Taali Trailer: ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితాసేన్‌.. ‘తాలి’ ట్రైలర్‌ చూశారా?

జాతీయ అవార్డు దర్శకుడు రవి జాదవ్‌ తెరకెక్కిస్తున్న విభిన్న కథా వెబ్‌సిరీస్‌ ‘తాలి’ (Taali). సుస్మితాసేన్‌ (Sushmita Sen) ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నారు.

Updated : 11 Aug 2023 13:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓటీటీల రాకతో విభిన్న కథలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. జాతీయ అవార్డు దర్శకుడు రవి జాదవ్‌ తెరకెక్కిస్తున్న విభిన్న కథా వెబ్‌సిరీస్‌ ‘తాలి’ (Taali). సుస్మితాసేన్‌ (Sushmita Sen) ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ స్వాత్రంత్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జియో సినిమా వేదికగా హిందీ, తెలుగుతో పాటు, దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రంలో చెప్పారు. ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో సుస్మిత నటన, హావభావాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రాన్స్‌జెండర్‌ల హక్కుల పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా సుస్మితా సేన్‌ మాట్లాడుతూ..‘‘నా దగ్గరకు ఈ కథ రాగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకొన్నా. అయితే, ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కోసం సన్నద్ధం కావడానికి  ఆరున్నర నెలల సమయం పట్టింది. ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నప్పుడు అందుకోసం కొంత పరిశోధన కూడా అవసరం. ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్‌  ప్రశంసించదగిన వ్యక్తి. వివిధ కోణాల్లో ఆమె నాకు ఎంతో కనెక్ట్‌ అయ్యారు. ఈ సిరీస్‌ కోసం ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండటం నాకు దక్కిన అదృష్టం’’అని అన్నారు. తన కథను సిరీస్‌గా తీయడం పట్ల శ్రీగౌరి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ‘నా నిజ జీవిత పాత్రలో సుస్మితాసేన్‌ జీవించారు. నా జీవన ప్రయాణాన్ని ఆకళింపు చేసుకుని మరీ నటించారు. ఒక ముఖ్యమైన కథను ప్రజలకు చెబుతున్న చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. ట్రాన్స్‌జెండర్స్‌ పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరును ఈ సిరీస్‌ ప్రశ్నిస్తుంది. అంతేకాదు, ప్రజల్లోమార్పు తీసుకొస్తుందని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు