Siri Hanmanth: ‘జవాన్‌’.. ప్రాంక్‌ కాల్‌ అనుకున్నా.. అక్కడికి వెళ్లిన రోజు ఏడ్చేశా: సిరి హన్మంత్‌

షారుక్ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘జవాన్‌’లో సిరి హన్మంత్‌ ఓ పాత్ర పోషించారు. ఆ విశేషాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Published : 19 Sep 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జవాన్‌’ (Jawan) సినిమాలో తనను నటింపజేసేందుకు చిత్ర బృందంలోని పలువురు ఫోన్‌ చేయగా ప్రాంక్‌ కాల్‌ అనుకుని కొట్టిపారేశానని, తర్వాత ఓ మేనేజరు ఫోన్‌ చేసి మాట్లాడగా అది నిజమని అర్థమైందని ‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5’ (Bigg Boss) ఫేమ్‌, నటి సిరి హన్మంత్‌ (Siri Hanmanth) తెలిపారు. ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన తొలిరోజే భయంతో ఏడ్చానని అన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంగతులు పంచుకున్నారు. సెట్స్‌ చూశాక కూడా నమ్మకం కలగలేదని, దాంతో, ‘ఇది షారుక్‌- అట్లీల సినిమానేనా?’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేదానిని అని చిత్రీకరణ సమయాన్ని గుర్తుచేసుకున్నారు. ముంబయి తనకు కొత్తకావడంతో నటుడు, తన ఫ్రెండ్‌ శ్రీహాన్‌ తోడుగా నిలిచాడని పేర్కొన్నారు.

హౌస్‌లో ఆమె అందమైన పాము.. తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు!

‘‘సెలక్షన్‌కు ముందు దర్శకుడు అట్లీ నన్ను తెలుగు అమ్మాయి అనుకోలేదు. వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయిని అనుకున్నారు. ఓ సంభాషణకు 7 టేక్స్‌ తీసుకోవడంతో ఆయన పరోక్షంగా నాపై అరిచారు. దాంతో కంటతడి పెట్టుకున్నా. ఎందుకు ఏడుస్తున్నావ్‌? అని షారుక్‌ అడిగారు. ‘మీరు పెద్ద స్టార్‌ కదా. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తోంది’ అని చెప్పా. ‘నేను హ్యాండ్సమ్‌గా ఉన్నాను కదా. భయంకరంగా లేనుగా. నువ్వు చేయగలవు’ అంటూ ధైర్యాన్నిచ్చారు’’ అని షారుక్‌ ఖాన్‌ను సిరి కొనియాడారు.

షారుక్‌ ఖాన్‌  (Shah Rukh Khan) హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘జవాన్‌’లో సిరి హన్మంత్‌ చిన్న పాత్ర పోషించారు. ఈ విషయం సినిమా విడుదలకు ముందు తెలియకపోవడంతో ఆమె తెరపై చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ ఫీల్‌ అయ్యారు. షారుక్‌ విభిన్న లుక్స్‌- హీరోయిజం, నయనతార అందం, విజయ్‌ సేతుపతి విలనిజం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా.. తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 858 కోట్లు కలెక్ట్‌ (Jawan Collections Worldwide) చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని