Tamil rockerz Review: రివ్యూ: తమిళ్‌ రాకర్స్‌

తమిళ్‌ రాకర్స్‌ ఎలా ఉందంటే..?

Updated : 19 Aug 2022 14:19 IST

వెబ్‌ సిరీస్‌: తమిళ్‌ రాకర్స్‌; నటీనటులు: అరుణ్‌ విజయ్‌, వాణి భోజన్‌, ఐశ్వర్యమేనన్‌, అగమ్‌ పెరుమాళ్‌, వినోదిని, జి.మరిమితు, తరుణ్‌ కుమార్‌, వినోద్‌ సాగర్‌ తదితరులు; సంగీతం: వికాస్‌ బాదిస; సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌; ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌; రచన: మనోజ్‌ కుమార్‌ కలైవనన్‌; దర్శకత్వం: అరివళగన్‌ వెంకటాచలం; స్ట్రీమింగ్‌ వేదిక: సోనీ లివ్‌

తమిళ్‌ రాకర్స్‌(Tamilrockerz).. నేటి యువతరానికి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కొత్త సినిమా విడుదలవటం ఆలస్యం.. మరుసటి రోజే మార్కెట్‌లోకి పైరసీ సీడీలు వచ్చేవి. కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలకు, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి షూటింగ్‌ చేసిన దర్శక-హీరోలకు వణుకు పుట్టించిన పైరసీ భూతానికి ఉన్న పేరే తమిళ్‌రాకర్స్‌. అలాంటి వారి ఇతివృత్తంతో అరివళగన్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ఇది. సోనీలివ్‌ వేదికగా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? అసలు తమిళ్‌ రాకర్స్‌ నేపథ్యం ఏంటి?

కథేంటంటే: రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన ఓ నిర్మాత తమిళ రాకర్స్‌ పైరసీ చేయడం కారణంగా నష్టాల పాలై ఆత్మహత్య చేసుకుంటాడు. మరోవైపు యాక్షన్‌ స్టార్‌ ఆదిత్య కథానాయకుడిగా మది (అజగమ్‌ పెరుమాళ్‌) అనే నిర్మాత రూ.300కోట్లతో ‘గరుడ’ అనే భారీ సినిమా నిర్మిస్తాడు. దీపావళికి విడుదల చేద్దామనుకునే సమయానికి ఆ సినిమాలోని వీడియో క్లిప్‌ను తమిళ్‌ రాకర్స్‌ విడుదల చేసి, పూర్తి సినిమాను విడుదల చేస్తామని బెదిరిస్తారు. దీంతో మది పోలీసులను ఆశ్రయిస్తాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఈ కేసును స్పెషల్‌ ఆఫీసర్‌ రుద్ర (అరుణ్‌ విజయ్‌)కు అప్పగిస్తుంది. సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ సంధ్య(వాణి భోజన్‌)తో కలిసి తమిళ్‌ రాకర్స్‌ను పట్టుకునేందుకు రుద్ర ఏం చేశాడు? అసలు తమిళ్‌ రాకర్స్‌ ఎలా పనిచేస్తారు? సినిమాలను ఎలా పైరసీ చేస్తారు? వీళ్ల నెట్‌వర్క్‌ ఏంటి? దీని వల్ల ఆ సంస్థకు వచ్చే లాభం ఏంటి? ఈ మొత్తం నెట్‌వర్క్‌ వెనుక ఎవరున్నారు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సగటు సినిమా ప్రేక్షకుడికి తమిళ్‌ రాకర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీలను వణికించిన పైరసీ నెట్‌వర్క్‌ ఇది. ఈ అంశాన్ని కథగా తీసుకుని వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు అరివళగన్‌ వెంకటాచలం పర్వాలేదనిపించారు. సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకోవడంతో కథను మొదలుపెట్టిన దర్శకుడు.. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో జరిగే చర్చ ద్వారా సినీ పరిశ్రమపై తమిళ్‌ రాకర్స్‌ ప్రభావం ఎంతలా ఉందో చూపించారు. అయితే, పైరసీ నేపథ్యాన్ని, దాని ప్రభావాన్ని చూపేందుకు అవసరమైన సన్నివేశాల కన్నా ఎక్కువ సీన్స్‌ ఎస్టాబ్లిష్‌ చేశాడు. దీనికి తోడు ఏసీపీ రుద్ర వ్యక్తిగత జీవితాన్ని కూడా జోడించటం.. ఆసక్తికరంగా సాగుతున్న కథనానికి కాస్త బ్రేక్‌లు వేసినట్లు అనిపిస్తుంది. తమ కథానాయకుడి సినిమా విడుదలైనప్పుడు అభిమానులు ఎలా ప్రవర్తిస్తారు? ప్రచారం కోసం నిర్మాతలు చేసే పనులేంటి? సినిమా విషయంలో దర్శకుడి సృజనాత్మకకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. హీరో తండ్రులు, ఇతరులు ఎలా వేలుపెడతారు? ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు టచ్‌ చేశాడు.

ఒక వైపు ఈ అంశాలను చెబుతూనే తమిళ్‌ రాకర్స్‌ పైరసీ చేసే తీరు, ఆడియో, వీడియో ఫైల్స్‌ను ఎలా మిక్స్‌ చేయడం.. ఇలా ఏ అంశాన్నీ దర్శకుడు వదల్లేదు. అయితే, వాటిని ఇంకాస్త ప్రభావవంతంగా చూపించాల్సింది. పైరసీ కారణంగా నిర్మాతలు ఏ విధంగా కూలిపోతున్నారో సంధ్య తండ్రి పాత్ర పోషించిన ఎం.ఎస్‌.భాస్కర్‌ ద్వారా భావోద్వేగంగా చూపించారు. అదే సమయంలో మధ్య తరగతి కుటుంబాలు, యువత అవసరాలను అవకాశంగా తీసుకుని.. తమిళ్‌ రాకర్స్‌ వాళ్లని వాడుకునే తీరును దర్శకుడు ప్రస్తావించాడు. పైరసీ సీడీలను అమ్మే వ్యక్తి తమిళ్‌ రాకర్స్‌ నెట్‌వర్క్‌ ప్రారంభించడానికి గల కారణం మాత్రం అంత బలంగా లేదు. పగ, ప్రతీకారంతోనే అది పుట్టుకొచ్చినట్లు చూపించారు. ఇటు రుద్రది కూడా ఒకరకంగా రివేంజ్‌ డ్రామానే. అన్ని అంశాలను దర్శకుడు చూపిస్తున్నా, ఏదీ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయదు. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా.. వెబ్‌సిరీస్‌ను 8 ఎపిసోడ్‌లకు తీసుకెళ్లారు. ఆరు లేదా ఏడు ఎపిసోడ్‌లకు పరిమితం చేసి ఉంటే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండేది. ఈ వీకెండ్‌లో ఏదైనా ఆసక్తికర వెబ్‌సిరీస్‌ చూడాలనుకుంటే కుటుంబంతో కూర్చొన్ని ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి ‘తమిళ్‌ రాకర్స్‌’ చూసేయొచ్చు. ఉత్కంఠగా అయితే ఏమీ ఉండదు.

ఎవరెలా చేశారంటే: పోలీస్‌ ఆఫీసర్‌ రుద్రగా అరుణ్‌ విజయ్‌ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. కథలో తానొక కీలక పాత్రగానే నటించారు తప్ప.. హీరోయిక్‌ అంశాలకు పోలేదు. వాణిభోజన్‌, ఐశ్వర్యమేనన్‌ పాత్రలకు పెద్దగా స్కోప్‌ లేదు. అజగమ్‌ పెరుమాళ్‌, మరిముత్తు, వినోద్‌ సాగర్‌.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. వికాస్‌ నేపథ్య సంగీతం ఓకే. బి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ ఈ వెబ్‌సిరీస్‌కు బలం. డార్క్‌ థీమ్‌, నైట్‌ ఎపిసోడ్స్‌ను బాగా చూపించారు. ఎడిటర్‌ వి.జె.సాబు జోసెఫ్‌ తన కత్తెరకు పెద్దగా పని చెప్పలేదు. అలాగే రుద్ర భార్య పూజ(ఐశ్వర్య మేనన్‌)పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు కత్తెరవేసి ఉంటే బాగుండేది. మనోజ్‌ కుమార్‌ ఇచ్చిన కథను డైరెక్టర్‌ అరివళగన్‌ వెంకటాచలం వెబ్‌ సిరీస్‌గా తీయడంలో ఓకే అనిపించారు. తమిళ్‌ రాకర్స్‌ నేపథ్యంతో తీస్తున్నప్పుడు నెరేషన్‌ ఇంకాస్త పకడ్బందీగా ఉంటే బాగుండేది. నిడివి విషయంలో వదిలేసినట్లు అనిపించింది. దీనికి కొనసాగింపు ఉన్నట్లు చివర్లో చూపించారు.

బలాలు
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌
+ నటీనటుల సెటిల్డ్ పెర్ఫామెన్స్‌
+ సంగీతం,సినిమాటోగ్రఫీ

బలహీనతలు
- ఊహించే కథనం
- ఎడిటింగ్‌

చివరిగా: తమిళ్‌ రాకర్స్‌.. అక్కడక్కడ మాత్రమే మెప్పిస్తుంది

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని