Bhagavanth Kesari: రూటు మార్చిన బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి.. ‘భగవంత్‌ కేసరి’ విశేషాలివీ

బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..

Published : 18 Oct 2023 16:29 IST

ఈ దసరా బరిలో నిలిచిన సినిమాల్లో ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) ఒకటి. బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో (ఈ నెల 19న) విడుదల కానుంది (Bhagavanth Kesari Release Date). మరి, ఈ మూవీ నేపథ్యమేంటి? రన్‌టైమ్‌ ఎంత? తదితర విశేషాలు తెలుసుకోండి.

  • బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్‌ కథాంశం, దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) అనగానే కామెడీ కంటెంట్‌ గుర్తొస్తుంది. అలాంటి వీరిద్దరూ పంథా మార్చి చేసిన సినిమానే ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari on October 19th). తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందేనని బాలకృష్ణ ఓ వేడుకలో అన్నారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్‌, కామెడీ అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.
  • హీరో క్యారెక్టరైజేషన్‌ను బట్టి ఈ సినిమాకి ‘బ్రో.. ఐ డోంట్‌ కేర్‌’ టైటిల్‌ పెట్టాలనుకున్నారు. కానీ, మనిషి పేరుతో కూడిన టైటిల్‌ ఉంటేనే ఎక్కువ రోజులు ప్రేక్షకులు ఆ సినిమాతో ప్రయాణం చేస్తారనిపించి ‘భగవంత్‌ కేసరి’ని ఫిక్స్‌ చేశారు. ‘ఐ డోంట్‌ కేర్‌’ని ట్యాగ్‌లైన్‌ చేశారు.
  • బాలకృష్ణకు ఇది 108వ సినిమాకాగా దర్శకుడు అనిల్‌ రావిపూడికి 7వ చిత్రం. నందమూరి బాలకృష్ణను NBKఅని కూడా అంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఆయన పాత్ర పేరూ ఎన్‌బీకే (నేలకొండ భగవంత్‌ కేసరి)కావడం విశేషం. విభిన్న గెటప్పుల్లో బాలకృష్ణ సందడి చేయనున్నారని సమాచారం.
  • బాలకృష్ణ ఆయుధం పట్టుకుంటే థియేటర్లలో విజిల్స్‌ గోల ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మరి, ఆయన ఎక్కడ వీలుంటే అక్కడే ఆయుధం తయారు చేసుకుని రంగంలోకి దిగితే ఇంకెలా ఉంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు కొన్ని సన్నివేశాలు సృష్టించారు.
  • ఇందులో బాలకృష్ణ వేషధారణే కాదు సంభాషణలూ కొత్తగా ఉంటాయి. తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని సినీ విశ్లేషకుల మాట.

  • ఈ నేలకొండ భగవంత్‌ కేసరితో తలపడే విలన్‌ పాత్ర పేరు రాహుల్‌ సంఘ్వి. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అర్జున్‌ రాంపాల్‌ (Arjun Rampal) ఈ క్యారెక్టర్‌ ప్లే చేశారు. ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా. డబ్బింగ్‌ కూడా చెప్పడం గమనార్హం.
  • వివాహం, బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) నటించిన చిత్రాల్లో ఇదొకటి. ఇందులో ఆమె భగవంత్‌ కేసరి భార్య కాత్యాయనిగా నటించింది. భగవంత్‌ కేసరి గారాల పట్టి విజ్జి పాపగా ప్రస్తుత టాలీవుడ్‌ సెన్సేషన్‌ శ్రీలీల (Sreeleela) కనిపించనుంది.
  • ‘అఖండ’తో బాలకృష్ణ- సంగీత దర్శకుడు తమన్‌ కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ నేపథ్య సంగీతం కూడా అదిరిపోవడంతో ‘భగవంత్‌ కేసరి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • సెన్సార్‌ బోర్డు U/A సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా నిడివి 2 గంటల 44 నిమిషాలు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి.
  • చివరిగా: అమ్మాయి లేడి పిల్లలా కాదు... పులి పిల్లలా ఉండాలని చెప్పే కథ ఇది. దీనికి ఆర్మీ నేపథ్యాన్ని జోడించారు. కొన్ని సంఘటనలతో విజ్జిపాప బలహీనురాలు అయిపోతుంది. ఆ ఘటన నుంచి బయటికి తీసుకొచ్చి ఆమెని దృఢంగా మార్చేందుకు నేలకొండ భగవంత్‌ కేసరి ప్రయత్నిస్తాడు. ఎన్‌బీకే ప్రయాణం ఎలా సాగింది? అసలు విజ్జి పాపకు ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని