Suriya: ‘రోలెక్స్’ రాకపై సూర్య కామెంట్స్ వైరల్‌

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్‌’లో రోలెక్స్‌గా కనిపించి థియేటర్స్‌ను షేక్‌ చేశారు నటుడు సూర్య. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ పాత్రలో నటించడంపై తాజాగా  సూర్య స్పందించారు.

Updated : 12 Oct 2022 10:38 IST

హైదరాబాద్‌: ‘రోలెక్స్‌’ (Rolex).. కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్‌’ (Vikram) సినిమా చూసినవాళ్లకు ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డ్రగ్స్‌ దందాను నడిపే నాయకుడిగా, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆయన అదరగొట్టేశారు. ఈ పాత్రలో నటించడంపై తాజాగా సూర్య (Suriya) స్పందించారు. ఇటీవల జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో దీని గురించి మాట్లాడారు.

కేవలం ఆయన కోసమే..

‘‘కమల్‌హాసనే నా స్ఫూర్తి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి ఆయన ఓ కారణం. ‘విక్రమ్‌’ సినిమాలో ఆఫర్‌ ఉందని దర్శకుడు లోకేశ్‌ ఫోన్‌ చేశాడు. ఆ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నా. నా ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకున్నా. అయితే రోలెక్స్‌ పాత్ర గురించి విన్నాక.. అలాంటి పాత్రలో నటిస్తే ఏమనుకుంటారోననే సందేహం వచ్చింది. వెంటనే చేయనని చెప్పేశా. కానీ, చివరకి, కమల్‌హాసన్‌ కోసమే ఈ పాత్ర పోషించా’’ అని సూర్య వివరించారు. అనంతరం, ‘రోలెక్స్‌ రోల్‌లో మళ్లీ కనిపిస్తారా?’ అని అడగ్గా.. ‘‘కాలమే సమాధానం చెబుతుంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా’’ అని బదులిచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని