Oscars 2021: వయసుతో సంబంధం లేదు

83 ఏళ్ల వయసులోనూ నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆంథోని హాప్కిన్స్‌కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం వరించింది. 1992లో ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అకాడమీ...

Updated : 26 Apr 2021 15:28 IST

అకాడమీ అవార్డు గెలుపొందిన ఆంథోని డోర్మెండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 83 ఏళ్ల వయసులోనూ నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆంథోని హాప్కిన్స్‌కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం వరించింది. 1992లో ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు అందుకున్న ఆంథోని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అవార్డును ముద్దాడారు. ‘ది ఫాదర్‌’ చిత్రానికిగానూ ఆయన ఆస్కార్‌ గెలుచుకున్నారు. మరోవైపు 63 యేళ్ల ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ ముచ్చటగా మూడోసారి ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకున్నారు.

83 ఏళ్ల వయసులో..

83 ఏళ్ల వయసులో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న నటుడు ఆంథోని హాప్కిన్స్‌. 1992లో ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు ఆంథోని. ఆ తర్వాత పలు సార్లు ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నా పురస్కారం దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ‘ది ఫాదర్‌’ చిత్రంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వృద్ధుడి పాత్రలో ఆంథోని నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని నటనకు పలు అంతర్జాతీయ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లు కూడా దక్కించుకున్నారు. ‘ది లయన్‌ ఇన్‌ ది వింటర్‌’, ‘హన్నీబాల్‌’, ‘రెడ్‌ డ్రాగన్‌’, ‘ది ఎలిఫెంట్‌ మ్యాన్‌’, ‘84 ఛార్జింగ్‌ క్రాస్‌ రోడ్‌’, ‘థోర్‌’, ‘నిక్సన్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హాప్కిన్స్‌.

ముచ్చటగా మూడోసారి..

స్వేచ్ఛనిచ్చే తల్లిగా, వేధింపులకు గురైన భార్యగా, వ్యభిచారం చేసే మహిళగా, సంచార జీవితాన్ని గడిపే నోమ్యాడ్‌గా ...ఇలా ఎన్నో పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌. ఆమె తన 40 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్‌ ఉత్తమ నటి కిరీటం అందుకున్న ఆమె మూడోసారి సైతం విజయం సాధించారు. ఒక చోట స్థిరంగా ఉండకుండా సంచారం చేసే నోమ్యాడ్స్‌ నేపథ్యంతో తీర్చిదిద్దిన కథతో తెరకెక్కిన చిత్రం ‘నోమ్యాడ్‌ ల్యాండ్‌’. ఇందులో భర్తను కోల్పోయిన 61 ఏళ్ల ఫెర్న్‌ అనే మహిళ పాత్రలో అద్భుతంగా నటించారు ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌. ఈ చిత్రంలోని నటనకుగాను ఆమెకు 93వ ఆస్కార్‌ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ‘బ్లడ్‌ సింపుల్‌’, ‘ఆల్‌మోస్ట్‌ ఫేమస్‌’, ‘ది మ్యాన్‌ హు వాజ్‌ నాట్‌ దేర్‌’, ‘మిస్‌ పెట్రీగ్రూ లివ్స్‌ ఫర్‌ ఎ డే’, ‘మిసిసిప్పీ బర్నింగ్‌’, ‘నార్త్‌ కంట్రీ’, ‘లోన్‌ స్టార్‌’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు డోర్మెండ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని