Suriya: ఓటమే లేని ధీరుడు.. ‘కంగ’

కుశలమా... అంటూ పలకరించాడు కంగ. ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచిన ఆ వీరుడి కథేమిటో తెలియాలంటే ‘కంగువా’ చూడాల్సిందే.

Updated : 24 Jul 2023 14:06 IST

కుశలమా... అంటూ పలకరించాడు కంగ. ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచిన ఆ వీరుడి కథేమిటో తెలియాలంటే ‘కంగువా’ చూడాల్సిందే. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. దిశా పటానీ కథానాయిక. శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియోగ్రీన్‌, యు.వి.క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల్ని అలరించనుంది. కథానాయకుడు సూర్య పుట్టినరోజు పురస్కరించుకుని ఆదివారం టీజర్‌ని విడుదల చేశారు. దక్షిణాది భాషలతోపాటు, హిందీ, ఆంగ్లంలోనూ టీజర్‌ విడుదలైంది. రెండు నిమిషాల నిడివి వున్న ఈ టీజర్‌లో విజువల్స్‌, సూర్య కనిపించిన విధానం ఆకట్టుకున్నాయి.


* ‘వేవేల పులిగోళ్ల పదునే వీడు... శతకోటి సర్పాల పొగరే వీడు... చెలరేగు సంద్రాల ముఖమే వీడు... గర్జించు ఢంకాల అదురే వీడు... ఒక్కడే ఒక్కడు వీరుడు రా... యుద్ధమై ఉరుకు సూరీడురా... ఓటమేలేని ధీరుడురా... మన అడవితల్లి ప్రాణమురా’ అనే మాటలతో కథానాయకుడి పాత్రని పరిచయం చేశారు. కుశలమా... అంటూ చివర్లో చేసిన సందడి ఆకట్టుకుంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 14వ శతాబ్దం నేపథ్యంలో... ఓ కల్పిత కథతో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని