Pushpa: ‘తగ్గేదేలే’.. వెనుక కథ ఇదే..!

సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘పుష్ప’ చిత్రం శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్‌-అల్లు అర్జున్‌ మాస్‌ కాంబినేషన్‌లో...

Published : 17 Dec 2021 14:57 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప’ చిత్రం శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్‌-అల్లు అర్జున్‌ మాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. బన్నీ అభిమానులందరూ ‘తగ్గేదేలే’ అంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్పరాజ్‌ మేనరిజం ‘తగ్గేదేలే’ గురించి, దాని వెనుక ఉన్న కథ గురించి ఇటీవల చిత్రబృందం ఇలా చెప్పుకొచ్చింది..!

‘‘పుష్ప’ ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌. పైకి ఊరమాస్‌ లుక్స్‌ కనిపించినప్పటికీ ఈ కథలో ఒక భావోద్వేగం ఉంటుంది. ఈ సినిమాలో హీరోకి ఏదైనా స్పెషల్‌ మేనరిజం ఉంటే బాగుంటుందని అనిపించింది. సినిమా షూట్‌ ప్రారంభించిన సమయంలో ఓ మేనరిజం ఫిక్స్‌ అయ్యాం. బన్నీ కూడా ఓకే అన్నారు. కానీ, సినిమా షూట్‌ ప్రారంభమయ్యాక.. ఫైట్‌ సీన్‌లో బన్నీ చేసిన మేనరిజం నాకు బాగా నచ్చింది. దాంతో బన్నీతో చెప్పి ఇప్పుడు మీరు చూస్తోన్న మేనరిజం (గడ్డం కింద చేయి పెట్టుకుని) ఫిక్స్‌ చేశాం. ఆ తర్వాత దానికి ‘తగ్గేదేలే’ అనే డైలాగ్‌ ఓకే చేశాం’’ అని సుకుమార్‌ చెప్పుకొచ్చారు. ఇదే ప్రెస్‌మీట్‌లో బన్నీ-సుకుమార్‌ పంచుకున్న విశేషాలివే..!

ఇది పీరియడ్‌ సినిమానా?

సుకుమార్‌: ఇది కూడా ఒక పీరియడ్‌ చిత్రమే. 1996 నుంచి 2004 నాటి రోజుల్ని ఈ సినిమాలో చూపించాం. సెల్‌ఫోన్‌ లేని టైమ్‌. కాకపోతే ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఇది పీరియడ్‌ సినిమా అయినప్పటికీ ఫిక్షనల్‌ కథతోనే తీశాం.

ఈ సినిమాలో మీ రోల్‌..?

అల్లు అర్జున్‌‌‌‌: పుష్పరాజ్‌ లాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. ‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత ఏదైనా విభిన్నమైన రోల్‌ చేయాలనుకున్నాను. అలా, ‘పుష్ప’లో నటించే అవకాశం వచ్చింది. ఈ రోల్‌కి నటుడిగా వందశాతం న్యాయం చేయాలని మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయా. మేకప్‌, ఫిజికల్‌ ట్రాన్ఫర్మేషన్‌, యాస అన్నీ అలా కుదిరేశాయి.

సుకుమార్‌: బన్నీ ముఖానికి మాత్రమే కాదు శరీరం మొత్తానికి మేకప్‌ వేసుకున్నాడు. ఒకవేళ ఏదైనా షాట్‌ గ్యాప్‌లో మేకప్ కాస్త చెరిగిపోయినా మళ్లీ మేకప్‌మ్యాన్‌ని పిలిచిపించి.. మరలా మేకప్‌ వేయించుకుని షాట్‌కి సిద్ధమయ్యేవాడు.

సుకుమార్‌, బన్నీ, ‘పుష్ప’ కథ.. వీటిల్లో దేన్ని నమ్మి ఈ సినిమాపై రూ.180 కోట్ల బడ్జెట్‌ పెట్టారు?

అల్లు అర్జున్‌‌‌‌: సినిమాని నమ్మి

నిర్మాత నవీన్‌: మూడింటిని

ఈ రోల్‌లో నటించడం మీకు కష్టంగా అనిపించిందా?

అల్లు అర్జున్‌‌‌‌: ఇలాంటి పాత్రల్లో నటుడిగా మనల్ని మనం నిరూపించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రతిషాట్‌లోనూ పూర్తిస్థాయిలో పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. అందరూ అడుగుతుంటారు ‘‘సర్‌.. మీకు కమర్షియల్‌ సినిమా చేయడం ఇష్టమా? లేదా నార్మల్‌ సినిమానా?’’ అని నాకు తెలిసినంతవరకూ సాధారణ చిత్రంకంటే కమర్షియల్‌ సినిమాలోనే పెర్ఫామెన్స్ ఎక్కువగా చూపించడానికి స్కోప్‌ ఉంటుందని నా భావన.

‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత వస్తోన్న ‘పుష్ప’, రానున్న ‘పుష్ప-2’పై మీ అంచనా ఎలా ఉంది? 

అల్లు అర్జున్‌‌‌‌: ప్రతి సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌ కావాలనే కోరుకుంటున్నా

అన్ని భాషల్లో మీరే డబ్బింగ్‌ చెప్పుకున్నారా?

అల్లు అర్జున్‌‌‌‌: తెలుగు వరకే డబ్బింగ్‌ చెప్పాను. తమిళం వచ్చు. కానీ సినిమా బాగా రావాలని నేను డబ్బింగ్‌ చెప్పలేదు. (నవ్వులు)

‘పుష్ప’ కమర్షియల్‌ చిత్రమా? లేదా ఏదైనా సందేశం ఉంటుందా?

సుకుమార్‌: ‘పుష్ప’ అనేది ఒక ఎమోషనల్‌ జర్నీ. మీకు పోస్టర్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్‌‌‌‌: కమర్షియల్‌ కథను ఇలా కూడా చెప్పొచ్చా అనేలా చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా చూసి ప్రతి ఒక్క డైరెక్టర్‌ సుకుమార్‌ దగ్గర క్లాసులు తీసుకుంటారు. అది జరక్కపోతే నేను షర్ట్‌ తీసేసి మైత్రీ ఆఫీస్‌లో తిరుగుతా (నవ్వులు). సినిమా హిట్‌ లేదా బ్లాక్‌బస్టర్ అనేది పక్కన పడితే ఆయన ప్రతి విషయంలో ఫుల్‌ పర్‌ఫెక్ట్‌గా ఉన్నారు. ఆయన వర్క్‌ అదిరిపోయింది. 

ఫహద్‌ ఫాజిల్‌తో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

సుకుమార్‌: దక్షిణాదిలో ఉన్న గొప్పనటుల్లో ఫహద్‌ ఒకరు. ఆయనతో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సునీల్ ప్రధాన ప్రతినాయకుడు‌. ఈ పార్ట్‌ వరకూ ఆయనే విలన్‌. ఆ కథను కంటిన్యూ చేసేది ఫహద్‌ ఫాజిల్‌.

బన్నీతో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

రష్మిక: సెట్‌కి వెళ్లినప్పుడు ఏం తెలియని అమ్మాయిలా వెళ్లాను. బన్నీతో వర్క్ చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నా. 

అల్లు అర్జున్‌‌‌‌: డైరెక్టర్‌ ఏం చెప్పినా అర్థం చేసుకుని అద్భుతంగా యాక్ట్‌ చేసింది. 

సంగీతం విషయంలో ఒత్తిడిగా ఫీలయ్యారా?

దేవిశ్రీప్రసాద్‌: నేను ఎప్పుడూ ఒత్తిడి ఫీలవలేదు. కొత్తగా చేయాలని అనుకున్నాను. 

మీ సినిమాల్లో హీరోలను ఏదో ఒక లోపంతో చూపిస్తారు ఎందుకు? 

అల్లు అర్జున్‌‌‌‌: ఆయనకు నార్మల్‌గా ఉంటే నచ్చదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని