఆపేశారు. నవ్వుతూ బయటకు వచ్చేశా’’

అతడి వల్ల నేను బలైపోయా.. హౌస్‌మేట్స్‌ గురించి రతిక చెప్పిన నిప్పులాంటి నిజాలు!

‘‘ప్రభాస్‌ ‘సలార్‌’కు పోటీగా ఈ సినిమానూ తీసుకొద్దామని సెప్టెంబరు 28వ తేదీ పెట్టుకున్నా. నేనూ ప్రభాస్‌ ఫ్యాన్‌నే. ‘సలార్‌’ మొదటి రోజు మొదటి షో నేనూ చూస్తా. దాని తర్వాత నా సినిమా చూస్తా. ‘సలార్‌’ మీ వరకూ పెద్ద బడ్జెట్‌ మూవీ. ‘చిన్నా’ మూవీ నా లైఫ్‌. వాళ్లు డేట్‌ మార్చడంతో పది మంది వచ్చారు. తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్‌ కొత్తవాడేమీ కాదు. 28న మరో పది సినిమాలు వచ్చినా విడుదల చేద్దామని అనుకున్నా. కానీ, తెలుగులో కుదరలేదు. అందుకు కారణం ఉంది. నా సినిమా చూసి ‘ఇంత కన్నా గొప్ప సినిమా నేను చూడలేదు’ అని ఉదయనిధి స్టాలిన్‌ నా సినిమాను తమిళంలో కొన్నారు. కేరళలోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్‌ గోకులమ్‌ గోపాలన్‌ నా సినిమా తీసుకున్నారు. ‘కేజీయఫ్‌’  నిర్మించిన వారు కన్నడలో విడుదల చేశారు. తెలుగుకు వచ్చేసరికి ‘సిద్ధార్థ్‌ సినిమానా  ఎవరు చూస్తారు’ అని అడిగారట. నేనొక మంచి సినిమా తీస్తే, ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. ఆ సమయంలో నా దగ్గరకు వచ్చి, ‘మేము మీతో ఉన్నాం’ అని ఏషియన్‌ సునీల్‌గారు ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. వాళ్లకు చాలా థ్యాంక్స్‌..  నా సినిమాలో అది ఉంది. ఇది ఉంది అని చెప్పి అడుక్కుతినే బ్యాచ్‌ కాదు. మీకు సినిమాల మీద నమ్మకం, ఇష్టం ఉంటే, థియేటర్‌కు వెళ్లి ‘చిన్నా’ చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత ‘తెలుగులో సిద్ధార్థ్‌ సినిమాలు చూడం’అని మీకు అనిపిస్తే, ఇక తెలుగులో ప్రెస్‌మీట్‌లు పెట్టను. ఇక్కడకు రాను. ఈ 22ఏళ్లలో సిద్ధార్థ్‌ బయటవాడు అన్న మాట రాలేదు. ప్రేక్షకులకు నేరుగా అడిగే సమయం వచ్చింది. ‘నా పేరు సిద్ధార్థ్‌. నేను చిన్నా అనే సినిమా తీశాను. మీరు తప్పక చూడాలి’’ అని సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని