
Shriya: ఆయనలాగే నేనూ చివరి క్షణం వరకూ నటిస్తా: శ్రియ
ఇంటర్నెట్ డెస్క్: ‘అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) చివరి క్షణం వరకూ నటించారు. నేనూ అంతే’ అని ప్రముఖ కథానాయిక శ్రియ తెలిపారు. తాను నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకత్వం వహించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులివీ..
కథ విని ఏడ్చేశా..
సినిమాల పట్ల ఇటీవల నా అభిప్రాయం మారింది. ఇకపై ఎంపిక చేసుకునే కథలన్నీ నా కుటుంబ సభ్యుల్నీ గర్వపడేలా చేయాలనుకున్నా. అభినయానికే పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో వచ్చిందే ‘గమనం’. ఈ సినిమా కథ వినగానే నా కళ్లు చెమ్మగిల్లాయి. వెంటనే నటించేందుకు ఓకే చెప్పా. ఇందులో నేను దివ్యాంగురాలిగా కనిపిస్తా. పాత్రలో సహజత్వం ఉట్టిపడేందుకు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా.
ఆ ఘటనతో నా హృదయం బద్దలైనా.. షూటింగ్‌కి వచ్చా!
మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ గురించి చెప్పేదే ఈ ‘గమనం’. ఈ చిత్రంలో మనకి మనం కనిపిస్తాం. ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉంటుంది. దాన్ని అధిగమించే మార్గం ఈ సినిమాలో దర్శనమిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా ఫ్రెండ్ చనిపోయారు. నా హృదయం బద్దలైనా సరే షూటింగ్‌లో పాల్గొన్నా. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఈ కథ నాకు ప్రేరణగా నిలిచింది. ఈ సినిమాలో మూడు కథలు ఒకేసారి సాగుతుంటాయి. ప్రతి కథా ఎంతో స్ఫూర్తినిస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇది నాయికా ప్రాధాన్య చిత్రం కాదు.
వారితో కంఫర్ట్‌గా ఉంటుంది..
ఈ సినిమా కంటే ముందే ఇతర భాషల్లో లేడీ డైరెక్టర్లతో కలిసి పనిచేశా. మహిళల దర్శకత్వంలో నటించడం కంఫర్ట్‌గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా నిరభ్యంతరంగా చెప్పొచ్చు. సుజనా రావు ఈ చిత్రాన్ని అద్భతంగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.
అదే నా కోరిక..
ప్రేక్షకుల అభిమానం వల్లే ఇరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. నా తొలి సినిమా ‘ఇష్టం’ నుంచీ నన్ను ఆదరిస్తున్నారు. నటిగా ఇంతకాలం ప్రయాణించడం కొంచెం గర్వంగా ఉంది. తుదిశ్వాస వరకూ నటించాలనేదే నా కోరిక. ఈ విషయంలో ఏఎన్నారే నాకు స్ఫూర్తి. ఆయనతో కలిసి ‘మనం’ సినిమాలో నటించా. ఆరోజుల్ని ఎప్పటికీ మరిచిపోను. ఆయన తన జీవితంలోని చివరి క్షణం వరకూ నటించారు. సినిమా పూర్తయ్యాకే చనిపోతా అంటుండేవారు.
ఇప్పుడేం చెప్పలేను..
గర్భం దాల్చిన సమయంలోనూ నేను ఫిట్‌నెస్‌ను వదల్లేదు. పిల్లలు పుడితే అందరి ప్రపంచం మారిపోతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మనలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. మా పాప రాకతో ఈ విషయం నాకు తెలిసొచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గురించి ఇప్పుడేం చెప్పలేను. ఇది సందర్భం కాదు.
► Read latest Cinema News and Telugu News