Sonu Sood: నటుడిగా ఉత్తమ విలన్‌.. మనిషిగా ఉత్తమ హీరో

ఆయన చేసిన పనుల గురించి చెప్తే ‘సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి సాయపడవోయ్‌.. దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’ అని మహాకవి గురుజాడ చెప్పిన మాటలు గుర్తొస్తాయి.

Published : 30 Jul 2021 09:08 IST

ఆయన చేసిన పనుల గురించి చెబితే ‘సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి సాయపడవోయ్‌.. దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’ అని మహాకవి గురుజాడ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆయన పేరు చెప్తే ఎన్నో హృదయాలు ఉప్పొంగుతాయి. తెరపై ‘వదలను బొమ్మాళీ వదలా’ అని విలన్‌గా భయపెట్టినా, తెరవెనకా ‘మీకు సాయం చేయకుండా వదలను’ అంటూ రియల్‌ హీరోగా మారారు. ఆయనే భారతీయులంతా మెచ్చే సోనూ సూద్‌. సోనూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం...

సేవాగుణం.. చిన్నప్పుడే మొదలైంది

పంజాబ్‌లోని మోగాలో 1973లో జులై 30న జన్మించారు సోనూసూద్‌. సోనూ వాళ్లమ్మ ప్రొఫెసర్‌. నాన్న బట్టల వ్యాపారి. వీళ్ల దుకాణం ఎదుట వారానికొకసారి అన్నదాన కార్యక్రమం చేపట్టేవారు. ఇందులో సోనూ పాల్గొనేవాడు. నలుగురికి సాయపడటంలో ఉండే ఆనందం అప్పుడే సోనూకి అనుభవమైంది. దీనికితోడు ‘జీవితంలో నువ్వు ఏ స్థాయికి ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా.. అవసరంలో ఉన్నవారికి సాయపడినపుడే అసలైన విజయం అందుకున్నట్టు’ అని వాళ్లమ్మ చెప్పిన మాటలు సోనూకి స్ఫూర్తినిచ్చాయి. అలా పాఠశాల, కాలేజీ రోజుల్లో తనకి చేతనైన సాయం చేయడం ప్రారంభించాడు.

లాక్‌డౌన్‌ సమయంలో...

కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ వేదికగా కొందరు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే.. మరికొందరు ఎప్పటి నుంచో చేయాలనుకుని చేయలేని వాటిని పూర్తి చేశారు. సోనూ మాత్రం అలాంటి ఆలోచనలు లేవు. ఆపదలో ఉన్నవారిని ఎలా కాపాడాలి? ఇదొక్కటే ఆయనకున్న లక్ష్యం. అలా కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌లో తన స్నేహితులతో కలిసి చాలామంది ఆకలి తీర్చిన సోనూ, అదే సమయంలో సొంత ఊరికి నడిచిన వెళ్తున్న వారిని చూసి చలించిపోయారు. కొందరినైనా బస్సులో పంపాలనుకున్న సోనూ ఆలోచన లక్షల మందిని తమ ఇళ్లకు చేర్చే కార్యక్రమంగా మారింది. సోనూ సాయం వల్ల సుమారు ఎనిమిది లక్షల మంది బస్సులు, రైళ్లు, విమానాల్లో తమ సొంతూళ్లకి చేరుకున్నారు. వీరిలో విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులూ ఉన్నారు. చదువు, ఉపాధి, వైద్యం విషయంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి తన ఉదారత చాటుకున్నారు. ‘అన్నా.. సాయం చేయండి’ అంటూ ట్వీట్‌ చేయడమే ఆలస్యం ‘నేనున్నా’  అని భరోసా ఇచ్చి ఎన్నో ప్రాణాల్ని కాపాడారు. అప్పటి వరకూ నటుడిగా కొందరికే తెలిసిన సోనూ ఆ తర్వాత రియల్‌ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలూ చేయలేని పనుల్ని ఆయన చేశారు మరి!

కొవిడ్‌ ముగిసింది.. అంతా మెరుగవుతుందనుకునే లోపే సెకండ్‌ వేవ్‌ ముంచుకొచ్చింది. ఇప్పుడూ కొవిడ్‌ బాధితులు, వాళ్ల కుటుంబ సభ్యులకు ఒకే ఒక ధైర్యం సోనూసూద్‌. మొదటి దశ కంటే రెండో దశలో తన సేవల్ని విస్తృతం చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు, అంబులెన్స్‌లు, ఎయిర్‌ అంబులెన్స్‌లు, మందులు అందించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ సోనూ ఫౌండేషన్‌ బృందాలున్నాయి. నిరుద్యోగులకు, సివిల్స్‌కు సిద్ధమయ్యేవాళ్లకీ సోనూ అండగా నిలిచారు. ‘ఇదంతా నా కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం వల్లనే సాధ్యమైంది’ అని అంటుంటారు సోనూ.

విలన్‌గా చూసేందుకు ఎవరూ ఇష్టం పడట్లేదు..

సోనూ సాయం పొందిన వారే కాదు ఆయన సేవల గురించి తెలుసుకున్నవారూ ఇకపై సోనూని విలన్‌గా చూడలేమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్దలే కాదు చిన్నారులూ సోనూకీ ఫిదా అయిపోయారు. ‘ఆగడు’ సినిమాలో హీరో మహేశ్‌ బాబు.. విలన్‌ అయిన సోనూని కొడుతున్నాడని తను చూస్తున్న టీవీని బద్దలుకొట్టాడో బుడతడు. ఇదీ సోనూ మంచితనానికి నిదర్శనం.

సోనూ పేరు..

సోనూని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది తమ పిల్లలకి సోనూ పేరును పెట్టుకున్నారు. కొందరు తమ దుకాణాలకీ, సంస్థలకీ ఆయన పేరుని పెట్టారు. ఓ విమానంపై సోనూ ఫొటోని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఇలాంటివి చూస్తే ఎవరికైనా కొంచెం గర్వంగా ఉంటుంది. కానీ, సోనూ మాత్రం తన బాధ్యత మరింత పెరిగిందనుకుంటారు. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న దుకాణాలకి వెళ్లి సోనూ అక్కడి వారిని సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. సోనూనే సరదాగా విక్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాలెన్నో ఆయన కల్మషం లేని వ్యక్తి అని నిరూపించాయి.

తిరస్కరించిన పత్రికే సత్కరించింది..

ఆడిషన్‌ కోసం కెరీర్‌ ప్రారంభంలో ప్రముఖ మ్యాగజైన్‌ స్టార్‌డస్ట్‌కి సోనూ తన ఫొటోల్ని పంపించారు. అదే మ్యాగజైన్‌ ఇటీవల సోనూని కీర్తిస్తూ పెద్ద వ్యాసం రాసింది. ‘అప్పుడు నేను రిజక్ట్‌ అయ్యాను. ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సోనూ.

సినిమా ప్రస్థానం..

ఇంజినీరింగ్‌ చదివిన సోనూ మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. అటు నుంచి సినిమా రంగానికి వచ్చారు. తొలిసారి ‘కల్ల్లాజగర్‌’ అనే తమిళ సినిమాలో అవకాశం అందుకున్నారు. అలా 1999 ఫిబ్రవరి 6న నారాయణ పాత్రలో కోలీవుడ్‌ ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ద్వితీయ చిత్రం ‘నెంజినిలే’ (తమిళ్‌)లో సోనూగా కనిపించారు. దర్శకుడు శివ నాగేశ్వరరావు తెరకెక్కించిన ‘హ్యాండ్సప్‌’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో తుగ్లక్‌ అనే విభిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత ‘అమ్మాయిలు.. అబ్బాయిలు’, ‘సూపర్‌’, ‘అతడు’, ‘అశోక్‌’, ‘మిస్టర్‌ మేథావి’, ‘అరుంధతి’, ‘ఆంజనేయులు’, ‘బంగారు బాబు’, ‘ఏక్‌ నిరంజన్‌’, ‘శక్తి’, ‘తీన్‌మార్‌’, ‘కందిరీగ’, ‘దూకుడు’,‘ ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’, ‘జులాయి’, ‘ భాయ్‌’, ‘ఆగడు’ తదితర తెలుగు చిత్రాల్లోని విలక్షణమైన పాత్రలతో అలరించారు. వీటిల్లో ‘అరుంధతి’లో పోషించిన పసుపతి పాత్ర సోనూకి మంచి క్రేజ్‌ తీసుకొచ్చింది. ఉత్తమ విలన్‌గా ఆయనకు నంది అవార్డుని అందించింది. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ  సోనూ తనదైన ముద్ర వేశారు. ‘నటుడిగా వివిధ భాషా చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించాను. నిజ జీవితంలో సమస్యకు స్పందించడమే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర’ అని తన గొప్ప మనసుని చాటుకుంటారు సోనూ.

కుటుంబం..

2000 సంవత్సరంలో సోనాలీని పెళ్లి చేసుకున్నారు సోనూ. ఈ దంపతులకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నటుడిగా సోనూ విజయం చూడకముందే తన తల్లి మరణించారు. ఇదే ఆయన జీవితంలో చేదు జ్ఞాపకం. రెండేళ్ల క్రితం సోనూ తండ్రి మరణించారు.

రోజుకి 22 గంటలే..

సోనూ గడియారంలో 22 గంటలే ఉంటాయి. అదెలా అంటే.. సోనూకి వ్యాయామం అంటే ఎంతో ఇష్టం. అందుకే రోజూ 2 గంటలు కసరత్తులకే కేటాయిస్తారు. ఏ పని మానేసినా వ్యాయామం మాత్రం మానరు. సేవా విషయంలో సోనూని స్ఫూర్తిగా తీసుకుని దేశనలుమూలలా ఎంతోమంది తమకు తోచిన సాయం చేస్తున్నారు. ‘కొవిడ్‌ కాకపోతే మరొకటి.. ఏ సమస్యకైనా పరిష్కార మార్గం చూపాలనే సంకల్పం ఉండాలి’ అనే సోనూకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని