Published : 17 Jul 2021 01:09 IST

Sarpatta: పాన్‌ ఇండియా సినిమాగానే భావిస్తున్నా!

‘వరుడు’ చిత్రంతో ప్రతినాయకుడిగా పరిచయమై, ‘రాజా రాణి’తో ప్రేమికుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు ఆర్య. గత సినిమాలకు భిన్నంగా పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం ‘సార్‌పట్ట’. దీనికి పా.రంజిత్‌ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో జులై 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేదికగా ఆర్య ‘ఈనాడు-సినిమా’తో ముచ్చటించారు. ఆ విశేషాలివీ...

ఈ సినిమాని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం?

ఆర్య: స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ కల ఈ సినిమాతో నిజమైంది. ఈ సినిమా స్క్రిప్టు వినగానే నచ్చేసింది. కబిలన్‌ పాత్ర నన్ను బాగా ఆకర్షించింది. కొత్త అనుభవాన్నిచ్చింది. నాకు మనసుకు దగ్గరైన చిత్రమిది. ప్రేక్షకులకీ నచ్చుతుందని ఆశిస్తున్నా.

‘సార్‌పట్ట’ గురించి ట్రైలర్‌లో చూపించని విషయాలు చెప్తారా?

ఆర్య: దాదాపు కథని ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశాం. 1970ల్లో సాగే కథ ఇది. అప్పటి ఉత్తర మద్రాసులో బాక్సింగ్‌కి బీజం ఎప్పుడు పడింది? యుద్ధ వంశాల జీవితాలు, వారి సంస్కృతి తదితర అంశాలతో రూపొందింది. కబిలన్‌ (ఈ సినిమాలో ఆర్య పాత్ర) ఎలా బాక్సర్‌ అయ్యాడు? లక్ష్యం అందుకున్నాడా? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఫిట్‌నెస్‌ విషయంలో మీరు పర్‌ఫెక్ట్‌ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. అది ఈ పాత్రకి ఏమైనా సహకరించిందా?

ఆర్య: నేను వ్యక్తిగతంగా ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిస్తాను. అయితే అది ఈ పాత్రకి సరిపోదు. మంచి బాక్సర్‌ కనిపించాలంటే అంతకుమించి శ్రమించాలి. అందుకే ఎక్కువ సమయం కసరత్తులకే కేటాయించాను. సగటు బాక్సర్‌గా కనిపించేందుకు కఠినమైన శిక్షణ తీసుకున్నా. పాత్రకి సంబంధించి కొన్ని వర్క్‌షాపుల్లో పాల్గొన్నా.

దర్శకుడు పా.రంజిత్‌తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

ఆర్య: ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు పా.రంజిత్‌. తనకీ ఇది కొత్త నేపథ్యమే. ఎన్నో ఏళ్లు ఈ ప్రాజెక్టు కోసం రీసెర్చ్‌ చేశాడాయన. నాటి పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు తెరకెక్కించారు. ప్రతి పాత్ర ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. అప్పటి వాళ్లు ఎలా ఉండేవారు, ఎలా మాట్లాడేవారు, వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ తదితర విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకుని బెస్ట్‌ అవుట్‌పుట్‌ని తీసుకొచ్చారు. అలాంటి ప్రతిభావంతుడితో పనిచేయడం కొత్త అనుభూతిని పంచింది.

ఇప్పటికే బాక్సింగ్‌ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి ‘సార్‌పట్ట’ భిన్నంగా ఎలా ఉండబోతుంది?

ఆర్య: బాక్సింగ్‌ అనేకాదు.. క్రీడా నేపథ్యంలో ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. క్రీడాకారుడు బరిలో దిగిన ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠగా సాగడమే దీనికి కారణం. బాక్సింగ్‌ గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో ఓ నిర్ణీత కాలానికి సంబంధించిన బాక్సర్ల వంశాల గురించి చెప్పడం ఆసక్తికరం.

ఈ సినిమాలో పాటలు ఉన్నాయా?

ఆర్య: ఈ సినిమాలో రెండు పాటలున్నాయి. ఒకటి స్ఫూర్తి రగిలించే గీతం. మరొకటి వేడుక నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి సంతోశ్‌ నారాయణ్‌ అద్భుతమైన సంగీతం అందించారు.

మీ గతం చిత్రం ‘టెడ్డీ’ సైతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైనే విడుదలైంది. ఈ చిత్రానికీ అదే పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం?

ఆర్య: ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదు. థియేటర్లని దృష్టిలో పెట్టుకునే సినిమాల్ని తెరకెక్కిస్తాం. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల డిజిటల్‌ మాధ్యమంలో అవి ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఓ మంచి విషయం ఏంటంటే.. ఓటీటీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకి మన సినిమాలు చేరుతున్నాయి.

మీకు తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉంది. మళ్లీ ఎప్పుడు తెలుగు స్ట్రైయిట్‌ ఫిల్మ్‌ చేస్తారు?

ఆర్య: ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాను. కొన్నాళ్ల క్రితం మరో తెలుగు సినిమా ‘సైజ్‌ జీరో’లో నటించాను. మంచి ఆదరణ లభించింది. నేరుగా తెలుగు చిత్రం చేయాలని నాకూ ఉంది. చూద్దాం.. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను.

ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందుతున్నాయి. మీరింకేమైనా ఇలాంటి కథల్ని విన్నారా?

ఆర్య: ‘సార్‌పట్ట’ని పాన్‌ ఇండియా స్థాయి చిత్రంగానే భావిస్తున్నా. ఎందుకంటే ఇది ఓటీటీ వేదికగా విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ సినిమాని చూసే వీలుంది. కథ కూడా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతానికి పాన్‌ ఇండియా కథల్ని వినలేదు.

రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ‘రాపో 19’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో మీరు నటించనున్నారంటూ వార్తలొస్తున్నాయి. నిజమేనా?

ఆర్య: అది మంచి కాంబినేషన్. లింగుస్వామి పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌. అయితే ఈ ప్రాజెక్టులో నేను నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు.

తదుపరి ప్రాజెక్టులు?

ఆర్య: విశాల్‌తో కలిసి నటించిన ‘ఎనిమీ’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘అరన్‌మనై 3’ అనే తమిళ సినిమా చేస్తున్నాను.

సయేషాతో వివాహ జీవితం ఎలా ఉంది?

ఆర్య: చాలా బాగుంది. పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి ‘టెడ్డీ’ సినిమాలో నటించాం. ఆ చిత్రానికి మంచి స్పందన లభించింది. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని